హైదరాబాద్, ఫిబ్రవరి 15(నమస్తే తెలంగాణ): రాష్ట్ర బడ్జెట్లో తాము చేసిన కేటాయింపులకు, పెట్టే ఖర్చులకు 5-6% వ్యత్యాసం ఉంటుందని ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క స్పష్టంచేశారు. వచ్చే ఆదాయానికీ ఇచ్చే హామీలకు పొంతన లేకుండా పోయిందని, ప్రస్తుత రాజకీయాల్లో అది చేస్తాం, ఇది చేస్తాం అంటూ హామీలు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు.
అసెంబ్లీలో బడ్జెట్‌పై చర్చకు గురువారం ఆయన సమాధానం ఇస్తూ.. బేషజాలకు పోకుండా వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా బడ్జెట్‌ను రూపొందించామని తెలిపారు. గతంలో ఏడాదికేడాది 20% చొప్పున బడ్జెట్ పెంచుతూ పోయారని, తాము అలా చేయలేదని చెప్పారు. జాబ్ క్యాలండర్‌ను విడుదల చేస్తామని, ఇప్పటికే 20 వేలకుపైగా ఉద్యోగాలను భర్తీ చేశామని తెలిపారు. ఆరు గ్యారెంటీల అమలుకు కట్టుబడి ఉన్నామని చెప్పారు.