బెల్లంపల్లి, నవంబర్ 8 : ‘ఏఐసీసీ లింక్ దొరికింది. ప్రభాకరన్నకు డీసీసీ ఖాయమైనట్టే. త్వరలో అధిష్ఠానం పేరు ప్రకటిస్తుంది. బెల్లంపల్లి నుంచి డీసీసీ అధ్యక్షుడి పేరు ఒక్కటే పంపించామన్నారు. డీసీసీ అధ్యక్ష పదవి గురించి బెల్లంపల్లి నుంచి చాలామంది దరఖాస్తు చేసుకున్నారు. కానీ, డబ్బులు పెట్టుకోవడానికి ప్రభాకర్ అన్న ఓకే అన్నారు. దీంతో బెల్లంపల్లి నుంచి ఒకే ఒక్క పేరు మాత్రమే పరిశీలనకు వెళ్లింది. అది ప్రభాకర్‌ది మాత్రమే. బెల్లంపల్లి మున్సిపాలిటీలో 34 వార్డులకు ఒక్కో వార్డుకు ఇద్దరు లబ్ధిదారులను డబుల్ బెడ్రూం ఇండ్లకు ఎంపిక చేస్తున్నాం.
ఎవరైనా నిరుపేదలుంటే చూడు. రూ. మూడు లక్షలిస్తే సరిపోతుంది. నమ్మకమున్న వారిని చూడు ఇప్పిద్దాం’ అంటూ మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని బజార్ ఏరియాకు చెందిన ఓ కాంగ్రెస్ నాయకుడు కాల్టెక్స్ ఏరియాకు చెందిన మరో మహిళా నాయకురాలితో ఫోన్లో జరిపిన సంభాషణల ఆడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఇందుకు మహిళా నాయకురాలు స్పందిస్తూ.. పేద వారైతే రూ. మూడు లక్షలు ఎందుకిస్తారనగా.. ‘జాతీయ రహదారి పక్కన అలాంటి ఇల్లు కట్టుకోవాలంటే ఎంత అవుతుందో తెలుసా? నువ్వు కూడా ఇల్లు కుట్టుకున్నావు కదా.. ఎంతైంది? దాదాపు రూ.30 లక్షలు అయితే తప్ప అక్కడ ఇల్లు కాదు’ అంటూ సదరు నాయకుడు చెప్పుకొచ్చాడు.
ఆపై రూ.మూడు లక్షలిస్తేనే డబుల్ బెడ్రూం ఇల్లు వస్తుంది. లేకపోతే నీ ప్లేస్‌లో ఇతరులకు ఈ ఆఫర్ ఇస్తాం’ అని తేల్చి చెప్పాడు. ఇద్దరు నిరుపేదలతో సంబంధిత ధ్రువీకరణ పత్రాలతో అప్లయ్ చేయించాలని సూచించాడు. ఈ మూడు లక్షలు తనకొక్కడికే కాదని, ఇందులో చాలామంది ఉంటారని చెప్పుకొచ్చాడు. కాంగ్రెస్ నేతలు, పీఏలకు కూడా ఇవ్వాల్సి ఉంటుందని అన్నడు. ‘మన అనుకునే వాళ్లకు మాత్రమే చెప్పు.. ఫోన్ రికార్డింగ్‌లు చేస్తారు.. డైరెక్ట్‌గా కలిసి చెప్పు’ అంటూ తగు జాగ్రత్తలు చెప్పాడు. ఇల్లు మంజూరైన తర్వాతనే డబ్బులు ఇవ్వవచ్చని ఆఫర్ ఇచ్చాడు. దీనికి సంబంధించిన ఆడియో టేపులు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ కావడంతో అర్హులకు డబుల్ బెడ్రూం ఇండ్లు దక్కవని అసలైన లబ్ధిదారులు
ఆందోళన చెందుతున్నారు.