హైదరాబాద్, మార్చి 25 (నమస్తే తెలంగాణ): ‘బీఆర్ఎస్ పాలనలో 26 వేల టీచర్ పోస్టులు భర్తీచేశాం. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా 8 వేలు, గురుకులాల్లో 18 వేల నియామకాలు చేశాం’ అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు స్పష్టంచేశారు. కానీ, కాంగ్రెస్ సభ్యులు టీచర్ పోస్టులు భర్తీ చేయలేదని అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెబుతున్నారని ఆక్షేపించారు.
మంగళవారం శాసనసభలో విద్యాశాఖ పద్దుపై చర్చ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడారు. మంత్రి శ్రీధర్‌బాబు తన పేరు తీసుకొని మాట్లాడారని, అందుకే వాస్తవాలు వెల్లడిస్తున్నానని, సభ రికార్డులను సవరించాలని స్పీకర్‌కు విజ్ఞప్తిచేశారు. కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఎన్ని స్కూళ్లు మూతపడ్డాయని మా సభ్యురాలు అడిగితే మంత్రి శ్రీధర్‌బాబు 79 స్కూళ్లు తెరిపించామని చెబుతున్నారు. కానీ, మూతపడ్డ 1,913 స్కూళ్ల గురించి ఎందుకు మాట్లాడడం లేదని సూటిగా ప్రశ్నించారు.