హైదరాబాద్, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ): మూడు ఎస్సీ కార్పొరేషన్లను ఏర్పాటు చేస్తాం.. ఏటా రూ.750 కోట్ల కేటాయిస్తాం.. ఇదీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల ఎస్సీ డిక్లరేషన్లో ప్రకటించిన మ్యానిఫెస్టోలోని ప్రధాన అంశం. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ దానికి విరుద్ధంగా కేవలం మాల, మాదిగ కార్పొరేషన్లనే ఏర్పాటు చేయాలని ఉత్తర్వులను జారీ చేసి చేతులు దులుపుకున్నది. అయినా ఇప్పటికీ అడుగు ముందుకు పడలేదు. ఎంబీఎస్సీ కులాలను వేరుగానే గుర్తిస్తామని, ప్రత్యేక కార్పొషన్ను ఏర్పాటు చేస్తామన్న చేవెళ్ల డిక్లరేషన్ హామీని ఇప్పుడు ప్రభుత్వం అటకెక్కించింది.
రాష్ట్రంలో ఇటీవల నిర్వహించిన సమగ్ర సర్వేలో 52,17,684 మంది ఎస్సీ జనాభాగా ప్రభుత్వం నిర్ధారించింది. రాష్ట్రంలోని 59 షెడ్యూల్ కులాలను 3 గ్రూపులుగా విభజించింది. అత్యంత వెనుకబడ్డ ఎస్సీ కులాలకు కాకుండా మళ్లీ బలమైన ఎస్సీ కులాలకే అధిక శాతం రిజర్వేషన్లు ఇచ్చి పట్టం కట్టారని, రిజర్వేషన్ శాతాన్ని పెంచకుండా, 2000-2004 వరకు అమలైన వాటినే ఇప్పుడూ కొనసాగిస్తున్నారని 57 ఎంబీఎస్సీ కులాలు దుయ్యబడుతున్నారు.
తెలంగాణ షెడ్యూల్డ్ కులాల కో ఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రత్యేకమైంది. షెడ్యూల్డ్ కులాలన్నింటికీ సబ్సిడీ రుణాలను, వ్యవసాయాభివృద్ధి తదితర పథకాలను, ఎస్సీ నిరుద్యోగ యువతకు ఉపాధి శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన దళితబంధు పథకాన్ని కూడా ఈ ఎస్సీ కార్పొరేషన్ ద్వారానే క్షేత్రస్థాయిలో అమలు చేశారు. ఎస్సీ వర్గీకరణలోనూ మాల, మాల ఉపకులాలు, మాదిగ, మాదిగ ఉపకులాలు, ఇతర ఎస్సీ కులాలు అంటూ విభజించింది. ఎంబీఎస్సీ కులాలను ప్రత్యేకంగా గుర్తించలేదు. ఎంబీఎస్సీ కార్పొరేషన్ ఏర్పాటు పూర్తిగా ప్రశ్నార్థకంగానే మారింది.
మాల, మాదిగ కార్పొరేషన్లతో 57 కులాలను కలిపితే ఊరుకునేది లేదు. 57 ఎంబీఎస్సీ కులాలకు మరో కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. గత ఉమ్మడి ఎస్సీ కార్పొరేషన్ వల్ల మాల, మాదిగకులాలే పూర్తిగా లబ్ధిపొందాయి. ఇతర వెనకబడిన 57 ఎస్సీ కులాలు తీవ్రంగా నష్టపోయాయి. ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని అనేక పోరాటాలు చేశాం. ఆ మేరకు హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు విస్మరించడం దారుణం. ఇప్పటికైనా ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి.
– బైరి వెంకటేశం, 57 ఎస్సీ కులాల హకుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు