Kollapur | కొల్లాపూర్, ఏప్రిల్ 25 : రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఇలాక కొల్లాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. మంత్రి జూపల్లి సొంత మండలం అయిన చిన్నంబావిలో కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షుడు ఈదన్న యాదవ్ మరి కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి కొల్లాపూర్ పట్టణంలో మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో రాష్ట్ర మంత్రి జూపల్లి సొంత మండలంలోనే కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లు అయింది.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు దొంగ హామీలు ఇచ్చి ఇప్పుడు హామీలను అమలు చేయకపోవడంతో సొంత పార్టీ నాయకులే ప్రజలకు, రైతులకు సమాధానం చెప్పలేక తిరుగుబాటు చేస్తున్నారనేందుకు బీఆర్ఎస్ పార్టీలో చేరికలే నిదర్శనం అన్నారు. కొల్లాపూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప కాంగ్రెస్ పాలనలో చేసింది ఏమీ లేదన్నారు. రైతులకు పూర్తిస్థాయిలో రుణమాఫీ రైతు భరోసా అందజేయకపోవడంతో రైతులు పంటలు పెట్టుబడులకు దళారులపై ఆధారపడి పరిస్థితి కాంగ్రెస్ పాలనలో వచ్చిందన్నారు. అధికార పార్టీ నుంచి ప్రతిపక్ష పార్టీలోకి వలసలు వస్తున్నారంటే రాష్ట్రంలో ఉన్న పరిస్థితి అద్దం పడుతుందన్నారు భవిష్యత్తు బీఆర్ఎస్ పార్టీదేనని ఆ పార్టీతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన తెలిపారు.
కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరిన ప్రతి నాయకుడిని పేరుతో ఆప్యాయంగా పలకరిస్తూ గులాబీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీలో చేరిన కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షుడు ఈదన్న యాదవ్ మాట్లాడుతూ కొల్లాపూర్ నియోజక వర్గ అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ పాలనలో కుంటు పడిందని రైతులకు ఇచ్చిన ఏ హామీని కూడా అమలు చేయలేదని గ్రామాలలో ప్రజలకు ముఖం చూపలేకనే బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు వెల్లడించారు. సుదీర్ఘ కాలంగా రాష్ట్ర మంత్రిగా పనిచేసినా జూపల్లి కృష్ణారావు సొంత మండలం అయిన చిన్నంబావిలో సైతం అభివృద్ధి జరగలేదన్నారు. మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి హయంలోనే నియోజవర్గంలో ఉన్న దీర్ఘకాలిక సమస్యలను పరిష్కారం చేశాడన్నారు. చిన్నంబావి మండల రైతుల ఆయువుపట్టైనా సింగోటం – గోపలదిన్నె లింకు కెనాల్‌కు మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి నిధులు మంజూరు చేయించి పనులను ప్రారంభిస్తే కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత పనులు నిలిచిపోయాయని ఆయన ఆరోపించారు. అందుకే కాంగ్రెస్ పార్టీతో అభివృద్ధి సాధ్యం కాదని పార్టీని వీడినట్లు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నుండి దాదాపు 20 మంది బీఆర్ఎస్ లో చేరిన వారు ఉన్నారు.