యాదాద్రి భువనగిరి, నవంబర్ 23 (నమస్తే తెలంగాణ) : అధికారం అండతో కాంగ్రెస్ నేతలు రెచ్చిపోతున్నారు. తామేం చేసినా అడ్డు చెప్పేవారెవరూ లేరనే అహంకారంతో ఓ రైతుపై రాజకీయంగా కక్షగట్టారు. పాత గొడవలను దృష్టిలో పెట్టుకొని అతడి ధాన్యాన్ని కొనకుండా దౌర్జన్యానికి ఒడిగట్టారు. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం ఇంద్రపాలనగరంలో జరిగిన ఈ ఘటనపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. గ్రామానికి చెందిన విద్యాసాగర్‌రెడ్డికి వెయ్యి బస్తాల ధాన్యం దిగుబడి వచ్చింది. ఈ నెల 14న వ్యవసాయ అధికారులు పరిశీలించి తేమ శాతం రావడంతో 17న కాంటా వేసేందుకు గన్నీ బ్యాగులు పంపించారు. 20న కేంద్రంలో స్థలాభావం, పెద్ద మొత్తంలో వడ్లు ఉండటంతో పక్కనే నిల్వ ఉన్న ధాన్యాన్ని లారీలో లోడ్ చేసి ట్రక్‌షీట్ ఇచ్చారు. ముందే రైతు ఆన్లైన్లో బుక్ చేసుకోగా సీరియల్ నంబర్ 62 కూడా కేటాయించారు. అంతా సవ్యంగా సాగుతున్న క్రమంలో కాంగ్రెస్ నేతల రంగప్రవేశంతో సీన్ మారింది.
అధికారుల డబుల్ గేమ్
అయితే మార్కెట్ నుంచి కాకుండా.. ధాన్యం నిల్వ ఉన్న చోటుకు వెళ్లి ఎలా లోడ్ చేసుకుంటారని కాంగ్రెస్ నేతలు రాజకీయ కక్షకు దిగారు. ఎట్టి పరిస్థితుల్లో ధాన్యం దించుకోవద్దని అధికారులు, మిల్లు యజమానిపై ఒత్తిడి తెచ్చినట్టు తెలిసింది. విద్యాసాగర్‌రెడ్డి బీఆర్ఎస్ నేత కావడం, పాత గొడవల కారణంగా ఎట్టి పరిస్థితుల్లో వడ్లు కొనకుండా అడ్డుకొనే ప్రయత్నం చేశారు. నియోజకవర్గ కీలక నేత సైతం అండగా నిలిచారని ప్రచారం జరుగుతున్నది. 21న లోడ్‌తో మిల్లుకు చేరినా నిర్వాహకులు ధాన్యం దించుకోకపోగా అధికారులు ట్రక్‌షీట్‌ను డ్రైవర్ నుంచి దౌర్జన్యంగా లాక్కున్నారు. దీంతో రోజుంతా మిల్లు వద్దే లారీ ఉంది. వడ్లు వెనక్కి తీసుకెళ్లాలని అధికారులు సూచించగా.. రైతు ఒప్పుకోలేదు. ఈ క్రమంలో రైతు, పలువురు బీఆర్ఎస్ నేతలు లారీని అడ్డుకునే ప్రయత్నం చేశారు.
అధికారులే కొన్నాక మళ్లీ వెనక్కి ఎలా తీసుకెళ్తారని మండిపడ్డారు. ఆఖరికి ఆదివారం ఉదయం లోడ్‌ను తీసుకెళ్లి రైతు స్థలంలో అన్లోడ్ చేయడంతో కాంగ్రెస్ నేతల పంతం నెగ్గినట్టయ్యింది. మళ్లీ వడ్లు తీసుకొస్తే అప్పుడు తీసుకుంటామని అధికారులు చెబుతుండటం కొసమెరుపు. ఈ విషయమై పౌర సరఫరాల శాఖ జిల్లా మేనేజర్‌ను వివరణ కోరగా విచారణ జరుగుతున్నదని, నివేదిక వచ్చాక చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాగా అధికారులే సర్టిఫై చేశాక రైతుపైనే పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడం వారికే చెల్లింది. ఆదివారం కాంగ్రెస్ నేతలు ప్రెస్‌మీట్ పెట్టి గన్నీ బ్యాగుల దొంగతనం ఆరోపణలు చేశారు. ఆ తర్వాత వారి ఒత్తిడి మేరకే పీఏసీఎస్ సీఈవో పీఎస్‌లో పిటిషన్ ఇవ్వగా కేసు నమోదు చేసినట్టు విశ్వసనీయ సమాచారం.
రాజకీయ దురుద్దేశంతోనే కేసు
ఎప్పటిలాగే ఈసారి కూడా వడ్లు లోడ్ చేశాం. అధికారులు తేమ శాతం నిర్ధారించాకే గన్నీ బ్యాగులు ఇచ్చారు. తీరా ట్రక్‌షీట్ ఇచ్చాక కొత్త డ్రామా మొదలుపెట్టారు. లోడ్ దించుకోవద్దని మిల్లు యజమానిపై ఒత్తిడి తేవడంతో వారు అన్లోడ్ చేసుకోలేదు. అధికారులు డబుల్ గేమ్ ఆడుతున్నారు. ట్రక్ షీట్ ఇచ్చి.. మళ్లీ కాంగ్రెస్ ఒత్తిడితో గుంజుకోవడం ఏమిటి? గన్నీ బ్యాగులు దొంగతనం చేశానంటూ పిటిషన్ ఎలా ఇస్తారు? ధాన్యం ఎత్తే సమయంలోనే ఏం చేశారు? నాపై కేసు నమోదైందని పోలీసు చెప్తున్నరు. అంతా రాజకీయ కక్షతోనే చేశారు.
– మందడి విద్యాసాగర్‌రెడ్డి, రైతు, ఇంద్రపాలనగరం