జిన్నారం (బొల్లారం) జనవరి 21 : సంగారెడ్డి జిల్లా బొల్లారం మున్సిపల్ పరిధిలో మంగళవారం పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరైన పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డికి సొంత పార్టీ నాయకులనుంచి నిరసన సెగ తగిలింది. అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాన్ని ఏడో వార్డు నుంచి ప్రారంభించిన ఎమ్మెల్యేను కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు జైపాల్‌రెడ్డితో కలిసి అడ్డుకున్నారు. జిల్లాకు చెందిన మంత్రి దామోదర రాజనర్సింహ చేయాల్సిన పనులను ఎలా ప్రారంభిస్తారని ప్రశ్నించారు. శిలాఫలకాలపై చైర్పర్సన్ భర్త పేరును పెట్టడంపై ఆక్షేపించారు. దీంతో ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. నాయకులను అడ్డుకోబోయిన పోలీసులను ఎమ్మెల్యే వారించారు. బీఆర్ఎస్ నాయకులకు ఎమ్మెల్యే మహిపాల్ వత్తాసు పలుకుతున్నారని కాంగ్రెస్ శ్రేణులు విమర్శించాయి.