కొడంగల్, జనవరి 15 : కొడంగల్ నియోజక వర్గంలోని దౌల్తాబాద్‌కు చెందిన దాదాపు 30 మంది కాంగ్రెస్ నాయకులు, రైతులు బీఆర్ఎస్లో చేరారు. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి బుధవారం దౌల్తాబాద్‌లో పర్యటించారు. సీఎం రేవంత్‌రెడ్డి ఇలాకాకు చెందిన కాంగ్రెస్ నాయకులతోపాటు రైతులు స్వచ్ఛందంగా బీఆర్ఎస్లో చేరగా.. నరేందర్‌రెడ్డి వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన సందర్భంగా కాంగ్రెస్ నాయకులు కుర్మని మల్కప్ప, గుండెపల్లి భీంరెడ్డి, గోక అశోక్, చెన్నప్ప, నర్సప్ప తదితరులు మాట్లాడుతూ.. ఏడాది కాలంలోనే రేవంత్ పాలనపై విసుగొచ్చిందని అన్నారు.
ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని పూర్తి స్థాయిలో అమలు చేయలేదని ఆరోపించారు. కేసీఆర్ పాలనలో రైతులు అన్నింటా లబ్ధిని అందుకోవడంతోపాటు ఆత్మాభిమానంతో వ్యవసాయం చేశారని కొనియాడారు. కాంగ్రెస్ పాలనలో రైతుభరోసా అమలు కాలేదని, రుణమాఫీ అంతంత మాత్రంగానే జరిగిందని పేర్కొన్నారు. ఈ నెల17న చేవేళ్ల నియోజకవర్గంలోని షాబాద్‌లో కేటీఆర్ సమక్షంలో జరిగే మహా ధర్నా కార్యక్రమానికి పెద్దఎత్తున తరలి వెళ్తామని తెలిపారు.