పెద్దపల్లి రూరల్, మే 15: కొనుగోలు కేంద్రంలో ధర్నా చేస్తున్న రైతులపై ఓ కాంగ్రెస్ నేత దౌర్జన్యం చేసి, దుర్భాషలాడిన ఘటన పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండలం నిమ్మనపల్లిలో జరిగింది. రైతులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దపల్లి మండలం నిమ్మనపల్లిలోని కొనుగోలు కేంద్రంలో సన్న వడ్ల కొనుగోలులో జాప్యంపై రైతులు గురువారం సాయంత్రం పెద్దపల్లి-జూలపల్లి రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు.
ఈ క్రమంలోనే పెద్దపల్లి నుంచి సుల్తానాబాద్ మండలం దేవునిపల్లి వైపు వెళ్తున్న ఆ గ్రామానికి చెందిన శ్రీ లక్ష్మీనృసింహస్వామి ఆలయ చైర్మన్ అట్ల కుమార్ వీరిని చూసి ఆగ్రహానికిలోనయ్యారు. ‘మీరెందుకు ధర్నా చేస్తున్నారు. మీకేం హక్కు ఉందంటూ’ దుర్భాషలాడటంతో రైతులు కోపోద్రిక్తులయ్యారు. సదరు కాంగ్రెస్నేతపై దాడికి పాల్పడడంతో కొనుగోలు కేంద్రం వద్ద గందరగోళ పరిస్థితి నెలకొంది.
పెద్దపల్లి ఏసీపీ గజ్జి కృష్ణయాదవ్ ఆదేశాలమేరకు పోలీసులు రంగంలోకి దిగి ఇరువర్గాలను శాంతింపజేశారు. ఘర్షణలో నిమ్మనపల్లికి చెందిన రైతు ఆకుల సంపత్ చొక్కా చిరిగిపోయి, గాయాలయ్యాయి. పోలీసులు అతడిని పెద్దపల్లికి తరలించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ కొనుగోలు కేంద్రంలో 15 రోజులుగా సన్న వడ్లకు అలాట్మెంట్ పేరుతో ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వడ్లు కొనాలని సీఈవో చెప్పినా ఇక్కడి నిర్వాహకులు లంచాల మత్తులో ఇష్టం వచ్చిన వారివే కాంటాలు వేస్తున్నారని ఆరోపించారు.