Komatireddy Rajgopal Reddy | తనకు మంత్రి పదవి రాకుండా జానారెడ్డి అడ్డుకుంటున్నాడని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సంచలనంగా మారాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ శంకర్ నాయక్ స్పందించారు. మంత్రి పదవికి రాజగోపాల్ రెడ్డి అర్హుడే.. కాంగ్రెస్ అధిష్ఠానం పదవి ఇస్తానంటే ఎవరూ అడ్డురారని చెప్పారు. రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తానంటే అడ్డుకునే వ్యక్తిత్వం జానారెడ్డిది కాదని తెలిపారు.
ఉమ్మడి నల్లగొండ జ్లిలాకు మూడో మంత్రి పదవి ఇస్తానంటే తాము కూడా సంతోషిస్తామని శంకర్ నాయక్ అన్నారు. రాజగోపాల్ రెడ్డి పదవికి, జానా రెడ్డి లేఖకు సంబంధం లేదని అన్నారు. జానా రెడ్డి లేఖ రాసిన మాట వాస్తవమేనని తెలిపారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో ఉన్న మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుత ఎమ్మెల్యేలు అందరూ కలిసి జానా రెడ్డిని కలిసి, అధిష్ఠానానికి ఫోన్ చేయమని విజ్ఞప్తి చేశారని చెప్పారు. అప్పుడు ఫోన్ చేయనని జానా రెడ్డి చెప్పారని తెలిపారు. కనీసం అధిష్ఠానానికి లేఖ అయినా రాయమని అడగ్గా.. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాకు ప్రాధాన్యత ఇవ్వాలని రాశారని వివరణ ఇచ్చారు. కానీ రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వొద్దని లేఖలో ఎక్కడా రాయలేదని స్పష్టం చేశారు.
మంత్రి పదవి విషయంలో మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి నిన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు అధిష్ఠానం మంత్రిపదవి ఇస్తానంటుంటే.. సీనియర్‌నేత జానారెడ్డి అడ్డం పడుతున్నారని ఆరోపించారు. ధర్మరాజులా ఉండాల్సిన వ్యక్తి.. ధ్రుతరాష్ర్టుడిలా వ్యవహరిస్తున్నారని తీవ్ర విమర్శలు గుప్పించారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన నేతలకు మంత్రివర్గంలో చోటు కల్పించాలని అధిష్ఠానానికి జానారెడ్డి రాసిన లేఖపైనా రాజ్‌గోపాల్‌రెడ్డి మండిపడ్డారు. 30 ఏండ్లు మంత్రి పదవి అనుభవించిన జానారెడ్డికి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు మంత్రి పదవి ఇవ్వాలనే విషయం ఇప్పుడు గుర్తుకు వచ్చిందా అని ప్రశ్నించారు. భారత క్రికెట్ జట్టులో ఒక ఇంట్లో నుంచి ఇద్దరు క్రికెటర్లు ఉన్నట్టే… మంత్రివర్గంలో ఒకే కుటుంబం నుంచి ఇద్దరు మంత్రులుంటే తప్పా? ప్రశ్నించారు. మంత్రి పదవి అడుక్కుంటే వచ్చేది కాదని, కెపాసిటీతో వస్తుందని చెప్పారు. చం డూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన కార్యవర్గంలోనూ రాజగోపాల్‌రెడ్డి మంత్రి పదవిపై వ్యాఖ్యలు చేశారు. మంత్రి పదవి ఇచ్చే సమయంలో జానారెడ్డి అధిష్ఠానానికి లెటర్ పెట్టడంతో ప్రక్రియ మళ్లీ మొదటకు వచ్చిందని అసంతృప్తి వ్యక్తంచేశారు.