KTR | రేపటి తెలంగాణ నిర్మాతలు మీరు.. భవిష్యత్ నిర్ణేతలు మీరే అని యువతను ఉద్దేశించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అలాంటి యువతను కాంగ్రెస్ సర్కార్ మోసం చేస్తున్నదని మండిపడ్డారు. మీకు జరిగిన మోసం, వంచనను గుర్తుచేసుకుని కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.
హైదరాబాద్ సరూర్‌నగర్‌లో బీఆర్ఎస్ తలపెట్టిన యువ సంగ్రామ సదస్సులో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. సరిగ్గా 38 నెలల కింద ఇదే సరూర్ నగర్ స్టేడియం సాక్షిగా తెలంగాణ యువత దగా పడిందని తెలిపారు. నిరుద్యోగులను వంచించిన దగాకోరులు కాంగ్రెస్ నాయకులు అని పేర్కొన్నారు. హైకమాండ్ తరలివచ్చి మాయామశ్చీంద్ర కార్యక్రమం ఇక్కడ చేశారని ఎద్దేవా చేశారు. యూత్ డిక్లరేషన్ పేరిట దుర్మార్గమైన వాగ్దానాల వరద పాటించారని మండిపడ్డారు. పాత కేటుగాళ్లు.. కొత్త డూప్లికేట్లు వచ్చి యువతపై లేని ప్రేమను కనబరిచారని తెలిపారు.
యూత్‌కు ఇచ్చిన ఒక్క హామీ అయినా నెరవేర్చారా అని కేటీఆర్ ప్రశ్నించారు. ఎన్నికల ముందు హామీ ఇచ్చిన రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చారా అని నిలదీశారు. ప్రైవేటు కంపెనీల్లో 75 శాతం రిజర్వేషన్ వచ్చిందా అని అడిగారు. కాలేజీ విద్యార్థినులకు స్కూటీలు వచ్చాయా? యువతకు రూ.10లక్షల రుణాలు వచ్చాయా? ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు వచ్చాయా? అని ప్రశ్నించారు. నాలుగు ట్రిపుల్‌ఐటీలు, మూడు యూనివర్సిటీలు వచ్చాయా? నెలకు రూ.4వేల భృతి వచ్చిందా? పదో తరగతిలో రూ.10వేలు, ఇంటర్ పాసైతే రూ.15వేలు వచ్చాయా? డిగ్రీ ఉత్తీర్ణులతై లక్ష వచ్చాయా? పీహెచ్డీ పాసైతే రూ.5లక్షలు వచ్చాయా? అని ప్రశ్నించారు. ఇంత మోసానికి పాల్పడిన వారిని ఏమనాలో ఆలోచించాలని సూచించారు. దగుల్బాజీలా.. దోకేబాజ్లు అనాలో మీరే ఆలోచించాలన్నారు.
జిత్తులమారి ముసలి నక్క కాంగ్రెస్ యువజనాన్ని తెలివిగా చిత్తు చేసిందని కేటీఆర్ విమర్శించారు. 60 ఏళ్లు నెత్తురు మరిగిన కాంగ్రెస్ యువతను ఎలా మోసం చేసిందో గుర్తించాలన్నారు. కాంగ్రెస్ మోసపు వలలో పడిపోయి గోసపడుతున్నారని తెలిపారు. 31 నెలలు గడిచాయి.. నిరుద్యోగులకు కాంగ్రెస్ ఏం చేసిందని ప్రశ్నించారు. మాటతప్పి వంచించి, నమ్మించి నట్టేట ముంచి అధికారంలోకి వచ్చిందని కాంగ్రెస్‌పై మండిపడ్డారు. యువతరంతో పెట్టుకుంటే కొన్ని తరాలు పుట్టగతులు ఉండవని హెచ్చరించారు.