మనుషులు చచ్చిపోతారు.. కానీ మాటలు చచ్చిపోవు.. అన్నాడు కవి తిలక్! కొన్ని సార్లు మాటలు కూడా మరుపులో మాయమై పోవచ్చు. కానీ, మనిషికైనా మాటకైనా సాక్షి కాలం. కేవలం సాక్షిమాత్రమే కాదు కాలం తీర్పరి కూడా!
నిన్నగాక మొన్న పుట్టినవాళ్లు ఎన్ని మాటలైనా చెప్పవచ్చు. ‘ఒక్క చాన్స్ ప్లీజ్’ అంటూ ఖడ్గం సినిమాలో నటుడిలా డైలాగులు చెప్పవచ్చు. కానీ కాలప్రయాణంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణపై ఎన్ని ఖడ్గప్రహారాలు చేసిందో చరిత్రకు తెలుసు. ఆ పార్టీ తెలంగాణ ఇచ్చిందనే వాదన ఎంత అసంబద్ధమో.. ఎంత అసందర్భమో 60 ఏండ్ల చరిత్ర పుటలు విస్ఫుటంగా వివరిస్తూనే ఉన్నాయి.
ప్రత్యేక తెలంగాణ ఏర్పడి పదేండ్లయి.. రాష్ట్రం మూడోసారి (సాంకేతికంగా రెండోసారి) ఎన్నికలకు వెళ్తూ తెలంగాణ సమాజం భవిష్యత్తుకు ఓటువేయనున్నది. భావి ప్రయాణమార్గాన్ని నిర్ణయించుకోవాలంటే గతాన్ని గుర్తుచేసుకోవడం అత్యవసరం. ఒక పార్టీ ఇంతకుముందు ఏంచేసింది అన్నది సమగ్రంగా తెలుసుకున్నప్పుడే అది రేపు మనకు ఏం చేస్తున్నదనేది తెలుస్తుంది. ఒక రాజకీయ పక్షం తెలంగాణను ఎన్నిసార్లు ఎలా వంచించిందో అర్థమైనప్పుడే రేపు అది మనతోచేసే వ్యవహారమేమిటో మనసుకు పడుతుంది.
మాటల ఘాటుతో, గ్యారెంటీల ఆటతో ముందుకు వస్తున్న కాంగెస్ పార్టీ అసలు స్వభావమేమిటో తెలుసుకోవాలంటే 60 ఏండ్ల చరిత్ర పుస్తకాన్ని ఒక్క సారి తిరగవేయాల్సిందే! ఇవి విమర్శలు కావు.. ఆరోపణలు అంతకంటే కావు.. అబద్ధాలు ఎంతమాత్రమూ కాదు.. 60 ఏండ్ల చరిత్రలో రికార్డయిన నిఖార్సయిన వాస్తవాలు.
చరిత్ర ప్రతి సందర్భంలో ఏదో ఒక రకంగా రికార్డ్ అవుతూనే ఉంటుంది. ఎన్నో సంక్లిష్టతలను, అడ్డంకులను అధిగమించి విజయం సాధించిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమ చరిత్ర కూడా రికార్డు అయినప్పటికీ, ఇంకా విశ్లేషణ పూర్తిగా జరగలేదు. ఇందులో ముఖ్యమైనది ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో రాజకీయ పార్టీల పాత్ర గురించి చేసుకోవాల్సిన విశ్లేషణ. తొమ్మిదేండ్ల తెలంగాణ రాష్ట్ర అస్తిత్వం తర్వాత ఇప్పుడు తెలంగాణకు రాజకీయ పార్టీలు చేసిన అన్యాయాన్ని అంచనా వేసుకోవడం అవసరమా? అని ప్రశ్నలు రావచ్చు. దశాబ్దాలుగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడకపోవటానికి లేక ఆలస్యం కావడానికి కారణం తెలుసుకోకపోతే చరిత్రను సరిగా రికార్డు చేయకపోవటమే కాదు, భవిష్యత్తులో కూడా అప్రమత్తంగా ఉండలేం. 1956లో హైదరాబాద్ రాష్ట్రం అస్తిత్వం కోల్పోయినప్పటి నుంచి 2014లో తెలంగాణ ఏర్పడిన నాటివరకు జరిగిన ఘటనలను, వాటి వెనుక ఉన్న రాజకీయ ద్రోహాన్ని చారిత్రకంగా విశ్లేషణ చేయడమే ఈ వ్యాస పరంపర లక్ష్యం.
అడ్రస్ గల్లంతవుతుందనే..!
ఉద్యమం పతాకస్థాయిలో ఉన్నప్పుడు 2012లో ’తెలంగాణ ఇచ్చేదీ మేమే, తెచ్చేదీ మేమే’ అనే స్లోగన్‌ను కాంగ్రెస్‌వాళ్లు అందుకున్నారు. దీనికి కొనసాగింపుగా’ఇవ్వకపోతే చచ్చేదీ మీరే’ అని ప్రజలు స్లోగన్ ఇచ్చారు. సరిగ్గా ఈ చివరి వాక్యమే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెస్ ఒప్పుకునేలా చేసింది. ఆధునిక తెలంగాణ చరిత్ర నిజాం రాచరికపు కాలం తర్వాత 1 డిసెంబర్ 1949 వరకు మిలిటరీ పాలనలో, 1950 జనవరి నుంచి 1952 ఫిబ్రవరి వరకు ఎంకే వెల్లోడి పౌర ప్రభుత్వంతో మొదలైంది. ఫిబ్రవరి 1952 నుంచి 1956 నవంబర్ 1 వరకు మాత్రమే తెలంగాణ స్వీయ అధికారాన్ని అనుభవించింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం పదవ ఏట ప్రవేశిస్తున్నా, తెలంగాణ ఉద్యమం, ఆకాంక్షలు ఎన్నికల్లో ఎజెండాగా మారుతున్న ఈ సందర్భంలో తెలంగాణ రాజకీయ పార్టీలకూ, ప్రత్యేకించి కాంగ్రెస్ పార్టీకి ఉన్న సంబంధం చర్చించకపోతే రికార్డ్ అయిన చరిత్ర సమాచారంగా ఉంటుందే తప్ప చారిత్రక విశ్లేషణగా మారదు.
2012లో ’తెలంగాణ ఇచ్చేదీ మేమే, తెచ్చేదీ మేమే’ అనే స్లోగన్‌ను కాంగ్రెస్‌వాళ్లు అందుకున్నారు. ఈ స్లోగన్‌కు కొనసాగింపు ’ఇవ్వకపోతే చచ్చేదీ మేమే’ అని తగిలించబడింది. సరిగ్గా ఈ చివరి వాక్యమే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెస్ ఒప్పుకునేలా చేసింది.
తొలిద్రోహం – ఆంధ్రతో విలీనం
నెహ్రూ నేతృత్వంలోని కాంగ్రెస్ హైదరాబాద్‌పై ఏ ధోరణితో ఉండిందో మాట్లాడాలి. మొదట చాలా ప్రజాస్వామికంగా మాట్లాడిన నెహ్రూ, హైదరాబాద్ రాష్ట్రంలోని తెలంగాణను ఆంధ్రాతో కలిపేసి చారిత్రక తప్పిదం ఎందుకు చేశారో, తన అభిప్రాయాలకు వ్యతిరేకంగా సోమర్సాల్ట్ (పిల్లిమొగ్గలు) ఎందుకు వేశారో విశ్లేషిస్తేకానీ తెలంగాణ పరాధీన చరిత్రకు బీజం ఎక్కడ పడిందో అర్థం కాదు. చరిత్ర పుటల్ని తిరగేస్తే 14 జూలై, 1951లో హైదరాబాద్‌ను విభజించి భాషాప్రయుక్త రాష్ర్టాలను ఏర్పాటు చేయాలన్న ఆంధ్రా నేత అయ్యదేవర కాళేశ్వరరావు ప్రతిపాదనను తోసిపుచ్చి నెహ్రూ అన్న మాటలు వింటే అసలు ఈ నెహ్రూనేనా తెలంగాణను ఆంధ్రతో కలిపి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేసింది అనే ఆశ్చర్యం కలుగుతుంది. ‘ఆయన (అయ్యదేవర కాళేశ్వరరావు) మాటలు వింటుంటే నాకు భయం వేసింది. అలాంటిది నేను ఏమీ చేయబోవడం లేదు. ఆయన ఇంకా అట్లానే మాట్లాడితే అసలు ఆంధ్ర రాష్ట్రం అంటూనే ఉండదు’ అని కూడా నెహ్రూ బెదిరించిండు. ఇంతేకాదు నిజామాబాద్‌లో తొలిసారి ఆంధ్రాతో తెలంగాణ విలీనం గురించిన ప్రకటన చేస్తూ అమాయకపు పెళ్లికూతురిని గడసరి పెళ్లికొడుక్కి ఇచ్చి పెళి ్లచేస్తున్నట్టు ఉన్నదని వ్యాఖ్యానించారు. 1956 నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ ఆవిష్కరణ సభలో సైతం ఈ ‘పెండ్లిలో’ ఉన్న మంచి చెడుల గురించి ప్రస్తావించాడు. ఇన్ని విషయాలు మాట్లాడిన నెహ్రూ ఎందుకు ఆంధ్రతో కలిపేశారన్నదే ప్రశ్న.
బలవంతపు పెండ్లి చేయించిన పంతుళ్లు ఎవరు?
తెలంగాణకు ద్రోహం చేయడం అప్పటి నుంచే మొదలైంది. కాంగ్రెస్‌లో మొదటి నుంచి ఉన్న లక్షణం- ఉద్యమించేదీ కాంగ్రెస్సే, ద్రోహం చేసేదీ కాంగ్రెస్సే. తెలంగాణ కాంగ్రెస్ నాయకుల్లో రెండు గ్రూపులుండేవి. ఒకటి విశాలాంధ్రకు మద్దతు ఇచ్చేది, రెండోది తెలంగాణ ప్రత్యేకంగా ఉండాలని కోరుకునేది. హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ అధ్యక్షుడైన స్వామి రామానందతీర్థలాంటి వాళ్లు విశాలాంధ్రను సమర్థించారు. కేవీ రంగారెడ్డి, చెన్నారెడ్డి, జేవీ నరసింగరావు వంటి వాళ్లు ఆంధ్రాతో కలపడాన్ని వ్యతిరేకించారు. ఆ అనుకూలతకు ఈ వ్యతిరేకతకు సైద్ధాంతిక ప్రాతిపదిక ఏమీ లేదు. అదో వర్గం ఇదో వర్గం. ఒకరిపై ఒకరు పైచేయికి యత్నం. రెండు వర్గాలు అనేకసార్లు వర్గవైరుధ్యాలతో రోడ్ల మీద పడ్డాయి.
ఈ వైరుధ్యమే తెలంగాణ అనుకూలత వ్యతిరేకతలకు ప్రాతిపదిక. అంతే తప్ప ఒక రాష్ట్రం ఒక స్వాభిమానం ఇవేవీ కావు. అందుకే ఇటు అటు పిల్లిమొగ్గలు. ఉదాహరణకు హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు తొలుత విలీనాన్ని గట్టిగా వ్యతిరేకించి చివరకు మద్దతుదారుడిగా మారిపోయారు. హైదరాబాద్ (తెలంగాణ) కాంగ్రెస్ నాయకుల పిల్లిమొగ్గలకు, అసమర్థ నాయకత్వానికి కారణం కాంగ్రెస్ నిర్మాణంలోనే ఉన్నది. కాంగ్రెస్ పార్టీలో ఏ ప్రాంతీయ ఆకాంక్షలైనా కేంద్ర నాయకత్వ ఆధీనంలోనే ఉంటాయని ఆరు దశకాల్లో ప్రతీ సందర్భంలో రుజువవుతూ వచ్చింది. 1950ల నుంచే తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వం ఒక డిపెండెంట్ క్లాస్, అంటే ఒక ఆశ్రితవర్గంగా మారిపోయింది. ఫలితమే హైదరాబాద్ రాష్ట్రంలోని తెలంగాణ ప్రజలు అస్తిత్వాన్ని కోల్పోయి 58 ఏండ్లు పరాధీనంగా మారిపోవడం.
1950ల నుంచే తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వం ఒక డిపెండెంట్ క్లాస్, అంటే ఒక ఆశ్రితవర్గంగా మారిపోయింది. ఫలితమే హైదరాబాద్ రాష్ట్రంలోని తెలంగాణ ప్రజలు అస్తిత్వాన్ని కోల్పోయి 58 ఏండ్లు పరాధీనంగా మారిపోవడం.
నెహ్రూ దౌత్య వైఫల్యం
తెలంగాణ ప్రత్యేకంగా ఉంటే కేంద్రంలో ఉన్న కాంగ్రెస్‌కు వచ్చే నష్టమేమిటి అనే అంశాన్ని కూడా పరిశీలించాలి. హైదరాబాద్ సంస్థానంపై భారత ప్రభుత్వం పోలీస్ చర్య జరుపటంపై ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో నిజాం ప్రభుత్వం ఇచ్చిన ఫిర్యాదు అప్పటికి ఇంకా ఉన్నది. దీని నుంచి తప్పించుకోవాలంటే నెహ్రూకు హైదరాబాద్ స్టేట్‌లోని ఒక ముక్క కూడా తెలంగాణ రూపంలో ఉండకూడదు. ఈ అంశంపై ఆయన ప్రభుత్వం ఐక్యరాజ్యసమితిలో సమర్థంగా పోరాడలేకపోయింది. నెహ్రూ ముందున్న రాజకీయ కారణం, ఆంధ్ర కాంగ్రెస్ లాబీయింగ్ ప్రభావంలో కాంగ్రెస్ కేంద్ర నాయకులు, తెలంగాణ కాంగ్రెస్ నాయకుల తెలివితక్కువతనంతో కూడిన డిపెండెన్సీ – ఇవన్నీ కలిసి తెలంగాణను ఆంధ్రాకు అప్పచెప్పినాయి.
నెహ్రూతో మొదలు
1956 నుంచి 58 ఏండ్లు తెలంగాణ తన చిరునామాను, అస్తిత్వాన్ని కోల్పోవడానికి కారణం ఎవరు? దీనికి స్పష్టమైన సమాధానం కాంగ్రెస్ పార్టీ. నెహ్రూ, ఇందిర, రాజీవ్‌గాంధీ, సోనియాగాంధీ నేతృత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే హైదరాబాద్ రాష్ర్టాన్ని ఆంధ్రతో కలిపేసి ఆంధ్రప్రదేశ్‌ను ఏర్పాటు చేసిన నెహ్రూ కాలం నుంచి సోనియాగాంధీ నాటి కాంగ్రెస్ వరకు జరిగిన ఘటనలు, బలవంతపు ఒప్పందాలు, ఉద్యమాలు తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని ఎత్తి చూపిస్తాయి. ఈ ఆరు దశాబ్దాలలో తెలంగాణ ఉద్యమం తీవ్రంగా ఉన్న కాలాల్లో అధికారంలో ఉన్నది కూడా కాంగ్రెస్సే. ఉద్యమం స్తబ్దంగా ఉన్న కాలాల్లో అధికారంలో ఉన్న కాంగ్రెసేతర ప్రభుత్వాలు సైతం తెలంగాణ అంశాన్ని ఓట్ల కోసం వాడుకున్నాయే తప్ప ప్రజాస్వామికంగా వ్యవహరించలేదు. ఉద్యమం బలంగా ఉన్నపుడు అందరికంటే ఎక్కువ గొంతేసుకునే కాంగ్రెస్ నాయకులే ఏదో ఒక పదవి ఆశ చూపగానే ఉద్యమం చల్లార్చి సమైక్యరాగాన్ని అందుకునేవారు. ఈ ప్రాంత కాంగ్రెస్ నాయకులు వెన్నెముక లేని డూడూ బసవన్నలు కావడం వల్లనే ‘జై తెలంగాణ’ అనేవారిని లొంగదీసుకునే ఫార్ములాలో కాంగ్రెస్ అధిష్ఠానం ఆరితేరితే.. ఇటు ఎవరైనా నిజాయితీగా తెలంగాణ అన్నా విశ్వసించలేని స్థితికి ప్రజలూ చేరుకున్నారు.
తెలంగాణ కాంగ్రెస్ నాయకుల్లో రెండు గ్రూపులుండేవి. ఒకటి విశాలాంధ్రకు మద్దతు ఇచ్చేది, రెండోది తెలంగాణ ప్రత్యేకంగా ఉండాలని కోరుకునేది. హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ అధ్యక్షుడైన స్వామి రామానందతీర్థలాంటి వాళ్లు విశాలాంధ్రను సమర్థించారు. కేవీ రంగారెడ్డి, చెన్నారెడ్డి, జేవీ నరసింగరావు వంటి వాళ్లు ఆంధ్రాతో కలపడాన్ని వ్యతిరేకించారు. ఆ అనుకూలతకు ఈ వ్యతిరేకతకు సైద్ధాంతిక ప్రాతిపదిక ఏమీ లేదు. అదో వర్గం ఇదో వర్గం. ఒకరిపై ఒకరు పైచేయికి యత్నం.. అంతే..
కాంగ్రెస్ నమ్మక ద్రోహం
ప్రధాని నెహ్రూ, కేంద్ర హోం మంత్రి గోవింద వల్లభ పంత్, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు యూఎన్ థేబర్ ఒత్తిడికి హైదరాబాద్ సీఎం బూర్గుల రామకృష్ణరావు సహా అన్ని స్థాయిల కాంగ్రెస్ నేతలు తలొగ్గి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుకు వంత పాడారు. ‘ఢిల్లీ వెళ్లేముందు ప్రత్యేక తెలంగాణవాది అయిన బూర్గుల తిరిగి వస్తూనే విమానాశ్రయంలో పాత్రికేయులతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం వేరుగా ఉండుట నష్టదాయకమని, విశాలాంధ్ర ఏర్పడుట మంచిదని చెప్పిరి’ అని కేవీ రంగారెడ్డి స్వీయ చరిత్రలో రాసుకొన్నారు. బూర్గుల అభిప్రాయాన్ని మార్చింది కాంగ్రెస్ అధిష్ఠానం. విశాలాంధ్ర ఏర్పాటుకు సానుకూల వాతావరణాన్ని ఏర్పాటు చేయాలని, తెలంగాణవాదులను ఒప్పించాలని హైకమాండ్ కాంగ్రెస్ నాయకులకు హుకుం జారీచేసింది. కాంగ్రెస్ కార్యవర ్గనిర్ణయాన్ని అనుసరించాలని బూర్గుల అన్నారు (ఆంధ్రపత్రిక, 17 నవంబర్ 1955). తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు ఢిల్లీ చెప్పే దానికి తలూపడం అనే జబ్బు అప్పటి నుంచే ఉన్నదని దీనినిబట్టే స్పష్టమవుతున్నది. ఇంకోపక్క ఆంధ్ర కాంగ్రెస్ లాబీని అర్థం చేసుకోలేని వెర్రిబాగులతనం కూడా ఉండేది. తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వానికి ఆంధ్రా నాయకులకు దాసోహం అని ప్రకటించుకునే లక్షణం మొదలవుతున్న కాలం ఇది.
‘తెలంగాణ – కాంగ్రెస్ పార్టీ – 60 ఏండ్ల వంచనాపర్వం’పై చరిత్ర పరిశోధకుడు డాక్టర్ఎంఏ శ్రీనివాసన్ రాసిన ప్రత్యేక కథనాలు నేటి నుంచి..