హైదరాబాద్, అక్టోబర్ 17 (నమస్తే తెలంగాణ) : ‘జూబ్లీహిల్స్‌లో శుక్రవారం కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ ప్రక్రియ అంతా రౌడీలతో నిండి ఉన్నది. అది కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ ప్రక్రియా? లేక అంతర్రాష్ట్ర రౌడీల ప్రదర్శనా? అన్న అయోమయం నెలకొన్నది’ అని బీఆర్ఎస్ ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి ఎద్దేవా చేశారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో శుక్రవారం కోరుట్ల ఎమ్మెల్యే కే సంజయ్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ కార్యక్రమంలో రౌడీలు కత్తులు, కటార్లతో వీరంగం చేశారని, బందోబస్తులో ఉన్న పోలీసులు మాత్రం చోద్యం చూస్తూ, వారికి స్వాగతం పలికారని ధ్వజమెత్తారు. నేరచరిత్ర ఉన్న వారందరినీ ఒకేచోట చేర్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కిందని తెలిపారు. నామినేషన్ కార్యక్రమంలోనే ఇలా రౌడీయిజాన్ని ప్రదర్శిస్తే, కాంగ్రెస్ అభ్యర్థి నవీన్‌యాదవ్ గెలిచాక పరిస్థితి ఎలా ఉంటుందో అనేది ప్రజలు ఆలోచించుకోవాలని చెప్పారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభివృద్ధి కోసం సౌమ్యురాలైన బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతాగోపీనాథ్ గెలువాలా? లేదా ? అని స్థానిక ప్రజలు ఆలోచించుకోవాలని హితవు పలికారు. కాంగ్రెస్ రౌడీ కల్చర్ పోవాలంటే బీఆర్ఎస్ గెలువాలని కోరారు. గత కాంగ్రెస్ అభ్యర్థి అజారుద్దీన్‌ను ఓడించేందుకు ఎంఐఎం తన అభ్యర్థిని రంగంలోకి దించిందని, ఇప్పుడెందుకు పోటీలో నిలపలేదని ఆ పార్టీ అధినేత అసదుద్దీన్‌ను ప్రశ్నించారు. బీహార్ ఎన్నికల్లో పోటీచేస్తున్న ఎంఐఎం.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఎందుకు పోటీ చేయడం లేదు? అని నిలదీశారు. కేసీఆర్ హయాంలో జూబ్లీహిల్స్ విశేష అభివృద్ధి జరిగిందని, ఆ అభివృద్ధి ఆనవాళ్లు అసదుద్దీన్‌కు ఎందుకు కనిపించడం లేదో ఆయనే చెప్పాలని పేర్కొన్నారు. బీఆర్ఎస్, బీజేపీ సిద్ధాంతాలు వేరని, ఈ రెండు పార్టీలు కలసి ఎన్నడూ పనిచేయబోవని స్పష్టం చేశారు. దొంగ ఓట్లతో జూబ్లీహిల్స్‌లో గెలిచేందుకు కాంగ్రెస్ చేస్తున్న యత్నాలను అడ్డుకుంటామని హెచ్చరించారు. కాంగ్రెస్ రౌడీయిజానికి ఓట్లు పడబోవని సుధీర్‌రెడ్డి చెప్పారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ ప్రక్రియలో రౌడీలు కత్తులు, కటార్లను ప్రదర్శిస్తుంటే, పోలీసులు చోద్యం చూడటమేమిటని కోరుట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే కే సంజయ్ ప్రశ్నించారు. ప్రచారానికి వెళ్తున్న తమ కార్యకర్తలను అభ్యర్థి నవీన్‌యాదవ్ అనుచరులు బెదరిస్తున్నారని విమర్శించారు. ఈ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కమిషన్, పోలీసుల తీరు మారాలని కోరారు. సీఎం ఏకంగా గన్ కల్చర్‌నే ప్రోత్సహిస్తుంటే, కాంగ్రెస్ అభ్యర్థి అనుచరులు కత్తులతో వీరంగం చేయరా? అని దుయ్యబట్టారు. సినిమాల్లోనే విలన్లను చూశామని, కానీ, కాంగ్రెస్ నామినేషన్ ర్యాలీలో మళ్లీ అదే రౌడీలను ప్రత్యక్షంగా చూశామని తెలిపారు. నామినేషన్ ప్రక్రియ, రౌడీల ప్రదర్శన వల్ల ట్రాఫిక్ సమస్య తలెత్తిందని, గంటల తరబడి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగినా పోలీసులు ఏ మాత్రం పట్టించుకోలేదని తెలిపారు. రౌడీయిజాన్ని ప్రజలు సహించరని, జూబ్లీహిల్స్‌లో బీఆర్ఎస్ను కచ్చితంగా గెలిపించుకుంటారని స్పష్టంచేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే భాస్కర్‌రావు, బీఆర్ఎస్ నేతలు ప్రశాంత్‌కుమార్‌రెడ్డి, ఆగయ్య పాల్గొన్నారు.