Revanth Reddy | హైదరాబాద్, ఏప్రిల్ 26 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో ప్రజాపాలన అందిస్తున్నామంటూ కాంగ్రెస్ నేతలు విస్తృతప్రచారం చేస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఇందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. ప్రజాగ్రహం పెల్లుబుకుతున్నది. రైతులు, విద్యార్థులు, మహిళలు, వృద్ధులు, భూబాధితులు… ఇలా సబ్బండవర్ణాలు రోడ్డెక్కి తెలుపుతున్న నిరసనలే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఆరు గ్యారెంటీల హామీలతో ఆశపెట్టిన కాంగ్రెస్ నేతలు.. అధికారంలోకి వచ్చిరాగానే చేతులెత్తేశారని ప్రజలు మండిపడుతున్నారు. హస్తం పార్టీకి ఓటేయడం భస్మాసురహస్తమే అయిందని నిప్పులుచెరుగుతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా పల్లె నుంచి పట్నం వరకు ఎక్కడ చూసినా ఓకటే మాట… తినే కంచంలో మన్నువోసుకున్నట్టయింది… మోసపోయినం.. గోసవడుతున్నం అని. ఇలా ప్రజల్లో వ్యక్తమవుతున్న ఆవేదనకు, ఆక్రందనకు అక్షరూపం ఇచ్చిన ఓ కవితా సంపుటి ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా సంచలనంగా మారింది. రేవంత్‌రెడ్డి సర్కారుపై ‘రేవనాలు’ పేరుతో శుక్రవారం విడుదలైన పుస్తకం మీద రెండు రోజుల్లోనే సోషల్ మీడియాలో చర్చ జరుగుతున్నది.
విశ్వనాథుల పుష్పగిరి రాసిన ‘రేవనాలు’ ఆద్యంతం విస్ఫోటంగానే సాగిందని చాలామంది తెలంగాణవాదులు, కవులు, రచయితలు అభినందిస్తున్నారు. ప్రజాకంటక పాలన సాగిస్తూ.. ప్రశ్నించినవారిపై అరాచక భాషను ప్రయోగిస్తున్న కాంగ్రెస్ పాలకులకు దీటుగా సమాధానం చెప్పేలా ఉందని ప్రశంసిస్తున్నారు. పుష్పగిరి తన పుస్తకంలోని ‘ఇందిరమ్మ రాజ్యంలో..’ అనే కవితలో ఆరు గ్యారెంటీల డొల్లతనాన్ని అక్షరీకరించారు. ఆ కవితలో ఓ చోట హామీలనబడు హనీట్రాప్‌లో చిక్కుకున్న బాధితులు అని అన్నారు. అంతేకాకుండా 16 నెలల్లోనే 40 సార్లకు పైగా ఢిల్లీకి పోయిన రేవంత్‌రెడ్డి వైఖరిని కూడా ఘాటుగా విమర్శించారు. ఇదే విషయంపై ‘సామంతరాజా…’ అనే కవితలో ఢిల్లీకి కప్పంగడుతున్న గోదురు కప్ప.. చరిత్రలో ఏకైక ప్రీపెయిడ్ ముఖ్యమంత్రి.. కాళ్లిరిగిన కుర్చీకి.. ఎత్తుగట్టిన మాటలు ముల్లెల… మండ్రగప్పల మంత్రివర్గం అంటూ నిప్పులు చెరిగారు. అంతేకాకుండా రేవంత్‌రెడ్డి ప్రతిపక్షనేతల చావు కోరుతూ శాపనార్థాలు పెట్టడంపైనా పుష్పగిరి ఆగ్రహజ్వాలతో ఓ కవితను సంధించారు. ‘సాపెన’ అనే కవితలో… నాలుగున్నర కోట్ల జనం నిన్ను సాపిస్తున్నప్పుడు… నువ్వు ఎవరిదో సావుకోరుకుంటున్నవంటే… నీ నడిమంత్రపు సిరి ఎంత గావరపెడ్తుందో అని వ్యంగ్యాస్ర్తాలు సంధించారు.
ఏపీ సీఎం చంద్రబాబుతో స్నేహం వల్ల తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి.. మన జనాల ఆకాంక్షలకు, ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తున్నారని తెలంగాణవాదులు మండిపడుతున్నారు. పేరుకు కాంగ్రెస్ పాలన అయినా చంద్రబాబు దర్శకత్వమే అంటూ రాజకీయ విశ్లేషకులు కూడా విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో పుష్పగిరి ‘ముసలం’ అనే కవితలో గురువుకు నదుల నీళ్లను ధారపోసి.. హైదరాబాద్ ఇమేజ్ను తరలించి.. రియల్ ఎస్టేట్‌ను బదలాయించి.. తెలంగాణను తాకట్టు పెట్టినవ్ అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. అలాగే అదే కవితలో మరోచోట నాలుగున్నర కోట్ల ప్రజల ఆత్మగౌరవం.. నీ కాంగ్రెస్ పార్టీ జెండా కూలీ కాదు.. ఘడియ ఘడియకు ఢిల్లీ కాళ్లకు గులాంగిరి చేసేందుకు అంటూ ప్రజల ధిక్కార స్వరానికి ప్రతిరూపంగా నిలిచారు. సర్కారు ప్రచారార్భాటాన్ని సైతం పటాపంచలు చేశారు. ‘భ్రమలు’ అనే కవితలో దావోస్ పెట్టుబడుల పైసలన్నీ ఫ్లెక్సీల మీదనే.. ఎంవోయూలన్నీ మెట్రో పిల్లర్ల మీది పోస్టర్లల్లనే.. ప్రవేశపెట్టిన బడ్జెట్ అంతా నెల మాషికాల యాడ్స్‌కే అంటూ ఎండగట్టారు.
తెలంగాణ ప్రజల ధిక్కార స్వరం గురించి కూడా విశ్వనాథుల పుష్పగిరి తన కవితల్లో ప్రస్తావించారు. ‘అర్రాజ్’ అనే కవితలో హెచ్‌సీయూ-అంటే హైదరాబాద్ హార్ట్ కేర్ యూనిట్.. నాలుగొందలు కాకపోతే మొత్తం యూనివర్సిటీనే అమ్ము.. ఆ తర్వాత ఉస్మానియా, కాకతీయ, శాతవాహన ఉన్నకాడికమ్ము!
కానీ.. నీ స్కిల్ యూనివర్సిటీకి రాజీవ్‌గాంధీ పేరు పెట్టు.. రాహుల్‌గాంధీ ఇంకో రెండేళ్లు నీ కుర్చీ ఎక్స్టెన్షన్ చేస్తడు అని చురకలు అంటించారు. ‘రోకుదప్పిన..’ అనే కవితలో లంకె బిందెలు లేవని డప్పుసాటిచ్చి.. అటికెల గట్క పూడ్సుకపోయేటోని కథ అంటూ విమర్శించారు. అలాగే ‘రిక్తహస్తం’ కవితలో చిన్నకారో.. సన్నకారో.. గొంతెండి ఊపిరి కండ్లల్ల కొచ్చినప్పుడు.. రెక్కలు పెడరెక్కలై గూడు చెదిరిన పచ్చులు.. లెక్కలు గట్టుకొని గుక్కెడు పురుగుమందుతో… భూమికి పిడికెడు ఎరువుగా మారుతున్నప్పుడు అని రైతుల ఆవేదనను వ్యక్తంచేశారు. దేవాన దేవుండ్ల మీద నువ్వు పెట్టిన వొట్లన్నీ.. కాన్సిలైన ఓట్లల్ల చేరిపోయినయి అని విమర్శలు గుప్పించారు.
కాంగ్రెస్ పాలనలో తెలంగాణలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై కవి పుష్పగిరి తన ఆవేదనను వ్యక్తంచేస్తూనే, ప్రజల గోస పట్టని పాలకులను తీవ్రస్థాయిలో ఎండగట్టారు. ఇదే క్రమంలో తెలంగాణ నిలిచి గెలుస్తుందని ధీమావ్యక్తంచేశారు. ‘గూట్లె దీపంబెట్టి’ అనే ఓ కవితలో నువ్వు.. వాళ్లు ఏడు లక్షల కోట్లు అప్పు చేసిన్రు అన్నప్పుడు.. మేము ఎగిరెగిరి బట్టలు చింపుకోవాలి.. నువ్వు యాడాదిన్నరల లచ్చన్నర కోట్లు తెస్తే.. అది మాత్రం అభివృద్ధికి రైజింగ్ అనుకోవాలి.. ఫ్లైఓవర్ల మీద పెయింటింగులు చూసి ముర్సిపోవాలి అని ఎద్దేవా చేశారు. అదే కవితలో ఏక్ తేరా ఏక్ మేరా.. దో తేరా దో మేరా అన్నట్టు.. అందరూ నీతిమంతులే.. కుండల కూడెక్కడపోతుందో అర్థం కాదు అంటూ కాంగ్రెస్ పాలక పెద్దల నైజాన్ని ఎండగట్టారు. కాంగ్రెస్ ఏడాది పాలనలో తెలంగాణ దుస్థితిని తల్చుకుని కూడా కవి పుష్పగిరి ఆవేదన వ్యక్తంచేశారు. ‘కొంగలు దొక్కిన పొలం..’ కవితలో దోపిడే పరమావధిగా.. అధికారమే అంతరార్థంగా.. సాగుతున్న రాజకీయ జూదంలో.. కొంగలు దొక్కిన పొలం.. నా తెలంగాణ అంటూ బాధపడ్డారు. అంతేకాకుండా సకల సమస్యలకు పరిష్కారం పోరాటమే అని చాటిచెప్తూ.. తిరగబడటం తెలిసిన నేలకు.. పురిటి నొప్పులు కొత్తవేమీ కాదు.. రామన్నపేటో.. దిలావర్పూరో.. లగచర్లో.. హెచ్సీయూనో.. ఇంకోటో.. ఇంకోటో.. ఊపిరి పోసుకుంటూనే ఉంటాయి అని ఉద్యమమే ఊపిరి అని, పోరాటాలు తప్పవని తేల్చిచెప్పారు. ఇలా ప్రజాగొంతుకగా సాగిన ‘రేవనాలు’ చర్చనీయాంశమయ్యాయి.