వరంగల్, జూన్ 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఉమ్మడి వరంగల్‌లోని మొత్తం 11 అసెంబ్లీ సెగ్మెంట్లలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరిలో సీతక్క, సురేఖ మంత్రి పదవులు చేపట్టారు. పొంగులేటి ఇటీవల జిల్లా ఇన్చార్జి మంత్రిగా నియమితు లయ్యారు. కానీ వీరి పనితీరు చూస్తుంటే మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య విభేదాలు ఉన్న ట్టు, అవి ఇటీవలి కాలంలో మరింత తీవ్రమైనట్టు కార్యకర్తలు చెప్పుకుంటున్నారు. ఇన్చార్జి మంత్రి పొంగులేటి మూడు నెలలుగా వరంగల్ ఉమ్మడి జిల్లాలోని ఏ నియోజకవర్గంలోనూ పర్యటించలేదు. ఒక్క ఎమ్మెల్యే కూడా ఆయనను ఆహ్వానించలేదు. దీంతో ఆయన కలెక్టరేట్లో సమీక్షలకే పరిమితమవుతున్నారు.
సఖ్యతలేని కరువు
నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మంత్రి పదవి రాలేదన్న అసంతృప్తితో ప్రభుత్వ కార్యక్రమాలను పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి నియోజకవర్గం సమీక్షలకు మంత్రులను ఆహ్వానించడం లేదు. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి, మంత్రి సురేఖకు తీవ్రమైన విభేదాలు కొనసాగుతున్నాయి. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినీరెడ్డి, స్థానిక కాంగ్రెస్ నాయకురాలు ఝాన్సీరెడ్డి మంత్రులతో నిమిత్తం లేకుండానే పనులు చేసుకుంటున్నారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజుకు కొండా సురేఖకు పొసగడం లేదు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, మంత్రి కొండా సురేఖ మధ్య మొదటి నుంచి విభేదాలు ఉన్నాయి. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన కడియం శ్రీహరి ఉమ్మడి జిల్లాలోని ఇద్దరు మంత్రులకు దూరంగానే ఉంటున్నారు. మహబూబాబాద్, డోర్నకల్ నియోజకవర్గాల్లో జరిగే ప్రభుత్వ కార్యక్రమాలకు మొదట్లో ఇన్చార్జి మంత్రి పొంగులేటి హాజరయ్యే వారు. రెండు నెలులగా ఇక్కడి ఎమ్మెల్యేలు రాంచంద్రూనాయక్, మురళీనాయక్ ఆయనను ఆహ్వానించడంలేదు.