అశ్వారావుపేట, ఫిబ్రవరి 12 : మున్సిపల్ ఎన్నికల ఫలితాలు రాకుండానే తనకు ఓటు వేయలేదంటూ కాలనీ ప్రజలపై కాంగ్రెస్ అభ్యర్థి అనుచరులు తమ దౌర్జన్యం ప్రదర్శించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మున్సిపాలిటీ పరిధి ఏఎస్‌ఆర్‌నగర్‌లో గురువారం ఈ ఘటన చోటుచేసుకున్నది. కాలనీవాసులు తెలిపిన వివరాల ప్రకా రం.. పట్టణంలోని పేరాయిగూడెంనకు చెందిన మిండా హరిబాబు 10వ వార్డు కౌన్సిలర్‌గా కాంగ్రెస్ తరఫున పోటీచేశాడు. ఓటుకు రూ.2,500 చొప్పున పంపిణీ చేసిన ఆయన అనుచరులు ఇంటింటికీ కుక్కర్లు పంపిణీ చేశారు.
11వ తేదీ పోలింగ్ ముగిసిన తర్వాత గెలుపుపై అనుమానం రావడంతో వెంటనే అభ్యర్థి హరిబాబు వెంట ప్రచారంలో పాల్గొన్న బాలాజీ, అనిల్.. ఏఎస్ఆర్ కాలనీవాసుల వద్దకు వెళ్లి ఓటువేయనందుకు తీసుకున్న డబ్బుతోపాటు కుక్కర్లు ఇవ్వాలని బుధవారం రాత్రి డిమాండ్ చేశారు. అసహనానికి గురైన కాలనీవాసులు తీసుకున్న కుక్కర్లను గురువారం గిఫ్టులు వెనక్కి అడిగిన బాలాజీ ఇంటి ముందు రోడ్డుపై వేసి నిరసన వ్యక్తంచేశారు. ఇందిరమ్మ ఇండ్లను జేసీబీతో కూల్చేస్తామని బెదిరించారని కాలనీవాసులు ఆరోపించారు. ‘ఓటు మీకే వేశాం.. మీరిచ్చిన డబ్బు, గిఫ్టులు తీసుకెళ్లండి’ అని హరిబాబును కోరగా, తా ను డబ్బు పంచలేదని, తనకెలాంటి సంబంధం లేదని చెప్పినట్టు బాధిత మహిళలు వివరించారు.