హైదరాబాద్, మార్చి 4 (నమస్తే తెలంగాణ): తనకు అత్యంత సన్నిహితుడు, ఓటుకు నోటు కేసులో నిందితుడు వేం నరేందర్‌రెడ్డిని ఎమ్మెల్సీ చేయడానికి సీఎం రేవంత్‌రెడ్డి చేసిన లాబీయింగ్ ఎట్టకేలకు ఫలించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ అభ్యర్ధిగా తొలి జాబితాలోనే ఆయన పేరును ఖారారు చేసినట్టు సమాచారం. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తదితరులు ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారుపై తుది కసరత్తు చేసినట్టు తెలిసింది. ఈ మేరకు సీఎం రాజకీయ సలహాదారుడు వేం నరేందర్‌రెడ్డి, టీపీసీసీ జనరల్ సెక్రటరీ అద్దంకి దయాకర్ పేర్లతో తొలి జాబితాను టీపీసీసీ రూపొందించినట్టు సమాచారం. ఈ జాబితాను ఒకటి రెండు రోజుల్లో కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నట రాజన్ వద్దకు పంపనున్నారని గాంధీభవన్ వర్గాలు తెలిపాయి. ఆమెతో చర్చించిన తనంతరం లిస్టును యథాతథంగా అధిష్ఠానానికి పంపే అవకాశం ఉందని పార్టీ శ్రేణులు అనుకుంటున్నాయి.
వేం నరేందర్‌రెడ్డిని ఎంపిక చేయడానికి సీఎం రేవంత్‌రెడ్డి వ్యూహాత్మకంగా అడుగులు వేసినట్టు తెలిసింది. ఈ ప్రతిపాదనను కీలక మంత్రి ఒకరు వ్యతిరేకించే అవకాశం ఉందని తెలిసిన సీఎం, అభ్యర్థుల ఎంపికలో కీలకంగా వ్యవహరించే బాధ్యులతో ముందుగానే లాబీయింగ్ చేసినట్టు కాంగ్రెస్ శ్రేణుల్లో చర్చ జరగుతున్నది. ముందుగా భట్టి విక్రమార్కను ఒప్పించి, ఆ తరువాత టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్‌తో కలిసి వేం నరేందర్‌రెడ్డి పేరును ప్రతిపాదించినట్టు సమాచారం. నలుగురు సభ్యులున్న ఎంపిక కమిటీలో ముగ్గురు వేం నరేందర్‌రెడ్డికి అనుకూ లంగా ఉండటంతో నాలుగో సభ్యునిగా ఉన్న కీలక మంత్రి మౌనంగా ఉండిపోయినట్టు కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. 2015లో అప్పటి టీడీపీ అధ్యక్షుడు, ఎపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి ఇదే వేం నరేందర్‌రెడ్డిని అడ్డదారిలో ఎమ్మెల్సీని చేసేందుకు రేవంత్‌రెడ్డి విఫలయత్నం చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటన ఓటుకు నోటు కేసుగా రెండు రాష్ర్టాల్లో సంచలనమైంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల్లోనే వేం నరేందర్‌రెడ్డిని ముఖ్యమంత్రి తన సలహాదారుగా నియమించుకున్నారు.
ఎమ్మెల్యేల సంఖ్యా బలాన్నిబట్టి మూడు స్థానాలు కాంగ్రెస్‌కు, ఒక స్థానంలో బీఆర్ఎస్ పార్టీకి దక్కనున్నాయి. ఐదో స్థానం కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య హోరాహోరి పోటీ ఉండనుంది. ఈనేపధ్యంలో పోత్తులు, రాజకీయ సమీకరణాల కోసం కాంగ్రెస్ పార్టీ రెండు స్థానాలు పక్కన పెట్టి, మరో రెండు స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేసినట్టు తెలిసింది.