కొల్లాపూర్, డిసెంబర్ 5: నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌లో బీఆర్ఎస్ సానుభూతిపరులపై అధికార కాంగ్రెస్ పార్టీ దౌర్జన్యాలు మితిమీరుతున్నాయి. కొల్లాపూర్ మండలం ఎల్లూరులో దళిత వర్గానికి చెందిన బీఆర్ఎస్ సానుభూతిపరురాలు శశికళ సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఆమెకు మద్దతుగా ఉన్నారన్న నెపంతో అదే గ్రామానికి చెందిన ఓ పేదోడి బతుకుదెరువుపై అధికార కాంగ్రెస్ పార్టీ బుల్డోజర్ను ప్రయోగించి బాధిత కుటుంబాన్ని రోడ్డుపాలు చేసింది. ఎల్లూరుకు చెందిన మీయేటి కురుమయ్య 8 ఏండ్లుగా కొల్లాపూర్ పట్టణంలోని 6వ వార్డులో డబ్బాలో కూరగాయాలు పెట్టుకొని జీవనం సాగిస్తున్నాడు.
ఎల్లూరులో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థి ఓటమి పాలవుతాడేమోనని గ్రహించిన ఆ పార్టీ నేతలు.. బీఆర్ఎస్ సానుభూతిపరులపై దాడులకు తెగబడ్డారు. గురువారం కురుమయ్యపైనా కక్ష పెట్టుకుని ఆయ న కురగాయల డబ్బాను అకారణంగా మున్సిపల్ అధికారులు, సిబ్బందితో తొలగించారు. ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా, డబ్బాలోని కురగాయాలను తీసుకోనివ్వకుండా జేసీబీతో ఊరిచివరి వరకు తీసుకెళ్లి విసిరి పడేశారు. బీఆర్ఎస్కు మద్దతుగా నిలిచామనే అక్కసుతో తమ పొట్టకొట్టారని బాధిత కుటుంబం వాపోయింది. కొల్లాపూర్ నియోజకవర్గంలో మితిమీరిన అరాచకాలకు పాల్పడుతున్న కాంగ్రెస్‌కు సరైన గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి హెచ్చరించారు. కురుమయ్య డబ్బా తొలగింపు విషయం తెలుసుకున్న ఆయన శుక్రవారం ఘటనా స్థలాన్ని పరిశీలించారు.