కోహీర్, డిసెంబర్ 22: పంచాయతీ ఎన్నికల ఫలితాల అనంతరం పలుచోట్ల ఓటమిని జీర్ణించుకోలేని కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ నాయకులపై, సామాన్య ఓటర్లపై దాడులు, దౌర్జన్యాలకు దిగుతున్నారు. ఇప్పటికీ అధికార పార్టీ నాయకుల ఆగడాలు కొనసాగుతున్నాయి. మంగళవారం సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలంసజ్జాపూర్లో దళితుడు బేగరి రాములుకు చెందిన ఇంటి షెడ్డును కాంగ్రెస్ నాయకుడు దౌర్జన్యంగా కూల్చివేశాడు. కాంగ్రెస్ నుంచి సర్పంచ్‌గా నిలిచిన తన తల్లికి ఓటువేయలేదనే కక్ష పెంచుకున్న కాంగ్రెస్ నేత ప్రసాద్‌రెడ్డి.. దళితుడు రాములు ఇంటి షెడ్డును కూల్చివేశారు. సోమవారం గ్రామ పంచాయతీ భవనంలో సర్పంచ్, వార్డు సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం గ్రామసభ నిర్వహించారు. పల్లెప్రకృతి వనానికి వెళ్లే దారికి అడ్డంగా ఇంటిని కడుతున్నాడని, దానిని కూల్చివేసేందుకు సభలో తీర్మానించారు.
వెంటనే జేసీబీని రప్పించి, పోలీసుల సమక్షంలో కూల్చి వేయించారు. తాను దళితుడిని అయినందునే దౌర్జన్యంగా తన ఇంటిని కూల్చివేశారని బేగరి రాములు ఆవేదన వ్యక్తంచేశారు. అసైన్డ్ భూమికి చెందిన పట్టాదారు పాస్‌పుస్తకం తన వద్ద ఉన్నదని, పల్లెప్రకృతి వనం ఏర్పాటు చేయడానికి ముందే తాము అక్కడ నివాసం ఉంటున్నామని తెలిపారు. నిర్మాణం కోసం రెవెన్యూ అధికారుల అనుమతులు తీసుకోగా, వారు కూడా అనుమతించారని తెలిపారు. కానీ, చుట్టుపక్కల అనేక ఇండ్లు ఉన్నా తన ఇంటి నిర్మాణాన్ని మాత్రమే కూల్చివేయడం బాధాకరమని పేర్కొన్నారు. దీనిపై గ్రామ పంచాయతీ కార్యదర్శి వికాస్పవార్ను వివరణ కోరగా.. పల్లెప్రకృతి వనం ఉన్న దారికి అడ్డంగా కడుతున్నారని వారం క్రితం నోటీసులు జారీ చేశామని పేర్కొన్నారు. సోమవారం గ్రామ పంచాయతీ తీర్మానంతో ఇంటి నిర్మాణాన్ని జేసీబీతో అడ్డుకున్నట్టు తెలిపారు.
ఖమ్మం జిల్లాలో ఆగని కాంగ్రెస్ దాడులు
ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ శ్రేణులపై కాంగ్రెస్ నేతల దాడులు ఆగడం లేదు. పంచాయతీ ఎన్నికల్లో ఓటమిని తట్టుకోలేకపోతున్న అధికార పార్టీ గూండాలు బీఆర్ఎస్ కార్యకర్తల ఇండ్లపైకి వచ్చి దాష్టీకానికి పాల్పడుతున్నారు. రఘునాథపాలెం మండలం రాంక్యాతండాలో మంగళవారం ఓటమిని జీర్ణించుకోలేని కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థి గెలుపునకు పాటుపడిన వ్యక్తి ఇంటిపై దాడి చేసి కుటుంబ సభ్యులందరినీ విచక్షణారహితంగా కొట్టారు. రాంక్యాతండాలో కాంగ్రెస్ వార్డు సభ్యురాలైన బానోత్ పార్వతి, ఆమె బంధువు కేలోత్ లచ్చి.. సర్పంచ్ అభ్యర్థి తేజావత్ వెంకన్న ప్రోద్బలంతో బీఆర్ఎస్ గ్రామశాఖ మాజీ అధ్యక్షుడు భూక్యా రాములు ఇంటిపై మూకుమ్మడిగా దాడికి దిగారు. అడ్డుకోబోయిన రాములు కుమారుడు గణేశ్, కోడలు రాజేశ్వరి, భార్య సుశీలను సైతం తీవ్రంగా కొట్టారు. దాడికి పాల్పడిన పార్వతి, ధరావత్ విజయ్, బానోత్ రాజేశ్, కేలోత్ లచ్చి. బానోత్ జశ్వంత్, ధరావత్ గణేశ్‌పై రఘునాథపాలెం పోలీస్‌స్టేషన్‌లో బాధితులు ఫిర్యాదుచేశారు. రాములు ఇంటిపై దాడి విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ ఖమ్మం నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, రఘునాథపాలెం మండల అధ్యక్షుడు అజ్మీరా వీరూనాయక్ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. మంత్రి తుమ్మల అండతోనే దాడులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.
ఆళ్లపాడులో బీఆర్ఎస్ నాయకులపై దాడి
బోనకల్లు మండలం ఆళ్లపాడులోమంగళవారం బీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ నాయకులు భౌతికదాడులకు పాల్పడ్డారు. కాంగ్రెస్ తరఫున వార్డు సభ్యుడిగా పోటీచేసి ఓడిపోయిన మల్లాది లింగయ్య ఎదురింట్లో ఉన్న పదిలం ఉదయ్‌కిరణ్, ప్రమీలపై దాడికి పాల్పడ్డాడు. ఉదయ్‌కిరణ్‌ను కర్రతో కొట్టి గాయపరిచి, ప్రమీలను అసభ్యంగా దూషించాడు. అడ్డుకోవడానికి ప్రయత్నించిన చెన్నకేశవ శ్రీకాంత్‌పై లింగయ్య కొడుకు ఉపేందర్ దాడి చేశాడు. ఘర్షణను సెల్ఫోన్లో వీడియో తీస్తున్న చెన్నకేశవ వేణుపై సైతం దాడిచేయడంతో తీవ్రగాయాలయ్యాయి. బాధితులు బోనకల్లు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. గాయపడిన వారిని మధిర ప్రభుత్వ దవాఖానకు తరలించి నిందితులపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు. మధిర దవాఖానలో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ కార్యకర్తలను జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ లింగాల కమల్‌రాజు పరామర్శించారు. కాంగ్రెస్ నాయకులు దాడులకు పాల్పడడం హేయమన్నారు.
ఎన్నికల్లో మద్దతివ్వలేదని దాడి
నెన్నెల, డిసెంబర్ 23 : మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం గొల్లపల్లిలో సర్పంచ్ ఎన్నికల్లో తమ అభ్యర్థికి మద్దతు ఇవ్వలేదంటూ కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షుడి ఇంటిపై అదే గ్రామానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు దాడిచేశారు. రాజేశ్ కథనం ప్రకారం.. సోమవారం రాత్రి తమ తల్లి ముత్తక్క ఇంటిలో ఉండగా, కాంగ్రెస్ కార్యకర్తలు మెండె తిరుపతి, సంతోశ్, రాములయ్య కరెంటు బంద్ చేసి ఇంటిలోకి చొరబడి ఆమెపై దాడి చేశారని తెలిపారు. నెన్నెల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశామన్నారు.
అట్రాసిటీ కేసు నమోదుచేయాలి :హరీశ్‌రావు
తమకు ఓటు వేయలేదని సంగారెడ్డి జిల్లా సజ్జాపూర్లోదళితుడు నిర్మిస్తున్న ఇంటిని కూల్చడం దుర్మార్గమని, దీనికి బాధ్యులైన సర్పంచ్‌తోపాటు ఆమె కుమారుడిపై వెంటనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని మాజీ మంత్రి హరీశ్‌రావు డిమాండ్ చేశారు. సజ్జాపూర్‌లో తాను నిర్మిస్తున్న ఇంటిని కూల్చివేశారని మంగళవారం హరీశ్‌రావు సహా జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్‌రావుకు బేగరి రాములు మొరపెట్టుకున్నాడు. ఈ మేరకు స్పందించిన హరీశ్‌రావు బాధితులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని హామీనిచ్చారు. రేవంత్‌రెడ్డి నేతృత్వంలో కొనసాగుతున్నది ప్రజాపాలన కాదని, పూర్తిగా రౌడీ రాజ్యమేనని ధ్వజమెత్తారు. సర్పంచ్ ప్రమాణం చేసిన కొద్దిగంటల్లోనే ఆమె కుమారుడు ప్రసాద్‌రెడ్డి తన అనుచరులతో కలిసి బేగరి రాములు ఇంటి నిర్మాణంపై జేసీబీతో దాడి చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ అరాచక పాలనకు ఈ ఘటన అద్దం పడుతుందని తెలిపారు. షెడ్డును ప్రభుత్వమే కట్టించాలని డిమాండ్ చేశారు. తక్షణసాయం కింద రూ.లక్ష అందజేస్తామని హామీ ఇచ్చారు.