ఉస్మానియా యూనివర్సిటీ, అక్టోబర్ 8: టికెట్లు డిమాండ్ చేస్తూ ఓయూ విద్యార్థి సంఘం నేతలు ఢిల్లీలో స్క్రీనింగ్ కమిటీ భేటీ జరుగుతున్న వార్ రూం ఎదుట ఆదివారం దిగారు. రాహుల్‌గాంధీ ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని, ఉదయ్‌పూర్ డిక్లరేషన్‌ను అమలు చేయాలని నినాదాలు చేశారు. తెలంగాణ విద్యార్థి ఉద్యమంలో పనిచేసిన తమకు ఎన్నికల్లో పోటీచేసే అవకాశం కల్పిస్తానని 2018 ఎన్నికల సమయంలో రాహుల్ హామీ ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు.
పదేండ్లుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాటం చేస్తూ, కేసులను ఎదుర్కొంటూ పార్టీ కోసం పనిచేస్తున్న తమకు టికెట్లు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో డాక్టర్ కురువ విజయ్‌కుమార్ (గద్వాల), మానవతారాయ్ (సత్తుపల్లి), పున్న కైలాశ్ నేత (మునుగోడు), దుర్గం భాస్కర్ (చెన్నూరు), డాక్టర్ కేతూరి వెంకటేశ్ (కొల్లాపూర్), బాలలక్ష్మి (జనగామ) తదితరులు పాల్గొన్నారు.