Congress | మహబూబాబాద్, మే 13: ఓల్డ్ ఏజ్ హోమ్‌లో ఉన్న వృద్ధులను ఓటెయ్యకుండా అడ్డుకుని కాంగ్రెస్ నాయకులు జులుం ప్రదర్శించారు. మహబూబాబాద్ మండలంలోని సికింద్రాబాద్ తండాలో దైవకృప అనాథాశ్రమంలో ఏడుగురు వృద్ధులు ఉన్నారు. వారందరికీ ఇక్కడే ఓటుండగా, గతంలోనూ, ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లోనూ వారందరూ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సోమవారం వృద్ధ్దులు ఓటు వేసేందుకు పోలింగ్ బూత్‌కు వెళ్లారు. దీంతో కొంతమంది రెడ్యాలకు చెందిన కాంగ్రెస్ నాయకులు అనాథ వృద్ధులను ఓటు వేయొద్దని అడ్డుకున్నారు. దీంతో సికింద్రాబాద్ తండా మాజీ సర్పంచ్ బీఆర్ఎస్ నాయకుడు ఇస్తారి, బీఆర్ఎస్ నాయకుడు కేఎస్ఎన్ రెడ్డికి సమాచారం అందించాడు.
పోలింగ్ బూత్‌కు చేరుకున్న కేఎస్ఎన్ రెడ్డి వృద్ధులను ఓటు వేయించేందుకు తీసుకెళ్తుండగా కాంగ్రెస్ నాయకులు మళ్లీ అడ్డుకున్నారు. విషయం బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మాలోత్ కవితకు చేరింది. హుటాహుటిన రెడ్యాల పోలింగ్ బూత్ వద్దకు వెళ్లిన కవితను సైతం అడ్డుకునేందుకు కాంగ్రెస్ శ్రేణులు యత్నించాయి. అక్కడ కొంత సేపు ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. వారికి ఎక్కడ ఆధార్ కార్డు ఉంటే అక్కడ ఓటు వేస్తారని, ఎంపీ అభ్యర్థి కవిత కాంగ్రెస్ నాయకులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. చివరికీ తహసీల్దార్ చెప్పినా కాంగ్రెస్ కార్యకర్తలు మద్యం మత్తులో ఉండి వృద్ధులను అక్కడి నుంచి కదలనియ్యలేదు. అందులో ఒకరిని మాత్రమే ఓటు వేసేందుకు పంపారు. మిగతా ఆరుగురు వృద్ధులను ఓటు వేయకుండా అడ్డుకున్నారు.