కొల్లాపూర్ : నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ రేంజ్ ( Kollapur Range ) పరిధిలోని నార్లాపూర్ సెక్షన్ ఏరియా ఒట్టిమాకుల గుంట అడవి ప్రాంతంలో మంగళవారం కాంగ్రెస్ నాయకులు ( Congress Leaders ) అటవి అధికారులపై దాడులకు పాల్పడ్డారు.

కొద్ది రోజులుగా ముకిడిగుండం గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు అధికార పార్టీ అండతో దాదాపు కంపార్ట్మెంట్ 425 లో 15 ఎకరాలలో అడవిలోని చెట్లను నరికి చదును చేస్తున్నారని ఫారెస్ట్ అధికారులకు ( Forest Officials ) సమాచారం రావడంతో అడవి చెట్లను నరికి చెట్లను కాలుస్తున్న వారిని ప్రత్యక్షంగా పట్టుకున్నందుకు వెళ్లిన ఫారెస్ట్ సెక్షన్ అధికారి జయరాజ్తో పాటు బీట్ అధికారులు, వాచర్లపై విచక్షణ రహితంగా దాడులకు తెగబడ్డారు.

ఈ దాడిలో నార్లాపూర్ సెక్షన్ అధికారి జయరాజు తీవ్రంగా గాయపడగా, బీట్ అధికారి నాయక్ , వాచర్లు సుల్తాన్ , ఈదన్న, శేఖర్, రమేష్ , నిరంజన్ గాయలయ్యాయి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అడవి రక్షణకు మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి కఠిన చర్యలు తీసుకోవడంతో కొల్లాపూర్ రేంజ్ పరిధిలోని నల్లమలలో కలప స్మగ్లింగ్ పూర్తిగా ఆగిపోయింది.
మళ్లీ కాంగ్రెస్ అధికారంలో రావడంతో కొల్లాపూర్ రేంజ్ పరిధిలోని నల్లమలలో యధావిధిగా అడవి విధ్వంసం జరుగుతుందని పర్యావరణ ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక మంత్రి అండదండలతో ముక్డిగుండం గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు, మాజీ సర్పంచ్ శారదా లోకేష్, మాజీ సింగిల్ విండో డైరెక్టర్ శ్రీరాములు ,ఆయన కుమారుడు గణేష్, కుటుంబ సభ్యులు జ్యోతి తదితరులు దాడి చేసినట్లు పేర్కొన్నారు. 15 ఎకరాలలో ఫారెస్ట్ భూమిని ఆక్రమించుకునేందుకు చెట్లను నరికించారని ఎఫ్ఆర్సీ కమిటీ నాయకులు ఆరోపించారు.
ఫారెస్ట్ సిబ్బందిపై దాడి చేసిన వారిని అధికారులు అదుపులోకి తీసుకొని కొల్లాపూర్ ఫారెస్ట్ రేంజ్ కార్యాలయానికి తరలించారు. దాడి ఘటనపై ఫారెస్ట్ అధికారులు, సిబ్బంది తీవ్రంగా ఖండించారు. అడవి స్మగ్లర్ల నుంచి ఫారెస్ట్ సిబ్బంది ప్రాణాలకు రక్షణ కల్పించాలని ఫారెస్ట్ సెక్షన్ అధికారి , ఫారెస్ట్ అధికారుల సంక్షేమ సంఘం నాయకుడు ముజీబ్ గోరి ప్రభుత్వాన్ని కోరారు.