మేడ్చల్, జూలై19(నమస్తే తెలంగాణ)/నేరెడ్మెట్: బీసీ నేతలపై దాడులు చేస్తే చూస్తూ ఊరుకోబోమని సనత్‌నగర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ హెచ్చరించారు. కాంగ్రెస్ నేతల ఆగడాలు మితిమీరాయని, రాష్ట్రంలో అసలు శాంతిభద్రతలు ఉన్నాయా.. అంటూ ప్రశ్నించారు. మైనంపల్లి అనుచరులు, కాంగ్రెస్ కార్యకర్తల దాడిలో గాయపడిన బీఆర్ఎస్ బీసీ నాయకులను శాసనమండలి ప్రతిపక్ష నాయకుడు మధుసూదనాచారి, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, ఎమ్మెల్యేలు మర్రి రాజశేఖర్‌రెడ్డి, పద్మరావుగౌడ్, ముఠా గోపాల్, కాలేరు వెంకటేశ్‌తో కలిసి పరామర్శించారు. బాధితులు రాముయాదవ్, జగదీశ్‌గౌడ్, చిన్నాయాదవ్, రాధకృష్ణాయాదవ్, వెంక య్య, రాములయాదవ్ నివాసాలకు వెళ్లారు.
అనంతరం విలేకరుల సమావేశంలో తలసాని మాట్లాడుతూ అల్వాల్‌లో నిర్వహించిన బోనాల చెక్కుల పంపిణీ అధికారిక కార్యక్రమంలో ప్రోటోకాల్ పాటించకపోవడం సరికాదని పేర్కొన్నారు. దాడులు చేసిన వారిని వదిలిపెట్టి, బాధితులపైనే కేసులు పెట్టారని మండిపడ్డారు. అధికారం శ్వాశతం కాదనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. మల్కాజిగిరి బస్టాండ్ వద్ద నడిరోడుపై ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తే పోలీస్‌వ్యవస్థ పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. బీసీ నేత రాముయాదవ్ను చంపేందుకు కుట్ర పన్నారని మండిపడ్డారు. ఎంతో ప్రశాంతంగా ఉన్న మల్కాజిగిరిలో ఇలాంటి ఘటనలు సహించబోమని హెచ్చరించారు. అవసరమైతే న్యాయపోరాటం చేస్తామని చెప్పారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వేదికలపై మాట్లాడుతున్న భాష సరిగా లేదని, ఆదే బాషను కాంగ్రెస్ శ్రేణులు వాడుతున్నారని తలసాని ధ్వజమెత్తారు. ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకుల ఇండ్లపై గతంలో దాడులను ఎప్పుడైనా చూ శామా..? అంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ తీరును ప్రజలు గమనిస్తున్నారని, రాష్ట్ర ప్రతిష్ఠను దెబ్బతీసేలా వ్యవహరించడం సరికాదని హితవు పలికారు. దాడులు చేసిన వారిపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.