హనుమకొండ : డిక్లరేషన్ల పేరుతో కాంగ్రెస్ పార్టీ తన ఉనికిని మరింత కోల్పోతున్నదని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి(Mlc Pochampalli) ఆరోపించారు. తెలంగాణపై కనీస అవగాహన లేకుండా కాంగ్రెస్ రాష్ట్ర, జాతీయ నాయకత్వాలు(Congress Leaders) మరోసారి తమ అవేవికాన్ని బయట పెట్టుకున్నాయని ఎద్దేవా చేశారు. ఈమేరకు వరంగల్, హైదరాబాద్‌లో నిర్వహించిన కాంగ్రెస్ సభలపై మండిపడ్డారు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి కొత్తగా చెప్పేందుకు, చేసేందుకు ఏమీ లేక డిక్లరేషన్(Declarations)తో అభాసుపాలవుతున్నదని ఆరోపించారు. వరంగల్‌లో నిర్వహించిన కాంగ్రెస్ రైతు డిక్లరేషన్‌తో నవ్వుల పాలైందని అన్నారు. బీఆర్ఎస్(BRS) ప్రభుత్వం రైతు పక్షపాతి అని, తెలంగాణ నుంచి మొదలైన రైతు పాలన దేశవ్యాప్తంగా విస్తరిస్తూ ‘ అబ్కీ బార్ కిసాన్ సర్కార్ ’ నినాదంతో ముందుకు పోతున్నదన్నారు.
కేవలం నాయకత్వ ఉనికి కోసం నిర్వహిస్తున్న డిక్లరేషన్లు ఆ పార్టీ పాలిట డెత్ డిక్లరేషన్లుగా మారుతున్నాయని విమర్శించారు. సరూర్ నగర్లో నిర్వహించిన కాంగ్రెస్ సభతో ఆ పార్టీ వైఫల్యాలు కొట్టొచ్చినట్టు కనపడిందన్నారు. బీఆర్ఎస్ తొలి కేబినెట్ మీటింగ్‌లోనే ఉద్యమకారులపై కేసులను ఎత్తివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని గుర్తు చేశారు. కొత్తగా కాంగ్రెస్ చేసేది ఏమీ లేదని వ్యాఖ్యనించారు.
అమరుల కుటుంబాలకు ఇంటికో ఉద్యోగంతో పాటు రూ.10 లక్షల ఆర్థికసాయం కేసీఆర్ (KCR)అందించారని వెల్లడించారు. అమరుల త్యాగాలు మలినం చేసేలా, వారిని అవమానించేలా మాట్లాడిన రేవంత్‌రెడ్డి(Revanth), ప్రియాంకా గాంధీ(Priyanka Gandhi) తెలంగాణ అమరుల కుటుంబాలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఉద్యోగాల భర్తీ విషయంలో వారు అబద్ధాలు ఆడుతున్నారన్నారు. ఇప్పటికే 1.35 లక్షల ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీ చేసిందని, మరో 92వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేసిందని స్పష్టం చేశారు.