సూర్యాపేట, జూన్ 10 (నమస్తే తెలంగాణ) : సూర్యాపేట జిల్లా తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు మరో వివాదంలో చిక్కుకున్నారు. నియోజకవర్గ కాంగ్రెస్‌లో కుమ్ములాటలతోపాటు పలు ఆరోపణలు ఆయనపై వస్తుండగా, తాజాగా ఓ స్టింగ్ ఆపరేషన్‌లో ఆయన బండారం బట్టబయలైంది. మద్యం సిండికేట్ నిర్వాహకుల నుంచి ఎమ్మెల్యే మామూళ్లు అంటూ ఓ వీడియో వైరల్ అవుతుండగా, వైన్స్ యజమానులతో ఎమ్మెల్యే డబ్బులు డిమాండ్ చేస్తున్నట్టు అర్థం అవుతున్నది. ఎమ్మెల్యే సామేల్‌తో బేరసారాలాడుతూ మద్యం మాఫియా స్టింగ్ ఆపరేషన్ చేసినట్టు సమాచారం. ఎమ్మెల్యే మామూళ్ల వ్యవహారం బయటపెట్టాలనే ఉద్దేశంతోనే సీక్రెట్ కెమెరాతో సిండికేట్ మాఫియా ఆపరేషన్ చేసిందని ప్రచారం. ‘ఎన్నికల్లో కోట్లు ఖర్చు పెట్టా.. అదంతా రికవరీ కావాలి. మళ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తనో? లేదో? తెలియదు.. నాకు రోజుకు రూ.లక్ష ఖర్చు వస్తుంది.. డీజిల్‌కు కూడా డబ్బుల్లేవ్.. ప్ర భుత్వం ఇచ్చే జీతం సరిపోవడంలేదు.. మీరిచ్చే మామూలు నాకు టీ ఖర్చులకు కూ డా సరిపోవు.. నా మాట వినని వారి సం గతి చూస్తా’ అంటూ ఎమ్మెల్యే సామేల్ అన్న వ్యాఖ్యలు ఆ వీడియోలో వినిపిస్తున్నాయి.
ఎమ్మెల్యే మందుల సామేలుకు సొంత పా ర్టీ నేతలతో పొసగడం లేదు. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని కార్యకర్తలు తరచూ ఆరోపిస్తున్నారు. ఇసుక విషయంలో తట్టెడు కూడా ఎత్తనివ్వనని ఎన్నికల ముందు ఊరూరా తిరిగి ప్రచారం చేసి.. నేడు ఆయన తన కుమారులతోనే దందా నడిపిస్తున్నారని కాంగ్రెస్ నాయకులు వీడియోలతో సహా గతంలో బయటపెట్టారు. పోలీసులకు చెప్పి ఎమ్మెల్యే చితక బాదించారని మనస్తాపంతో శాలిగౌరారం మండలానికి చెందిన నాగరాజు అనే వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడన్న ఘటన అప్పట్లో సంచలనం సృష్టించింది. అలాగే అనేక సందర్భాల్లో సొంతపార్టీ నాయకులను ఇబ్బందులు పెట్టారని పలువురు ఆరోపిస్తున్నారు.
తనపై వస్తున్న అవినీతి ఆరోపణలపై తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు స్పందించారు. తనపై అసత్య ఆరోపణలు చేస్తూ వీడియో తీసిన వ్యక్తులపై విచారణ జరిపించాలని తుంగతుర్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన ఇంట్లోకి వచ్చి టీ తాగిన వారే ఇంకా వీడియోలు ఉన్నాయంటూ బ్లాక్మెయిల్ చేస్తున్నారని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. తీన్మార్ మల్లన్నకు చెందిన వ్యక్తులు కూడా ఇందులో ఉన్నారని, కావాలనే తీన్మార్ మల్లన్న తనపై బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతున్నాడని, అతడిని వదలబోనని స్పష్టంచేశారు.