బీఆర్ఎస్ అధికారంలో ఉన్నపుడు ఫార్మాసిటీ కోసం రైతుల నుంచి భూముల్ని అన్యాయంగా గుంజుకుంటున్నారని రేవంత్‌రెడ్డి, భట్టివిక్రమార్క, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సీతక్క, మల్రెడ్డి రంగారెడ్డి, కోదండరెడ్డి పలుమార్లు మా గ్రామాల్లోకి వచ్చి రైతుల్ని రెచ్చగొట్టారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మా భూములపై తిరిగి పూర్తి హక్కుల్ని కల్పించి ఆన్లైన్ సేవల్ని పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు కోర్టు అథారిటీ నుంచి మాకు నోటీసులు పంపారు. అథారిటీ ఆదేశాల మేరకు అక్టోబరు ఒకటో తేదీన కోర్టుకు హాజరవుతున్నాం. మీరు కూడా మా రైతులకు అండగా ఉండి మాతో పాటు రావాలని కోరుతున్నాం.
-ఫార్మాసిటీ బాధిత రైతుల డిమాండ్
హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి/యాచారం, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ అధికారంలో ఉన్నపుడు ఫార్మాసిటీపై నిత్యం విషం చిమ్మిన కాంగ్రెస్ నేతలు రైతులతో కలిసి ధర్నాలు, పాదయాత్రలు చేశారు. తమకు ఓటేసి గెలిపిస్తే అధికారంలోకి రాగానే ఫార్మాసిటీని రద్దుచేసి మీ భూములను మీకు తిరిగి ఇస్తామంటూ హామీలు గుప్పించారు. చివరకు కోర్టుకు సైతం రైతులతో కలిసి వెళ్లి మీకు అండగా ఉంటామని కలిబొల్లి కబుర్లు చెప్పారు. తీరా అధికారంలోకి రాగానే రైతులకు ముఖం చాటేస్తున్నారు. ఫార్మాసిటీ రద్దు అని ఒకసారి, కాదని మరోసారి.. ఇలా సీఎం నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు పూటకో మాట చెప్తూ రైతులను దగా చేస్తున్నారు.
అధికారంలోకి రాగానే భూములను తిరిగి రైతులకు అప్పగిస్తామన్న నేతలు ఇప్పుడు గద్దెనెక్కగానే ఆ భూముల్లోకి రైతులు రాకుండా పోలీసులను మోహరించి, ఫెన్సింగ్ ఏర్పాటు చేసి రైతులను తరిమికొట్టారు. తమ భూముల కోసం ఇల్లు, వాకిలి వది ఏడాదిన్నరగా పోరాడుతున్న రైతులకు ఇటీవల పిడుగుపాటులా కోర్టు అథారిటీ నోటీసులు అందాయి. పరిహారం ఎందుకు తీసుకోవడం వచ్చే నెల ఒకటో తేదీలోగా చెప్పాలని కోర్టు ఆదేశించడంతో అన్నదాతలకు కంటి మీద కునుకు కరువైంది. కాబట్టే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తమను రెచ్చగొట్టిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు కూడా తమతో కలిసి రావాలని డిమాండ్ చేస్తున్నారు. తమకు అందుబాటులో ఉన్న రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డిని కలిసి తమతోపాటు కోర్టుకురావాలని లిఖితపూర్వకంగా డిమాండ్ చేశారు.
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం, మహేశ్వరం నియోజకవర్గాల పరిధిలోని యాచారం, కందుకూరు మండలాల్లో 19,333 ఎకరాల్లో గ్రీన్ ఫార్మాసిటీ ఏర్పాటుకు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గ్రీన్ ఫార్మాసిటీని మాత్రమే ఏర్పాటు చేస్తామని, లేదంటే భూములు తిరిగి ఇస్తామనే షరతుతో కేసీఆర్ ప్రభుత్వం భూసేకరణ ప్రక్రియ చేపట్టింది. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ రైతుల్ని రెచ్చగొట్టింది. ‘ఫార్మాసిటీ ఎలా ఏర్పాటు చేస్తారు? రైతుల నుంచి బలవంతంగా భూములను ఎలా తీసుకుంటారు? ఎవరూ భూములు ఇవ్వొద్దు, మేం అధికారంలోకి రాగానే ఫార్మాసిటీ రద్దు చేస్తాం’ అని ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సీతక్క, ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి రైతులను మభ్యపెట్టారు.
దీంతో యాచారం మండలంలోని మేడిపల్లి, నానక్‌నగర్, తాటిపర్తి, కుర్మిద్ద గ్రామాలకు చెందిన 800 మంది రైతులు 2,250 ఎకరాల పట్టా భూములను ఫార్మాసిటీకి ఇవ్వలేదు. దీంతో అప్పటి ప్రభుత్వం నిబంధనల మేరకు రైతులకు ఇవ్వాల్సిన పరిహారాన్ని అథారిటీ కోర్టులో జమచేసింది. ఆ సమయంలో కోదండరెడ్డి, పలువురు కాంగ్రెస్ నేతలు రైతులతో కలిసి కోర్టుకు వెళ్లారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే భూములు తిరిగి ఇస్తామన్నందున పరిహారం తీసుకోవద్దని రైతులకు మాయ మాటలు చెప్పారు. వారి మాటలు నమ్మిన రైతులు పరిహారం తీసుకోకపోవడంతో బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ భూములను స్వాధీనం చేసుకోలేదు. రైతులే సాగు చేసుకుంటున్నారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఫార్మాసిటీ రద్దవుతుందని ఎంతో ఆశతో ఉన్న రైతులకు నిరాశే ఎదురైంది. ఫార్మాసిటీ కొనసాగిస్తామని హైకోర్టుకు లిఖితపూర్వకంగా హామీ ఇచ్చిన రేవంత్‌రెడ్డి ప్రభుత్వం క్షేత్రస్థాయిలో మాత్రం ఆ భూముల్ని ఫ్యూచర్ సిటీ కోసం వినియోగిస్తూ రెండేండ్లుగా ఫార్మా బాధిత రైతులను అయోమయానికి గురిచేస్తున్నది. పైగా, పరిహారం తీసుకోవద్దని గతంలో చెప్పిన రైతులకు చెందిన మేడిపల్లి, నానక్‌నగర్, తాటిపర్తి, కుర్మిద్ద భూముల్లో కొన్నిరోజుల క్రితం పోలీసు పహారా మధ్య రైతులు రాకుండా అడ్డుకుని ఫెన్సింగ్ వేసింది. రైతులు ఏడాదిన్నరగా సీఎంతో పాటు గతంలో పాదయాత్ర చేసిన భట్టి, కోమటిరెడ్డి, సీతక్క, ఇతరులను కలిసేందుకు ప్రయత్నించినా సాధ్యపడకపోవడంతో నెలలుగా రైతులు ఆందోళన చేస్తూనే ఉన్నారు. ఈ నెల 12 నుంచి విడతలవారీగా అథారిటీ కోర్టు నుంచి రైతులకు నోటీసులు జారీ అవుతున్నాయి.
ఇప్పటివరకు 250 మందికి నోటీసులు అందినట్టు తెలిసింది. పరిహారం ఎందుకు తీసుకోవడం లేదో సమాధానం చెప్పాలని కోర్టు ఆదేశించడంతో కాంగ్రెస్ నేతలను కలిసేందుకు రైతులు ప్రయత్నిస్తున్నారు. అయినప్పటికీ వారెవరూ అందుబాటులోకి రావడంలేదని వాపోతున్నారు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కోదండరాంను కలిసి గతంలో తమను భూములు ఇవ్వద్దని చెప్పారు కాబట్టి, ఇప్పుడు తమతో కలిసి రావాలని డిమాండు చేశారు. కానీ కోదండరెడ్డి మాత్రం పరిహారం ఎక్కువ ఇప్పించేందుకు కృషి చేస్తానంటూ సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నారని, నాడు ప్రతిపక్షంలో ఉన్నపుడు ఏం చెప్పారు? ఇప్పుడు అధకారంలోకి రాగానే ఎలా మాట మార్చుతున్నారో చూడండి అంటూ రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
ప్రతిపక్షంలో ఉన్నపుడు ప్రస్తుత సీఎం, మంత్రులు, ఎమ్మెల్యే అందరూ ఫార్మాసిటీని రద్దుచేసి, మా భూములు మాకు ఇస్తామన్నారు. ఇప్పుడేమో కోర్టు నుంచి నోటీసులు పంపుతున్నారు. ప్రభుత్వం ఎంత ఒత్తిడి తెచ్చినా మా భూముల్ని వదులుకోం. గతంలో కోర్టు ద్వారా పలు కేసులు గెలిచాం. మరోసారి రైతులందరం హైకోర్టుకు పోతాం. బీఆర్ఎస్ హయాంలో అథారిటీ కోర్టు వద్ద మాతో కలిసి ఆందోళన చేసిన కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు కూడా రైతులతో కలిసి అథారిటీ కోర్టుకు వచ్చి మాకు అండగా ఉండాలి. ఎవరెన్ని ఇబ్బందులకు గురిచేసినా సెంటు భూమి కూడా ప్రభుత్వానికి ఇచ్చేదిలేదు. అథారిటీలో ఉన్న డబ్బులు మాకు వద్దు. మా భూములను మాకు ఇప్పించాలి. రైతులకు న్యాయం జరిగే వరకు ఫార్మా వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో పోరాడుతాం. – కానమోని గణేశ్, ఫార్మా వ్యతిరేక పోరాట కమిటీ నాయకుడు