 
                                                            నయీంనగర్, అక్టోబర్ 30: వరద బాధితులను ఆదుకుంటామని చెప్తూనే… వరంగల్ పశ్చిమ నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి విడుదల చేసిన వీడియో వివాదాస్పదమవుతున్నది. అధికారపార్టీ ఎమ్మెల్యే అయి ఉండి, ప్రభుత్వం నుంచి సాయం తీసుకురాకుండా.. బాధితులను అవమానిస్తారా అంటూ విపక్షాలు మండిపడుతున్నాయి. వివరాల్లోకి వెళ్తే.. వరద విలయంలో చిక్కుకున్న వారిని ఆదుకుంటామంటూ నాయిని రాజేందర్‌రెడ్డి వీడియో విడుదల చేశారు. గురువారం పెండ్లిళ్లు శుభకార్యాలు చాలా ఉన్నందున.. ఆహారం మిగిలిపోతే కార్యక్రమాల నిర్వాహకులు తమకు సమాచారం అందించాలని కోరారు. ఫంక్షన్ల వద్దకు తమ టీమ్స్‌ను పంపిస్తామని, ఆహారాన్ని సేకరించి… బాధితులకు పంపిణీ చేస్తామని చెప్పారు.
రాజేందర్‌రెడ్డి వ్యాఖ్యలపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బాధితులను ఆదుకోవాలనే ఆలోచన ఉంటే… ఆహారం తయారు చేయించి, పంపిణీ చేయొచ్చు కదా అని సూచిస్తున్నారు. ఫంక్షన్లలో మిగిలిన అన్నాన్ని పంచిపెడుతామని చెప్పడం దారుణమని మండిపడుతున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే.. ప్రభుత్వం వద్ద ఉన్న ప్రజాధనాన్ని తీసుకొచ్చి కూడా బాధితులను ఆదుకోవచ్చని సూచిస్తున్నారు. తుపాను హెచ్చరికలపై ప్రభుత్వం అలసత్వం వహించడమే కాకుండా… అధికార పార్టీ నేతలు అవమానించడం మరింత దారుణమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
 
                            