హైదరాబాద్ జూలై 17 (నమస్తేతెలంగాణ) : సీఎం రేవంత్రెడ్డి ఏడాదిన్నర పాలనలో రాష్ట్రంలోని పల్లెలు కళ తప్పాయని బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేశ్రెడ్డి తెలిపారు. సర్పంచులు, ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యుల పదవీకాలం ముగిసి 18 నెలలు దాటినా ఎన్నికల నిర్వహణలో ప్రభుత్వం విఫలమైందని ధ్వజమెత్తారు. మార్పు, మార్పు అని చెప్పిన సీఎం రేవంత్రెడ్డి తన కుటుంబం ఆర్థిక స్థితిగతుల్లో మార్పులు తెచ్చుకోవడం తప్ప, సామాన్య ప్రజలకు చేసిందేమీలేదని విమర్శించారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు.
పంచాయతీల్లో పాలకవర్గాలు లేక ఒక్కో పంచాయతీ కార్యదర్శి రూ. 2 లక్షల నుంచి రూ. 3 లక్షల దాకా గ్రామాభివృద్ధి పనులకు ఖర్చు పెట్టుకున్నారని తెలిపారు. ఎన్నిసార్లు అడిగినా వారి బిల్లులు చెల్లించకపోవడం విడ్డూరమని పేర్కొన్నారు. పంచాయతీ ఎన్నికల్లో ఓట్లకోసం వచ్చే కాంగ్రెస్ నాయకులను హామీల అమలుపై, సమస్యలపై నిలదీయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ నుంచి పోటీచేసే అభ్యర్థులు అప్పుల పాలవడం తప్పా వారికి మిగిలేదేమీ ఉండదని ఎద్దేవా చేశారు. పల్లె ప్రజలకు కేసీఆర్ పాలన గుర్తుకు వస్తుందనే భయంతో రేవంత్ సర్కారు ప్రాజెక్టులను పడావు పెట్టి రైతుల పంటలను ఎండబెడుతున్నదని దుయ్యబట్టారు. కాంగ్రెస్ హయాంలో దేవాదుల ప్రాజెక్టు కింద తట్టెడు మట్టి తీయలేదని ఆరోపించారు.