హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ): భూ క్రమబద్ధీకరణ పథకం (ఎల్ఆర్ఎస్)పై కాంగ్రెస్ మాట తప్పింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎల్ఆర్ఎస్ను ఉచితంగా చేస్తామని, ప్రజల నుంచి ఎలాంటి రుసుం వసూలు చేయబోమని చెప్పి అధికారంలోకి రాగానే ప్లేట్ ఫిరాయించింది. పేద, మధ్య తరగతి కుటుంబాలపై రూ.లక్షల భారం మోపుతున్నది. ఖజానాను నింపుకోవడమే లక్ష్యం గా ఎల్ఆర్ఎస్ క్రమబద్ధీకరణకు ముందడుగు వేసింది. ఈ నేపథ్యంలోనే హెచ్ఎండీఏకు రూ.1,000 కోట్లు , జీహెచ్ఎంసీకి రూ.450 కోట్ల మేర ఖజానా నింపుకోవడానికి మార్గం సుగమం చేశారు.
రాబోయే మూడు నెలల్లోగా క్రమబద్ధీకరణను పూర్తి చేసేందుకు మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ వారం నుంచే దరఖాస్తులను పరిశీలించనున్నారు. ప్లాట్లను మూడు దశల్లో, లేఅవుట్లను నాలుగు దశల్లో క్రమబద్ధీకరించాలని నిర్ణయించారు. ఈ మేరకు పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి దాన కిశోర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇందుకోసం ఆయా జిల్లాల కలెక్టర్లు, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ కమిషనర్లు, రిజిస్ట్రేషన్, పంచాయతీ, రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారులు చొరవ తీసుకోవాలని సూచించారు.
క్రమబద్ధీకరణ దరఖాస్తులపై జారీచేసిన నోటీసులకు సంబంధించిన సమస్యలను నివృత్తి చేసేందుకు కలెక్టరేట్లు, స్థానిక సంస్థల కార్యాలయాల్లో సహాయ కేంద్రాలు ఏర్పాటుచేయాలని ప్రభుత్వం తెలిపింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ, మున్సిపాలిటీలు మినహా మిగిలిన ప్రాంతాల దరఖాస్తులను జిల్లా కలెక్టర్లు పర్యవేక్షించాలని ఉత్తర్వుల్లో పేరొంది.