MLA Sunitha Lakshma Reddy | నర్సాపూర్/శివ్వంపేట, సెప్టెంబర్ 23: బీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ దాడులు కొనసాగుతున్నాయి. మొన్న సిద్దిపేటలో హరీశ్‌రావు కార్యాలయంపై, నిన్న హైదరాబాద్‌లో ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి ఇంటిపై, నేడు మెదక్ జిల్లా శివ్వంపేట మండలం గోమారంలో నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి ఇంటిపై కాంగ్రెస్ శ్రేణులు దాడికి తెగబడ్డాయి. గ్రామానికి చెందిన కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు ఆదివారం అర్ధరాత్రి వినాయక నిమజ్జనం ముసుగులో సునీత ఇంటి ముందు పటాకులు కాల్చి నానా హంగామా చేశారు.
ఆమె ఇంట్లోకి వెళ్లి టపాకులు కాల్చే ప్రయత్నం చేయగా అడ్డుకుని ప్రశ్నించిన యువకుడు మణిదీప్‌పై దాడికి దిగారు. అంతటితో ఆగకుండా ఇటుకలు, కట్టెలతో ఇంటిపై దాడిచేశారు. విషయం తెలిసి అక్కడికి వచ్చిన స్థానిక బీఆర్ఎస్ నేతలను కూడా అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నించిన పోలీసులను సైతం కాంగ్రెస్ నాయకులు తోసివేశారు. శివ్వంపేట ఎస్సై మహిపాల్‌రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు.
తన ఇంటిపై దాడి జరిగిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. తన ఇంటిపై దాడితో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని మండిపడ్డారు. ప్రణాళిక ప్రకారమే తన ఇంటిపై దాడి జరిగిందని ఆరోపించారు. ఇంట్లో నిద్రపోతున్న పిల్లలపైనా దాడిచేశారని ఆరోపించారు. దాడులు ఎందుకు చేశారు? వాటి వెనక ఉన్నదెవరు? కారణమేంటి? అని ప్రశ్నించారు. దాడిపై పోలీసులకు ఫిర్యాదు చేశామని, దాడికి పాల్పడిన వారిపైన, వారిని ప్రోత్సహించిన వారిపైనా హత్యాయత్నం కింద కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ తమకు సంస్కారం నేర్పబట్టే సైలెంట్‌గా ఉంటున్నామని పేర్కొన్నారు. పోలీసుల నిర్లక్ష్యంగా కారణంగానే దాడులు జరిగాయని ఆరోపించారు. హెడ్‌కానిస్టేబుల్‌పై జరిగిన దాడిని ప్రస్తావిస్తూ రాష్ట్రంలో పోలీసులకు కూడా రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న నియోజవకర్గ బీఆర్ఎస్ నాయకులు పెద్ద సంఖ్యలో వచ్చి ఎమ్మెల్యేను పరామర్శించారు.
‘ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి ఇంట్లో ఉంటున్న నాపై కొందరు కాంగ్రెస్ నాయకులు అకారణంగా దాడి చేశారు. వినాయక నిమజ్జనం సందర్భంగా ఆదివారం రాత్రి ఒంటిగంట ప్రాంతంలో కొందరు కాంగ్రెస్ నాయకులు పటాకులు ఎమ్మెల్యే ఇంటి గేటు లోపలికి వచ్చి కాల్చే ప్రయత్నం చేశారు. ఇదేంటని ప్రశ్నిస్తే గుంటాల నర్సింహారెడ్డి, పెద్దపట్లోరి భాస్కర్‌రెడ్డి, నాగులూరి సుధాకర్‌రెడ్డి, సర్జన రమేశ్ అన్యాయంగా దాడి చేశారు’ అని మణిదీప్‌గౌడ్ వివరించాడు.
ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి ఇంటిపై దాడికి పాల్పడిన ఘటనలో నలుగురిపై కేసు నమోదు చేసినట్టు శివ్వంపేట ఎస్సై మహిపాల్‌రెడ్డి తెలిపారు. ఎమ్మెల్యే ఇంట్లో ఉన్న మణిదీప్గౌడ్పై అదే గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులు దాడి చేసినట్టు చెప్పారు. అతడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు.
మాజీ మంత్రి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ఇంటిపై కాంగ్రెస్ గూండాలు దాడి చేయటం అత్యంత హేయమైన చర్య. దాడికి పాల్పడిన కాంగ్రెస్ గుండాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ దాడులతో సునీతా లక్ష్మారెడ్డి వంటి బలమైన నాయకుల మనోసె్థైర్యాన్ని దెబ్బతీయలేరు.
– బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
మాజీ మంత్రి, ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి ఇంటిపై దాడి చేసిన కాంగ్రెస్ పార్టీ గూండాలను వెంటనే అరెస్టు చేయాలి. దాడులతో బీఆర్ఎస్ పార్టీని, మహిళా ప్రజాప్రతినిధులను భయపెట్టివ్వాలనుకోవడం కాంగ్రెస్ పార్టీ మూర్ఖత్వమే.
– మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
ఇందిరమ్మ పా లన తెస్తామ ని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ రాష్ట్రంలో రాక్షసపాలన కొనసాగిస్తున్నది. నర్సాపూ ర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ఇంటిపై కాంగ్రెస్ గూండాల దాడిని తీవ్రంగా ఖండిస్తున్న. రేవంత్‌రెడ్డి పాలనలో తెలంగాణను బీహా ర్ మాదిరిగా మార్చేస్తున్నారు. ఎమ్మెల్యే ఇంటిపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలి.
– మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్