కరీంనగర్ రూరల్, జూలై 7: ఇటీవలే మంత్రివర్గంలో స్థానం దక్కించుకున్న మంత్రి వాకిటి శ్రీహరి అప్పుడే తనకు కేటాయించిన శాఖలపై అసంతృప్తి వ్యక్తంచేశారు. ‘అది నా దురదృష్టమో.. అదృష్టమోగానీ, నాకు ఇచ్చినవన్నీ గడబిడ శాఖలే’ అని నిష్ఠూరాలాడారు. మత్స్య, పశు సంవర్థక, క్రీడలు, యువజన శాఖలను కిరికిరి శాఖలుగా అభివర్ణించారు. ఒకవైపు, తాను చేపలు పట్టే కులంలో పు ట్టానని, మొదటిసారి చేపలోళ్లకు మత్స్యశాఖను ఇచ్చారని చెప్పుకుంటూనే, మరోవైపు తన కులానికి సేవ చేయడానికి అవకాశం ఉన్న మత్స్యశాఖను అప్పగించడంపై అసంతృప్తి వ్యక్తంచేశారు.
కరీంనగర్లోని చేపల పిల్లల పెంపకం కేంద్రంలో నిర్వహించిన మత్స్యకారుల సంక్షేమ సదస్సులో మంత్రి పొన్నం ప్రభాకర్ సమక్షంలోనే ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. మత్స్య శాఖతోపాటు గొర్రెలు, బర్రెలు తనకు అప్పగించారని, వాటిని ఎలా ముందుకు తీసుకెళ్లాలో అర్థంకావడం లేదని చెప్పారు. తనకు ఇచ్చిన శాఖల పరిస్థితి ఇలాగే ఉన్నదంటూ అసంతృప్తి వ్యక్తంచేశారు.