KTR | కాంగ్రెస్ పాలకులు డబ్బులు దండుకోవడానికే పనిచేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. కాకతీయ టెక్స్టైల్ పార్క్లో టెండర్ పేరుతో రూ.170కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. టెండర్లు పిలిచి ప్రజాధనం లూటీ చేశారని అన్నారు. గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా వరంగల్ జిల్లా పరకాలలో పోచంపల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహిళలకు కేటీఆర్ కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. పరకాలలో జరుగుతున్న అవినీతిపై అసెంబ్లీలో నిలదీస్తామని తెలిపారు.
కమీషన్లు వచ్చే చోటనే కాంగ్రెస్ పాలకులు పనిచేస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. గృహలక్ష్మీ పథకం కింద పరకాల మహిళలకు 3వేల ఇళ్లు మంజూరు చేశామని తెలిపారు. పథకం పేరు మార్చి లబ్ధిదారులకు ఇళ్లు మంజూరు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరినప్పటికీ పట్టించుకోలేదని పేర్కొన్నారు. పరకాలలో ఉన్న 3వేల మందికి లబ్ధి చేకూరే వరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.
ఆరు గ్యారంటీలని చెప్పి కాంగ్రెస్ నేతలు ప్రజలను బురిడీ కొట్టించారని కేటీఆర్ ఆరోపించారు. ఇంట్లో ఉన్న అత్తాకోడళ్లకు పింఛన్లు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి మోసం చేశారని అన్నారు. అత్తకు రూ.4వేలు, కోడలికి రూ.2500 ఇస్తామని ఇచ్చింది లేదని చెప్పారు. ఆడబిడ్డలకు ఒక్కొక్కరికి రూ.50వేల చొప్పున రేవంత్ రెడ్డి బాకీ ఉన్నారని తెలిపారు. కల్యాణలక్ష్మీ కింద తులం బంగారం అని చెప్పి మభ్యపెట్టారని మండిపడ్డారు. రైతుబంధు రూ.15వేలు ఇస్తామని రెండు నెలలు ఎగ్గొట్టారని అన్నారు. ఎన్నికలు వస్తేనే కాంగ్రెస్ ప్రభుత్వం రైతుబంధు ఇస్తోందని తెలిపారు. సమయం దొరికినప్పుడే కాంగ్రెస్ నేతలకు వాత పెట్టాలని అన్నారు. కాంగ్రెస్ నేతల బెదిరింపులకు ఎవరూ భయపడొద్దని స్పష్టం చేశారు. కర్రుకాల్చి వాత పెట్టకపోతే కాంగ్రెస్ నేతలకు బుద్ధిరాదని అన్నారు.
బీఆర్ఎస్ హయాంలో ఎరువుల కోసం క్యూలైన్లో నిలబడిన రోజులు ఉన్నాయా అని కేటీఆర్ ప్రశ్నించారు. పరకాలకు వస్తుంటే పలుచోట్ల రైతులు క్యూలైన్లో నిలబడి కనిపించారని తెలిపారు. ఈ ముఖ్యమంత్రికి సమయానికి యూరియా ఇచ్చే సోయి లేదని విమర్శించారు. కోటిమందిని కోటీశ్వరులను చేస్తామని ముఖ్యమంత్రి మాటలు కోటలు దాటుతున్నాయని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సరైన తీర్పిస్తే ప్రయత్నం దిగి వచ్చి పథకాలు అమలు చేస్తారని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇంటికి వచ్చిన మన బీఆర్ఎస్ నాయకులను ఆదరించాలని కోరారు. కేసీఆరే వచ్చిండని కడుపులో పెట్టుకుని చూసుకోవాలన్నారు.