Mid Manair | కరీంనగర్, డిసెంబర్ 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మధ్యమానేరు (శ్రీరాజరాజేశ్వర జలాశయం) ముంపు గ్రామాల్లో కొత్త దందా మొదలైంది. పాత ప్యాకేజీ ఇప్పిస్తామనే పేరుతో కొత్త దరఖాస్తుల స్వీకరణ జాతర ఆరంభమైంది. కాంగ్రెస్ నేతల కనుసన్నల్లో నడుస్తున్న ఈ వ్యవహారంలో పలువురు ఇప్పటికే హస్తలాఘవం ప్రదర్శిస్తుండగా, ఇంకొన్ని చోట్ల ముం దస్తు ఒప్పందాలు జరుగుతున్నట్టు తెలుస్తున్నది. మరోవైపు, వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధిపొందేందుకే దరఖాస్తుల పేరు తో ఈ వ్యవహారానికి తెరలేపారన్న విమర్శలున్నాయి. మరోవైపు ‘మధ్యమానేరు ముంపు గ్రామాల్లో నయాదందా’ శీర్షికన సోమవారం ‘నమస్తే తెలంగాణ’ ప్రచురించిన కథనం ముంపు గ్రా మాల్లో సంచలనం సృష్టించింది. దీనిపై ఇంటెలిజెన్స్, ఎస్బీ వర్గాలు ఆరా తీశాయి. కొదురుపాక గ్రామ పంచాయతీ కార్యాలయంలో ప్యాకేజీ కోసం దరఖాస్తులు తీసుకున్న కాంగ్రెస్ నాయకులు, వారి వివరాలతో కూడిన నివేదికను పైఅధికారులతోపాటు ప్రభుత్వానికి పంపినట్టు తెలుస్తున్నది. మరోవైపు ఈ వ్యవహారంలో తీగలాగితే డొంకంతా కదులుతున్నది.
కరీంనగర్ జిల్లాలోని 2.25 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలన్న లక్ష్యంలో భాగంగా బోయినపల్లి మండలం మాన్వాడ వద్ద మానేరు వాగుపై 2005-06లో మధ్యమానేరు (శ్రీరాజరాజేశ్వర) ప్రాజెక్టుకు పునా ది రాయి పడింది. తొమ్మిది గ్రామాలు పాక్షికంగా, మరో తొమ్మిది గ్రామాలు పూర్తిగా ముంపునకు గురయ్యాయి. 2006 ఫిబ్రవరిలో రూ.406 కోట్లకు టెండర్ దక్కించుకున్న జడ్వీఎస్-రత్న, సుశీ కంపెనీలు మధ్యలోనే వదిలేశాయి. మళ్లీ 2012లో టెండర్ పిలిచేవరకు దాదాపు పనులన్నీ నిలిచిపోయాయి. 23 ఏప్రిల్ 2012లో నాటి భారీ నీటిపారుదల శాఖ మంత్రి.. సుదర్శన్‌రెడ్డి పలు పనులకు భూమిపూజ చేసేందుకు ప్రాజెక్టు వద్దకు వచ్చారు. పరిహారం చెల్లింపు విషయంలో అప్పటికే విసిగిపోయిన నిర్వాసితులు వేల సంఖ్యలో ప్రాజెక్టు వద్దకు చేరుకొని.. మంత్రి గ్యో బాక్ అంటూ నినాదాలు ఇవ్వడమే కాకుండా, పరిహారం చెల్లించిన తరువాతే పనులు మొదలుపెట్టాలని డిమాండ్ చేశారు. సభా వేదికను కూల్చివేశారు. 2012 జూన్‌లోపు అన్ని రకాల పరిహారం చెల్లిస్తామని మంత్రి హామీ ఇచ్చినా అమలుకు నోచుకోలేదు. ఆ తర్వాత కేసీఆర్ ప్రభుత్వం ప్రాజెక్టుకు కావాల్సిన నిధులు కేటాయించి నిర్మాణాలను యుద్ధప్రాతిపదికన పూర్తిచేసింది. పునరావాస ప్యాకేజీ ప్రకారం 2014 జనవరి 1 నాటికి 18 ఏండ్లు నిండిన యువతీ యువకులకు పట్టా, ప్యాకేజీ అందలేదంటూ విజ్ఞప్తులు వచ్చిన నేపథ్యంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామాల వారీగా కలెక్టర్ ఆధ్వర్యంలో సభలు నిర్వహించింది. ఆ మేరకు సుమారు 4,093 దరఖాస్తులు వచ్చాయి. అసెంబ్లీ ఎన్నికలు రావడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది.
రెవెన్యూ అధికారులు గత దరఖాస్తుల్లో అనర్హులను తిరస్కరించడం.. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం ఉండటం.. ఇదే విధానం కొనసాగితే ముంపు గ్రామాల్లో ఒక్క స్థానం కూడా కాంగ్రెస్‌కు వచ్చే చాన్స్ లేకపోవడం వంటి పరిస్థితుల నేపథ్యంలో ఆ పార్టీ నాయకులు కొత్త దందాకు తెరలేపారన్న విమర్శలొస్తున్నాయి. అందులో భాగంగానే రాజన్న సిరిసిల్ల జిల్లా కొదురుపాక పంచాయతీలో దరఖాస్తుల స్వీకరణ జరిగిందని విశ్వసనీయ సమాచారం. అధికారిక పంచాయతీ కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులు దరఖాస్తులు స్వీకరించడాన్ని ‘నమస్తే తెలంగాణ’ ఆధారాలతో సహా బయటపెట్టిన విషయం తెలిసిందే. దీనిపై తీగలాగితే డొంకంతా కదులుతున్నది. దరఖాస్తుల స్వీకరణ కొదురుపాక గ్రామానికి మాత్రమే పరిమితం కాలేదని, ప్రతి ముంపు గ్రామంలోనూ ఇదే దందాను కాంగ్రెస్ నాయకులు నడుపుతున్నట్టు సమాచారం. ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేరిట ముద్రించి ఉన్న దరఖాస్తులను ఇంటింటా పంపిణీ చేస్తూ.. పూర్తిచేసిన దరఖాస్తును తిరిగి కాంగ్రెస్ నాయకులే సేకరిస్తున్నట్టు తెలుస్తున్నది. ఇక్కడే అనేక అనుమానాలకు దారి తీస్తున్నది.
ఒకవేళ అర్హులకు ప్యాకేజీ, పట్టా ఇప్పించే ఉద్దేశం ఎమ్మెల్యేకు, నాయకులకు ఉంటే తిరిగి కొత్తగా దరఖాస్తుల స్వీకరణ ఎందుకు? గతంలో కలెక్టర్ ఆధ్వర్యంలోనే దరఖాస్తులు స్వీకరించి.. వాటిని పరిశీలన చేసి తుది జాబితాను తయారుచేశారు కదా? వాటిని ఎందుకు పరిగణనలోకి తీసుకోవడం లేదు? అధికారులు సేకరించి, పరిశీలించిన దరఖాస్తులకు విలువలేదా? అలాంటప్పుడు నేరుగా కాంగ్రెస్ నాయకులు సేకరించిన దరఖాస్తులను ఎలా పరిగణనలోకి తీసుకుంటారు? ఒకవేళ కొత్తగా దరఖాస్తులు చేసుకోవాల్సిన అవసరం వస్తే.. ప్రభుత్వ కార్యాలయాలు లేదా ప్రజావాణిలకు వెళ్లి దరఖాస్తులు పెట్టుకోవాలని చెప్పాలే తప్ప నేరుగా కాంగ్రెస్ నాయకులు ఎలా సేకరిస్తారు? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. కొంతమంది నాయకులు.. దరఖాస్తులు తీసుకునే సమయంలోనే ప్యాకేజీ వస్తే ఇంత.. పట్టా వస్తే ఇంత శాతం డబ్బులు ఇవ్వాలని ఒప్పందాలు చేసుకుంటున్నట్టు తెలుస్తున్నది. వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేరిట ముద్రించిన దరఖాస్తుల్లోనే వివరాలు నింపాలని చెప్పడమే కాకుండా.. కొంతమంది హస్తలాఘవం ప్రదర్శిస్తున్నట్టు తెలుస్తున్నది. ఈ వ్యవహారాన్ని స్థానిక ఎన్నికల వరకు లాగాలని, తద్వారా ముంపు గ్రామాల్లో ఓట్లు దక్కించుకోవాలని మరికొంతమంది నాయకులు చూస్తున్నారని తెలుస్తున్నది.
నాటి సభల్లో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, అందులో అర్హులు, అనర్హులను తేల్చే ప్రక్రియను ఇటీవల రాజన్న సిరిసిల్ల జిల్లా అధికారులు చేపట్టారు. వచ్చిన దరఖాస్తుల్లో అనర్హులను గుర్తించి, తిరస్కరణకు కారణాలను వివరిస్తూ.. రెవెన్యూ అధికారులు గ్రామాలకు నేరుగా లేఖలు పంపిస్తున్నారు. ఇప్పటికే ఆరెపల్లి, చింతల్‌ఠాణా వంటి గ్రామాల్లో అనర్హుల కు లేఖలు అందించారు. వాటిని తీసుకొని, కొంతమంది అనుచరులు కాంగ్రెస్ నాయకుల వద్దకు వెళ్లినట్టు తెలుస్తున్నది. లేఖలు గ్రామాల్లో వస్తే.. స్థానిక సంస్థల్లో ముంపు గ్రామాల్లో ఒక స్థానం కూడా గెలువలేమని, దీనికి ఏదో ఒక పరిష్కారం ఆలోచించాలని పార్టీ శ్రేణులు కోరినట్టు తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో ఒక ప్రజాప్రతినిధి జిల్లా స్థాయి ఉన్నతాధికారికి ఫోన్‌చేసి.. ‘మీరు ప్యాకేజీ ఇస్త్తరో లేదో తెలియదు గానీ, ఇలా తిరస్కరణ లేఖలు పంపడం ఆపేయండి. లేదంటే మాకు స్థానిక సంస్థల్లో ఇబ్బంది ఎదురయ్యే అవకాశమున్నది. కొన్నా ళ్లు ఈ లేఖలు పంపొద్దు’ అని ఆదేశించినట్టు తెలుస్తున్నది. దీంతో సదరు ఉన్నతాధికారి క్షేత్రస్థాయి అధికారులకు లేఖలు పంపొద్దని ఆదేశాలు ఇచ్చినట్టు విశ్వసనీయ సమాచారం.