BRS Party | ధర్మారం, మే 20: పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మండలంలో జరిగిన అభివృద్ధిపై చర్చించడానికి సిద్ధమైన బీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ పార్టీ నాయకులు దాడికి ప్రయత్నించారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణానికి దారితీసింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో, నాటి మంత్రి కొప్పుల ఈశ్వర్ మండలంలో ఎలాంటి అభివృద్ధి చేయలేదని కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన అనుచిత వ్యాఖ్యలు చేసి చర్చకు సిద్ధంగా ఉండాలని వారు సవాల్ చేశారు. దీనిపై స్పందించిన బీఆర్ఎస్ నాయకులు అభివృద్ధిపై చర్చించడానికి సిద్ధమేనని అందుకు మంగళవారం మండల కేంద్రంలోని భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహం వద్దకు రావాలని ప్రకటించారు.
ఈ క్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు రాచూరి శ్రీధర్, నంది మేడారం ప్యాక్స్ చైర్మన్ ముత్యాల బలరాంరెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ గుర్రం మోహన్ రెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు పూస్కురు రామారావు, పాకాల రాజయ్య, ఆవుల శ్రీనివాస్, ఆవుల వేణు, మహిళా నాయకురాలు ఆవుల లత, మార్క సంధ్య, కాంపల్లి అపర్ణ తదితరుల ఆధ్వర్యంలో పార్టీ నాయకుడు రామారావు ఇంటి నుంచి ర్యాలీగా గులాబీ శ్రేణులు అంబేద్కర్ చౌరస్తా వరకు బయలుదేరారు. ర్యాలీ చేస్తున్న గ్రామంలో మార్గమధ్యంలోనే ప్యాక్స్ చైర్మన్ ముత్యాల బలరాం రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు రాచూరి శ్రీధర్, రామారావు తదితర నాయకులను పెద్దపల్లి సిఐ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు అడ్డుకున్నారు. మిగతా గులాబీ శ్రేణులు పెద్ద సంఖ్యలో అంబేద్కర్ చౌరస్తాకు చేరుకున్నారు. వారంతా కరీంనగర్ -రాయపట్నం రహదారిపై రాస్తారోకో చేసే ప్రయత్నం చేయగా ఎస్సై శీలం లక్ష్మణ్ తో పాటు పోలీస్ సిబ్బంది అడ్డుకున్నారు.
కాగా సీఐ మాత్రం మిగతా ముఖ్య నాయకులను కేడిసిసి బ్యాంకు వద్ద నిలిపివేసి వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ అంబేద్కర్ చౌరస్తాకు వెళ్ళవద్దని ప్రెస్ మీట్ నిర్వహించి అభివృద్ధిపై చెప్పి ఇక్కడ నుంచి వెళ్లాలని సీఐ వారికి సర్ది చెప్పారు. దీంతో ఆ ముఖ్య నాయకుల పిలుపు మేరకు అంబేద్కర్ చౌరస్తాలో ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులంతా కేడీసీసీ బ్యాంకు వద్దకు చేరుకున్నారు. బీఆర్ఎస్ నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించడానికి సిద్ధమవుతున్న క్రమంలో వారిని చూసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు అంబేద్కర్ చౌరస్తా నుంచి మూకుమ్మడిగా బీఆర్ఎస్ నాయకుల వద్దకు దౌర్జన్యపూరితంగా దూసుకు వచ్చారు. అభివృద్ధిపై నంది మేడారంలో చర్చించడానికి సిద్ధమని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు తమ వ్యూహాన్ని మార్చి బీఆర్ఎస్ నాయకులపై దౌర్జన్యం చేసే ప్రయత్నానికి పూనుకున్నారు. అభివృద్ధిపై చర్చించే ప్రక్రియను పక్కన పెట్టిన ఆ పార్టీ నాయకులు ఒక దశలో ఒక గులాబీ శ్రేణులపై దాడి చేయడానికి తీవ్ర ప్రయత్నం చేసి ఘర్షణ వాతావరణం సృష్టించారు. ఒకరిపై ఒకరు నినాదాలు చేసుకోవడంతో తీవ్రమైన ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. ఒక దశలో తీవ్ర సాయి ఘర్షణ వాతావరణం ఏర్పడింది. దీంతో సీఐ ప్రవీణ్ కుమార్, ఎస్సై లక్ష్మణ్ కుమార్ బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ నాయకులను అదుపు చేయడానికి తీవ్రమైన ప్రయత్నాలు చేశారు.
ఇరు వర్గాలను చెదరగొట్టి అంత దూరం పంపించగానే మళ్లీ రెచ్చగొట్టే నినాదాలు చేసుకొని ఒకరిపై ఒకరు దాడికి దిగే ప్రయత్నం చేశారు. దీంతో పోలీస్ సిబ్బంది రోప్‌తో కాంగ్రెస్ పార్టీ నాయకులను అదుపు చేయడానికి ప్రయత్నం చేశారు. కానీ పోలీసులను నెట్టుకుంటూనే కాంగ్రెస్ పార్టీ నాయకులు ముందుకు రాసాగారు. దీంతో కరీంనగర్ – రాయపట్నం రహదారిపై సుమారు గంటసేపు రాకపోకలు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ఇక్కడ మంగళవారం వారసంత కావడంతో రోడ్డుమీద ఇరు పార్టీలు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.
దీంతో పోలీసు అధికారులు ఇరు వర్గాలను శాంతింపజేశారు. బీఆర్ఎస్ నాయకులను పాత బస్టాండ్ వైపు, కాంగ్రెస్ పార్టీ నాయకులను అంబేద్కర్ చౌరస్తా వైపుకు మళ్ళించారు. అనంతరం బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాచూరి శ్రీధర్ మీడియాతో మాట్లాడి కాంగ్రెస్ పార్టీ నాయకుల దౌర్జన్యాన్ని తీవ్రంగా ఖండించారు. తమ నేత రాష్ట్ర మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ధర్మారం మండలంలో 10 సంవత్సరాల కాలంలో చేసిన అభివృద్ధిపై చర్చించే దమ్ము లేక తమపై ఆ పార్టీ నాయకులు దాడికి దిగే ప్రయత్నం చేయడానికి పేర్కొన్నారు. తాము కాంగ్రెస్ పార్టీ దౌర్జన్యానికి భయపడే ప్రసక్తి లేదని తమంత తమ పార్టీ అధినేత కేసిఆర్, కేటీఆర్, రాష్ట్ర మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ వారసులమని ఆయన పేర్కొన్నారు. తాము గులాబీ సైనికులమని ఎవరికి భయపడే ప్రసక్తే లేదని ఈశ్వర్ స్పష్టం చేశారు.
అభివృద్ధిపై ఎప్పుడైనా చర్చించడానికి బీఆర్ఎస్ సిద్ధంగా ఉంటుందని విషయాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు గమనించాలని ఆయన పేర్కొన్నారు. ప్రజల ఆదరణతో రాష్ట్ర మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాడని గ్రామ గ్రామాన అభివృద్ధి చేసిన మార్కు ఉందని ఆయన అన్నారు. ఏ ఊరిలోనైనా బి.ఆర్.ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధిని నిరూపించడానికి తమ సిద్ధంగా ఉన్నట్లు శ్రీధర్ స్పష్టం చేశారు. కానీ అభివృద్ధి నిరోధకులుగా ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు తమ సవాళ్లను స్వీకరించే ధైర్యం లేక ఎదుర్కోలేక దౌర్జన్య పూరితంగా వ్యవహరించడానికి తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ధర్మారం మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలని అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ఉన్న ఈశ్వర్ చర్చించి దానిని మంజూరు చేయించారని శ్రీధర్ గుర్తు చేశారు. తగినన్ని నిధులు కేటాయించి అట్టి జూనియర్ కళాశాలకు పక్కా భవనం ప్రహరీ గోడ నిర్మించాడనికి ఈశ్వర్ కృషి చేశాడని ఆయన తెలిపారు. ధర్మారం మండల కేంద్రంలో సెంట్రల్ లైటింగ్ సిస్టం ఏర్పాటు చేయడంతో మండల కేంద్రానికి కొత్త కళ తీసుకువచ్చిన చరిత్ర ఈశ్వర్ వేనని ఆయన వివరించారు. నంది మేడారం గ్రామాన్ని ఈశ్వర్ సమగ్రంగా అభివృద్ధి చేశారని గ్రామంలో కాళేశ్వరం ప్రాజెక్టు అనుబంధంగా నంది రిజర్వాయర్ నిర్మించి రైతులకు మేలు చేశాడని అన్నారు. గ్రామంలో పార్కు అభివృద్ధి, బీటీ, సిసి రోడ్ల నిర్మాణం చేసి గ్రామాన్ని ఈశ్వర్ అభివృద్ధి చేశాడని శ్రీధర్ వివరించారు. మండల కేంద్రంలో ఎర్రగుంటపల్లి శివారు నుంచి జక్కన్న పల్లి వరకు 4 లేన్ల రోడ్డు విస్తరణకు సుమారు బంధం కోట్ల నిధులను ఈశ్వర్ మంజూరు చేయించగా అట్టి రోడ్డు విస్తరణ కాకుండా ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ అడ్డుకున్నారని శ్రీధర్ ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన కమ్యూనిటీ హెల్త్ సెంటర్ భవనాన్ని ఇప్పటికీ ప్రారంభించకుండా ఎమ్మెల్యే నిర్లక్ష్యం చేస్తున్నాడని శ్రీధర్ ఆరోపించారు. ఈ ఆందోళన కార్యక్రమంలో మండలంలోని అన్ని గ్రామాల పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.