పెద్దపల్లి, జనవరి 11(నమస్తే తెలంగాణ)/కోల్‌సిటీ/గోదావరిఖని : రాష్ట్ర మంత్రులు పాల్గొన్న బహిరంగ సభలో ఇద్దరు కాంగ్రెస్ నాయకులు తన్నుకున్నారు. ఈ ఘటన ఆదివారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో సంచలనం సృష్టించింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతోపాటు నలుగురు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్‌బాబు, కొండా సురేఖ, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ పాల్గొన్న వేదికపై పార్టీ నాయకులు, ప్రజలు, జర్నలిస్టులు చూస్తుండగానే సదరు కాంగ్రెస్ నాయకులు సోయి మరిచి పరస్పరం దాడులు చేసుకోవడం సభలో గందరగోళానికి దారితీసింది. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ ఆధ్వర్యంలో సుమారు రూ.600 కోట్లతో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం, ఇందిరమ్మ ఇండ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం భట్టితోపాటు నలుగురు మంత్రులు, ఇతర ప్రముఖులు హాజరయ్యారు.
అభివృద్ధి పనుల ప్రారంభం అనంతరం అక్కడే జరిగిన బహిరంగ సభలో పాల్గొని మంత్రులు ఒక్కొక్కరుగా ప్రసంగించారు. పార్టీ కార్యకర్తల గురించి, రామగుండం ఎమ్మెల్యే గురించి గొప్పగా చెప్పుకొన్నారు. ఆ కొద్ది సేపటికే వేదికపై ఫైవింక్లయిన్ ఏరియాకు చెందిన కాంగ్రెస్ నాయకుల మధ్య గొడవ జరగడంతో అంతా విస్తుపోయారు. మహిళా మాజీ కార్పొరేటర్ ఒకరు తమ డివిజన్లోని నిరుపేద మహిళకు ఇందిరమ్మ ఇంటి పట్టా కోసం తీసుకురాగా, అక్కడే ఉన్న ఆ డివిజన్‌కు చెందిన మరో నాయకుడు ఆ పట్టా తానే ఇప్పించానని, వేదికపై తనతో ఫొటో దిగాలంటూ పట్టుబట్టడం, సదరు మహిళ తిరస్కరించడం, ఆ క్రమంలో మాటామాట పెరిగి కొట్టుకునేదాకా రావడం.. తోసుకోవడంతో సదరు మహిళకు స్వల్పంగా గాయమైనట్టు తెలిసింది.
ఆ తర్వాత సదరు కాంగ్రెస్ నాయకులు ఒకరినొకరు భౌతిక దాడులకు దిగారు. ‘నువ్వెంత అంటే నువ్వెంత?’ అంటూ వేదికపై విచక్షణ కోల్పోయి పిడుగుద్దులు కురిపించుకోవడంతో ఉద్రిక్తత చోటుచేసుకున్నది. అక్కడే వేదికపై ఉన్న నాయకులు.. దాడి దృశ్యాలు ప్రజలకు కన్పించకుండా అడ్డుగా గుమిగూడారు. సభలో ఉన్న జనమంతా నిశ్చేష్ఠులై చూస్తుండిపోయారు. పోలీసులు వేదికపైకి చేరుకొని గొడవకు దిగిన వారిని బలవంతంగా అక్కడి నుంచి వెళ్లగొట్టారు. ఈ ఘటన పార్టీ, నగరంలో తీవ్రంగా చర్చనీయాంశమైంది. ఇటీవల సదరు ద్వితీయ శ్రేణి నాయకుడు తానే ఎమ్మెల్యేనంటూ పలువురికి స్వయంగా ఫోన్లు చేస్తున్నట్టు కూడా ఆరోపణలు ఉన్నాయి.
కాంగ్రెస్ పార్టీలో వర్గవిభేదాలు ఇంకా చల్లారడం లేదు. ముఖ్యంగా పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజక వర్గంలో విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇక్కడ అభివృద్ధి పనులు, కార్యక్రమాలు జరిగినా సాక్షాత్తు కాంగ్రెస్ ఎంపీ గడ్డం వంశీకృష్ణకు సమాచారం ఇవ్వడం లేదు. ఈ విషయాన్ని అధిష్ఠానం దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేకుండా పోయింది. ఆదివారం గోదావరిఖనిలో నిర్వహించిన సభకు ఐదుగురు మంత్రులు హాజరై పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఇందులో ఎంపీ వంశీకృష్ణ కనిపించలేదు. ఈ విషయాన్ని మంత్రులు ప్రస్తావించలేదు. ఆయన అందుబాటులో ఉన్నా సమాచారం లేకనే రాలేదని ఎంపీ వర్గీయులు పేర్కొంటూ వారు బహిరంగ సభను బహిష్కరించారు. కోల్ట్బెల్ట్తో విడదీయరాని అనుబంధం ఉన్న మంత్రి వివేక్ వెంకటస్వామిని సభకు ఆహ్వానించకపోవడంపైనా వివేక్ వర్గీయులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఓవైపు అతని కొడుకు ఎంపీ వంశీని విస్మరిస్తూనే మంత్రి వివేక్‌ను సైతం పక్కన పెట్టడంపై కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా ఆక్షేపిస్తున్నారు.