CM Revanth Reddy | హైదరాబాద్, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ జాతీయ పాలసీలకు వ్యతిరేకంగా నడుచుకుంటున్నారని అధిష్ఠానం ఆగ్రహంగా ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది. అందుకే ఆయనకు ఢిల్లీ నుంచి అండదండలు అందడం లేదని సమాచారం. ఇందుకు అనేక ఉదాహరణలు కూడా ఉన్నాయి. అదానీతో చెట్టాపట్టాల్, ఢిల్లీ మద్యం విధానంపై కేంద్ర నాయకత్వానికి భిన్నమైన వ్యాఖ్యలు, సుప్రీంకోర్టుపై అనుచిత వ్యాఖ్యలు వంటివి అధిష్ఠానం ఆగ్రహానికి కారణమని సమాచారం. ఓవైపు ఢిల్లీలో కటీఫ్.. మరోవైపు అనుభవలేమి.. ఇంకోవైపు సహకరించని మంత్రులు.. ఫలితంగా రాష్ట్రంలో పాలన గాడి తప్పిందనే భావన ప్రజల్లో మొదలైంది. దీంతో తాను ‘టఫ్’ సీఎంను అని నిరూపించుకునేందుకు రేవంత్‌రెడ్డి ప్రయత్నిస్తున్న ట్టు విశ్లేషకులు చెప్తున్నారు. ఈ క్రమంలో తీసుకుంటున్న ‘హైడ్రా’ ఏర్పాటు వంటి చర్యలు బూమరాంగ్ అవుతున్నాయని, పార్టీలో చర్చ జరుగుతున్నది. తన స్వభావానికి విరుద్ధంగా ఎంత ఓపికగా ప్రయత్నాలు చేస్తున్నా అధిష్ఠా నం ప్రసన్నం కావడం లేదు. సొంత పార్టీలోనే తన స్థానానికి ఎసరు పెట్టే నేతలపై రేవంత్ దృష్టిపెట్టినట్టు రాజకీయ విశ్లేషకులు చెప్పుకుంటున్నారు. కొందరితో కాంప్రమైజ్ అవుతుంటే, మరికొందరిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు.
ఢిల్లీ మద్యం విధానంపైనా
ఢిల్లీ మధ్యం విధానం పేరుతో తెరమీదకి వచ్చిన కుంభకోణం మొత్తం బీజేపీ చేసి న కుట్ర అని కాంగ్రెస్ మొదటి నుంచీ వాదిస్తున్నది. పార్లమెంట్‌లోనూ గట్టిగా పోరాడుతున్నది. కానీ ఇందుకు విరుద్ధంగా రేవంత్‌రెడ్డి ఢిల్లీ మద్యం విధానంలో ఎమ్మెల్సీ కవితపై, కేసీఆర్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేయడాన్ని అధిష్ఠానం తప్పుబడుతున్నట్టు తెలుస్తున్నది.
సుప్రీంకోర్టుపై వ్యాఖ్యలు
సుప్రీంకోర్టు, కేంద్ర ప్రభుత్వం మధ్య కొంతకాలంగా ఘర్షణ వాతావరణం కనిపిస్తున్నదని న్యాయ నిపుణులు చెప్తున్నారు. ఇలాంటి సమయంలో కవిత బెయిల్ విషయంలో రేవంత్ చేసిన వ్యాఖ్యలు ఇరుకున పెట్టినట్టు చర్చ జరుగుతున్నది.
‘బడేభాయ్’పై గుర్రు
సీఎం రేవంత్‌రెడ్డి ప్రధాని మోదీని ‘బడే భాయ్’ అంటూ సంబోధించడంపై కాంగ్రెస్ అధిష్ఠానం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు చెప్తున్నారు. కీలకమైన లోక్‌సభ ఎన్నికలకు ముందు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం, రేవంత్‌రెడ్డి బీజేపీతో టచ్‌లో ఉన్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరగడంతో జాతీయస్థాయిలో తమకు ఇబ్బంది ఎదురైందని వారు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది.
బుల్డోజర్ రాజకీయాలు
ఉత్తరప్రదేశ్‌లో బుల్డోజర్ రాజకీయాలు మొదలైనప్పటి నుంచీ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. ముఖ్యంగా రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీ సందర్భం వచ్చిన ప్రతిసారి బుల్డోజర్ రాజ్ అంటూ మండిపడుతున్నారు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లోనూ బుల్డోజర్ రాజకీయాలపై కాంగ్రెస్ పోరాడుతున్నది. ఇలాంటి సమయంలో రేవంత్‌రెడ్డి హైడ్రా పేరుతో బుల్డోజర్ రాజకీయాలకు తెరలేపడంపై అధిష్ఠాన పెద్దలు గుర్రుగా ఉన్నట్టు చెప్పుకుంటున్నారు.
సహకరించని మంత్రులు
సీఎం పదవి రేవంత్‌రెడ్డికి అప్పగించినప్పటి నుంచి పలువురు మంత్రులు ఆయనకు సహకరించడం లేదన్నది బహిరంగ రహస్యం. తమకే తెలియకుండా తమ శాఖల పరిధిలో పాలసీ నిర్ణయాలు జరిగిపోతుండడంపై కొంద రు మంత్రులు గుర్రుగా ఉన్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వొద్దనే ఉద్దేశంతో బయటికి కలిసిపోయినట్టు కనిపిస్తున్నా, విబేధాలు కొనసాగుతున్నాయని సచివాలయ వర్గాలు చెప్తున్నాయి. సీఎం రేవంత్ ఎక్కువ కాలం కొనసాగరని తమకే అవకాశం వస్తుందని పలువురు మంత్రులు తమ సన్నిహితుల వద్ద చెప్పుకుంటున్నారట. తాము సీనియర్లమని.. కనీసం మంత్రిగా ఒక్కరోజు కూడా పనిచేయని ఓ జూనియర్ తమపై పెత్తనం చెలాయించడం ఏమిటని వారు కుతకుతలాడుతున్నట్టు చెప్పుకుంటున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ నేతలు ప్రభుత్వంపై విరుచుకుపడుతుంటే.. సీఎం తప్ప మంత్రులెవరూ పెద్దగా స్పందించడం లేదని గుర్తు చేస్తున్నారు.
గత అసెంబ్లీ సమావేశాల్లో మహిళలపై సీఎం చేసిన వ్యాఖ్యలకు సంబంధించి గొడవ జరుగుతున్నా మంత్రులు కల్పించుకోకపోగా.. భట్టి విక్రమార్క తన వ్యాఖ్యలతో మరింత ఆజ్యం పోశారని గుర్తు చేస్తున్నారు. ఇంకో పదేండ్లు కాంగ్రెస్ అధికారంలో ఉంటుందని, తానే సీఎంగా ఉంటానని రేవంత్‌రెడ్డి పదే పదే చెప్పుకుంటున్న విషయం తెలిసిందే. అయితే ఆయన ఎక్కువ కాలం కొనసాగరని తరుచూ ఎవరో ఒకరు వ్యాఖ్యానిస్తున్నట్టు విశ్లేషకులు చెప్తున్నారు. రెండు రోజుల కిందటే.. ‘భవిష్యత్తులో ఉత్తమ్‌కుమార్ రెడ్డి సీఎం అవుతారు’ అంటూ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యానించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఇటీవల ఓ వ్యాపారవేత్త తనకు ఇండస్ట్రియల్ పార్క్‌లో కేటాయించిన స్థలాన్ని ఇప్పించాలని ఓ కాంగ్రెస్ నేత ద్వారా ఒక మంత్రి దగ్గరికి వెళ్లారట. విషయం మొత్తం చెప్పిన తర్వాత ‘సార్.. ఈ విషయాన్ని ఓసారి సీఎం దృష్టికి కూడా తీసుకెళ్లాలా?’ అని ఆ నేత అడగ్గా, ఆయనకు చెప్పేదేముంది? నేనే సీనియర్‌ను, ఆయన ఎక్కువ కాలం కొనసాగేది ఉందా? అంటూ వ్యాఖ్యానించినట్టు ప్రచారం జరుగుతున్నది.
ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన ఓ ప్రజాప్రతినిధి తనకు కొన్ని పనులు కావాలంటూ ఇద్దరు మంత్రుల దగ్గరికి వెళ్లగా.. ‘నువ్వు ఎవరి ద్వారా పార్టీలో వస్తే మాకేంటి. రమ్మనడానికి ఆయనెవరు? రావడానికి నువ్వెవరు?’ అంటూ ముఖం మీదే చెప్పేశారట. దీంతో ఆయనకు కాంగ్రెస్ తత్వం బోధపడి.. ఘర్ వాపసీ కోసం ప్రయత్నించినట్టు వార్తలు వచ్చాయి. ఇదే సమయంలో సీఎం రేవంత్‌రెడ్డి ఒంటెత్తు పోకడలపై మంత్రులు అసహనం వ్యక్తం చేస్తున్నారట. ఇటీవల తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన భూమిపూజ ఒంటరిగా చేయడాన్ని తప్పుబడుతున్నారట. హడావుడిగా రాత్రికి రాత్రి నిర్ణయం తీసుకొని తమను జిల్లాల్లో ఇరికించి, మొత్తం క్రెడిట్ కొట్టేయాలని భావించారని గుర్రుగా ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. మరోవైపు ఒక సీనియర్ మంత్రి శాఖ తప్ప.. మిగతా శాఖల బిల్లులన్నీ జనవరి వరకు పెండింగ్‌లో పెట్టాలని మౌఖిక ఆదేశాలు జారీ అయినట్టు చెప్పుకుంటున్నారు. దీంతో ఒకరిద్దరికి వెసులుబాటు ఇవ్వడం ఏమిటని మిగతా మంత్రులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం.
అదానీతో ఒప్పందాలు
అదానీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ, రాహుల్‌గాంధీ పార్లమెంట్లో, బయట పోరాటం చేస్తున్నారు. కానీ, సీఎం రేవంత్‌రెడ్డి ఏకంగా అదానీ సంస్థతో రూ.12వేల కోట్లకుపైగా ఒప్పందాలు చేసుకోవడం, రాష్ట్రంలోకి రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానించి పాతబస్తీలో బిల్లుల వసూలు ప్రాజెక్టు అప్పగించడంతో రాహుల్‌గాంధీ నొచ్చుకున్నట్టు చెప్తున్నారు.
రేవంత్.. రివర్స్ గేమ్
రాష్ట్రంలో తను బలహీన పడుతున్న కారణంగా అధిష్ఠానాన్ని నమ్ముకోవడం కన్నా రాష్ట్ర స్థాయిలోనే తేల్చుకోవాలని రేవంత్ నిర్ణయించుకున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. సొంత పార్టీలోనే తనకు రాజకీయంగా అడ్డుగా వచ్చే నేతలపై దృష్టిపెట్టినట్టు ప్రచారం జరుగుతున్నది. ఇందులో భాగంగా ఒకరిద్దరు సీనియర్ మంత్రులతో కాంప్రమైజ్ అయినట్టు సమాచారం. రాజకీయంగా, ఆర్థికంగా బలం గా ఉండి, భవిష్యత్తులో ముప్పుగా మారుతారనుకున్న నేతలపై నజర్ పెట్టినట్టు ప్రచారం జరుగుతున్నది. ఇందులో భాగంగానే కాబోయే సీఎం, నెంబర్ 2, క్రైసిస్ మేనేజర్, చేరికల పర్యవేక్షకుడిగా చెప్పుకుంటున్న పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని టార్గెట్ చేశారని గుసగుసలు వినిపిస్తున్నాయి.
‘పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిది తెలంగాణలో డీకే శివకుమార్ పాత్ర. తర్వాతి ముఖ్యమంత్రి ఆయనే’ అని ఇటీవల బీజేఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. వాస్తవానికి రేవంత్‌రెడ్డి ముందుగానే పొంగులేటి సామర్థ్యాన్ని గుర్తించి స్నేహం చేశారని, కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయిందని చెప్తున్నారు. దీంతో హైడ్రాలో పొంగులేటిని ఇరికించినట్టు ప్రచా రం జరుగుతున్నది. ఇక డబ్బు, కాంగ్రెస్‌లో తరాల చరిత్ర ఉన్న ఓ దళిత ఎమ్మెల్యేను కూడా అడ్డు తప్పించుకునేందుకు హైడ్రాలో ఇరికించడం, మంత్రి పదవి ఇవ్వకుండా అడ్డుకోవడం వంటివి చేస్తున్నారని ప్రచారం జరుగుతున్నది. ‘చెరువులపై అక్రమ నిర్మాణాల్లో మా ప్రభుత్వంలోని భాగస్వాములకు చెందినవి కూడా కూల్చేస్తాం’ అని సీఎం చెప్పడం దీనికి ఉదాహరణగా చెప్తున్నారు.
అదానీతో ఒప్పందాలు
ఒకవైపు జాతీయస్థాయిలో అదానీపై పార్టీ యుద్ధం చేస్తుంటే కాంగ్రెస్ సీఎం అయ్యుండి రేవంత్ ఒప్పందాలు చేసుకోవడం ఢిల్లీకి మింగుపడడం లేదు
బడేభాయ్తో సఖ్యత!
ప్రత్యర్థి మోదీని ‘బడేభాయ్’ అని పిలవడంతోపాటు అవసరానికి మించి సఖ్యత నెరపడం కూడా అధిష్ఠానాన్ని అసహనానికి గురిచేస్తున్నది.
న్యాయవ్యవస్థపై వ్యాఖ్యలు..
న్యాయవ్యవస్థ నిర్ణయాలను రాజకీయంతో ముడిపెట్టి రేవంత్ తరుచూ చేస్తున్న వ్యాఖ్యలు కాంగ్రెస్ అధిష్ఠానానికి చిర్రెత్తిస్తున్నాయి.
బుల్డోజర్ రాజకీయం
ఒకవైపు బుల్డోజర్రాజ్ను కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వమంతా తప్పుపడుతుంటే.. హైడ్రా పేరిట ఇక్కడ బుల్డోజర్ను సీఎం నడుపుతున్నారు.
మద్యం కేసు
మద్యం కేసు తప్పని కాంగ్రెస్ చెప్తున్నది. ఈ విషయంలో కేజ్రీవాల్‌కు అండగా నిలబడుతున్నది, అదే కేసు ఒప్పన్నట్టుగా, కవితదే తప్పన్నట్టుగా రేవంత్ ఆరోపణలు చేస్తున్నారు.