Indiramma Indlu | నెల్లికుదురు/కొడకండ్ల/బయ్యారం, ఏప్రిల్ 30 : ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో బుధవారం ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలుచోట్ల గొడవలు చోటుచేసుకున్నాయి. జనగామ జిల్లా కొడకండ్ల మండలం నర్సింగాపురంలో ఇందిరమ్మ ఇండ్ల అర్హుల జాబితాను ఎంపీడీవో ప్రదర్శించగా, కొందరు తమ పేర్లు రాకపోవడంతో మండిపడ్డారు. ఓ కాంగ్రెస్ నాయకుడు స్పందిస్తూ ‘నా పేరు రాకపోవడానికి కారకుడివి నువ్వేనని మరో నాయకుడిపై గొడవకు దిగడంతో ఒకరికి గాయాలయ్యాయి.
మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం మునిగలవీడులో అనర్హులకు పెద్దపీట వేశారని గ్రామస్థులు ఎంపీడీవో కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకుడు మురుగుండ్ల ఎల్లయ్య, సీపీఎం మండల కార్యదర్శి ఇస్సంపల్లి సైదులు మాట్లాడుతూ.. భూమి ఉండి, ఇండ్లు ఉన్న వారినే ఎంపిక చేశారని ఆరోపించారు. బయ్యారం మండలం వెంకట్రాపురంలో ఇందిరమ్మ కమిటీ సభ్యులు, గ్రామస్థుల మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నది. దీంతో కొద్దిసేపు ఇరువర్గాల మధ్య వివాదం నెలకొనగా పోలీసులు రావడంతో గొడవ సద్దుమణిగింది.
కరకగూడెం, ఏప్రిల్ 30 : అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని, అనర్హులకు ఇస్తే ఊరుకునేది లేదని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం చొప్పాల గ్రామస్థులు హెచ్చరించారు. చొప్పాల పంచాయతీ పరిధిలో 24 మందికి ఇండ్లు మంజూరయ్యాయని బుధవారం సర్వేకు వచ్చిన అధికారులు వివరించగా.. వారు నిరసన తెలిపారు. అర్హులను పక్కనపెట్టి.. భూములు, ఉద్యోగాలు ఉన్న వారికి ఇండ్లు ఎలా మంజూరు చేశారంటూ వాగ్వాదానికి దిగారు. ఈ విషయమై కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. స్థానికుల ఆందోళనతో అధికారులు వెనుదిరిగారు.
ఇల్లెందు, ఏప్రిల్ 30 : నిరుపేదలమైన తమకు ఇండ్లు ఇవ్వకుండా.. కాంగ్రెస్ నాయకులకు మాత్రమే మంజూరు చేయడాన్ని నిరసిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు పట్టణంలోని 3వ వార్డుకు చెందిన ప్రజలు బుధవారం ఇందిరమ్మ కమిటీ సభ్యులు, అధికారులను నిలదీశారు. వార్డులో నిరుపేదలైన 13 మందికి ఇండ్లు మంజూరైనట్టు సర్వేకు వచ్చిన అధికారులు తెలిపారు. నిరుపేదలకు ఇండ్లు ఇవ్వకుండా.. కాంగ్రెస్ కార్యకర్తలకు ఎలా మంజూరు చేశారని ప్రశ్నించడంతో అధికారులు వెనుదిరిగారు. అనంతరం కాంగ్రెస్ నాయకులు, ఇందిరమ్మ కమిటీ సభ్యుల మధ్య ఇండ్ల కేటాయింపుపై గొడవ జరిగింది. ఇల్లు మంజూరుకు డబ్బులు తీసుకున్నారంటూ పరస్పరం దూషించుకున్నారు.
తొర్రూరు, ఏప్రిల్ 30 : అర్హులందరికీ ఇండ్లు ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అమలులో మాత్రం విఫలమవుతున్నదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలోని 29 గ్రామాల నుంచి 49,300 మంది ఇందిరమ్మ ఇండ్లకు దరఖాస్తు చేస్తే కేవలం నాలుగు వేల మందిని అర్హులుగా గుర్తించింది. చివరికి ఎల్-1 జాబితాలో 600 మందిని ఎంపిక చేసింది. వెంకటాపురంలో ఇటీవల కాంగ్రెస్ నేతల ఒత్తిడితో ఇండ్ల విచారణను అధికారులు అర్ధాంతరంగా నిలిపివేశారు. ఈ నేపథ్యంలో బాధితుడు కొండ యాకన్న మాట్లాడుతూ ‘నా తల్లి పేరు మీద ఇల్లు మంజూరైంది. నేను బీజేపీకి చెందిన వాడినన్న కారణంతో అధికారులను బెదిరించి విచారణను నిలిపివేశారు’ అని ఆవేదన వ్యక్తం చేశాడు. వెంకటాపురంలో మంజూరైన 17 ఇండ్లలో 13 ఇండ్ల్లకు మాత్రమే విచారణ జరిపి, మిగతా నాలుగు ఇండ్లకు విచారణ ఆపివేయడంపై గ్రామస్థులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై తొర్రూరు డిప్యూటీ తహసీల్దార్ నరసయ్యను వివరణ కోరగా వెంకటాపురానికి మంజూరైన 17 ఇండ్లకుగాను 13 ఇండ్లకు విచారణ జరిపినట్టు చెప్పారు. మిగిలిన వాటిపై విచారణ ఆపాలని ఎమ్మెల్యే పీఏ ఫోన్ చేసి చెప్పడంతో విచారణ నిలిపివేసినట్టు పేర్కొన్నారు.