దుబ్బాక, జనవరి 26 : గణతంత్ర దినోత్సవం వేళ కాంగ్రెస్ నాయకులు గూండాయిజానికి దిగారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో సోమవారం గణతంత్ర దిన వేడుకల్లో పాల్గొన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డిపై కాంగ్రెస్ నాయకులు దాడికి యత్నించారు. స్థానిక గాంధీచౌక్ వద్ద ఎమ్మెల్యే జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం ప్రసంగిస్తున్న క్రమంలో కొందరు కాంగ్రెస్ నాయకులు అక్కడికి చేరుకుని అడ్డుతగిలారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కాంగ్రెస్ నాయకుల మధ్య వాగ్వాదం చోటుచేసుకోగా స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది. ఈ వేడుకల్లో పాల్గొన్న విద్యార్థులు, చిన్నారులు, ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అంతేగాక ఎమ్మెల్యే వాహనాన్ని వెంబడించి దాడికి యత్నించారు.
ఇంత జరుగుతున్నా కాంగ్రెస్ నాయకులను అడ్డుకోకుండా పోలీసులు ప్రేక్షకపాత్ర వహించడంతో విమర్శలు వెల్లువెత్తాయి. ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డిపై దాడికి ప్రయత్నించిన కాంగ్రెస్ నాయకులే.. ఎమ్మెల్యే జాతీయ జెండాను అగౌరవపరిచారంటూ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయడంపై పలువురు మండిపడుతున్నారు. మొన్న జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డిపై కాంగ్రెస్ నాయకులు దాడికి యత్నించగా, గణతంత్ర దినోత్సవ వేళ దుబ్బాకలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డిపై దాడికి యత్నించడంపై బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తంచేశారు.
ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసి, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నదని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేండ్లు గడిచినా దుబ్బాక మున్సిపాలిటీకి నయా పైసా నిధులు మంజూరు చేయలేదని ధ్వజమెత్తారు. మున్సిపల్ ఎన్నికల్లో ఓటమి తప్పదని గుర్తించిన కాంగ్రెస్ నాయకులు గూండాయిజం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ తాటాకు చప్పుళ్లకు భయడేది లేదని స్పష్టంచేశారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు ఖా యమని, ప్రజలు ఇప్పటికే డిసైడ్ అయ్యారని తెలిపారు. కాంగ్రెస్ నాయకులు ఎన్ని చిల్లర రాజకీయాలు చేసినా మున్సిపల్ ఎన్నికల్లో ఎగిరేది గులాబీ జెండానే అని పేర్కొన్నారు.