Telangana Assembly Elections | తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఏ రేవంత్ రెడ్డిపై రోజురోజుకు కాంగ్రెస్ పార్టీలో వ్యతిరేకత, నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. సీనియర్ల నుంచి జూనియర్ల వరకూ ప్రతి ఒక్కరూ రేవంత్ తీరుపై మండి పడుతున్నారు. ఉమ్మడి ఏపీలో ఉన్నప్పుడు పార్టీలో కీలకంగా వ్యవహరించిన టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య రాజీనామాపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డిని నెటిజన్లు, తెలంగాణ వాదులు తప్పుబడుతున్నారు.
తనకు మద్దతు పలకని వారిని రేవంత్ రెడ్డి పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ వాదులు వాపోతున్నారు. తాజాగా టీపీసీసీ కార్యదర్శిగా పని చేసిన కురువ విజయ్ కుమార్ భగ్గుమన్నారు. గద్వాల్ టికెట్ రూ.10 కోట్లు, ఐదెకరాల భూమికి అమ్ముకున్నారని సంచలన ఆరోపణలు చేశారు.
అంతటితో ఆగకుండా గాంధీభవన్ వద్దే రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేసి ఆందోళనకు దిగారు. ‘నాడు ఓటుకు నోటు.. నేటు సీటుకు నోటు’ అని పేర్కొంటూ తన అనుయాయులతో కలిసి గన్ పార్క్ వద్ద ఆందోళనకు దిగారు. రేవంత్ రెడ్డి వల్ల కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా నష్టపోతున్నదంటూ ఆరోపణలు గుప్పించారు. కనుక టీపీసీసీ అధ్యక్ష పదవి నుంచి రేవంత్ రెడ్డిని తొలగించాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా తీవ్ర వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో కురువ విజయ్ కుమార్ను కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు టీపీసీసీ ప్రకటించడం కొసమెరుపు.