KK Mahender Reddy | రాజన్న సిరిసిల్ల, మార్చి 4 (నమస్తే తెలంగాణ): అధికారం రాగానే కాంగ్రెస్ నేతలు రెచ్చిపోతున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాస్తే కేసులు పెడతామంటూ విలేకరులను హెచ్చరిస్తున్నారు. వస్త్ర పరిశ్రమకు ఆర్డర్లు ఇవ్వకపోవడంతో ఓ నేత కార్మికుడు పాపడాలు అమ్ముకుంటున్న దయనీయ ఘటనకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఓ విలేకరికి కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గం ఇన్చార్జి కేకే మహేందర్‌రెడ్డి ఫోన్ చేసి బెదిరించారు.
అంతేకాదు.. నేతన్నలపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. ఇందుకు సంబంధించిన ఇద్దరి మధ్య సంభాషణ సోమవారం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ‘సిరిసిల్ల నేతన్నలు ఎంత మంది పాపడాలు అమ్ముకుంటున్నారు? ఎంత మంది నిరోధ్‌లు అమ్ముతున్నారు? బతుకమ్మ చీరలతో ఆరేండ్ల నుంచి దొబ్బి తిన్నది చాలదా?’ అంటూ దురుసుగా మాట్లడటంపై పద్మశాలి సామాజికవర్గం కేకేపై ఫైర్ అయ్యింది.
కేసీఆర్ ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఫిబ్రవరిలో బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసేది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఆర్డర్ల ఊసెత్తకపోవడంపై నేతన్నల్లో ఆందోళన కనిపిస్తున్నది. రూ.270 కోట్ల బకాయిలు సైతం విడుదల చేయలేదు. ప్రభుత్వం ఇచ్చిన వస్త్ర ఆర్డర్ల కోసం.. అప్పులు తెచ్చి ముడిసరుకులు కొనుక్కొచ్చిన యజమానులంతా దివాలా తీసే పరిస్థితి నెలకొంది. తెచ్చిన అప్పులకు వడ్డీ కట్టలేక సాంచాలను బంద్ పెట్టారు.
సిరిసిల్లలో 30 వేల మరమగ్గాలుంటే అందులో 20 వేల వరకు మూతపడ్డాయి. బకాయిలు చెల్లించి, కొత్త ఆర్డర్లు ఇవ్వాలని గత నెలలో సీఐటీయూ ఆధ్వర్యంలో నేతన్నలు మహాధర్నా చేసి ప్రభుత్వానికి నిరసన తెలిపారు. అయినా.. ప్రభుత్వం నుంచి స్పందన లేదు. పైగా ఆపార్టీ నేతలంతా నేతన్నలపై దురుసుగా మాట్లాడుతూ నోరు పారేసుకోవడంపై పద్మశాలీలంతా డిపడుతున్నారు.
ఆడియో సంభాషణ సాగిందిలా..
విలేకరి: సర్ నమస్కారం. ఎక్కడున్నరు?
కేకే మహేందర్‌రెడ్డి : మేం సిరిస్లిలో ఉన్నం. మేం అమెరికా పోయి రాజకీయం చేత్తమా ఏంది? ఎవరెవరు పాపడాలు అమ్ముతున్నరు? ఎవరెవరు నిరోధ్ ప్యాకెట్లు అమ్ముతున్నారు?
విలేకరి: పద్మశాలీలది. అది వైరల్ అయింది.
కేకే: వాడు మొదటి నుంచీ అమ్ముతడు. అదే బ్యారం చేస్తడు.
విలేకరి : సెల్ఫీ వీడియో పెట్టుకున్నడు. పద్మశాలి జేఏసీ గ్రూపులో వచ్చింది.
కేకే : వాడు ఆసామే గనీ, మొదటి నుంచి పాపడాలు అమ్ముతడు? నీ మీది రిపోర్ట్ చేయించి కేస్ వేయిద్దామనుకున్నా.
విలేకరి : పద్మశాలిలీ జేఏసీ ఫేస్‌బుక్కుల, యూట్యూబ్‌ల పెట్టుకున్నదే కదా?
కేకే : వాళ్లు పెట్టుకుంటే నువ్వెట్ల పెడుతవ్?
విలేకరి : సిరిస్లిల నేత కార్మికుడు కదా? మనం ప్రభుత్వానికి విన్నవించాలి కదా? బతుకమ్మ చీరల ఆర్డర్లు ఏమైనా ఇస్తరా? అంతేన కథ?
కేకే : ఏం ఆర్డర్లు? ఆరేండ్ల నుంచి దొబ్బితిన్నది సరిపోదా?
విలేకరి : గల్ఫ్ నుంచి వాళ్లను పరామర్శిద్దామని నేను పెద్దూరుకు వచ్చిన.
కేకే : మీ సారు ఏం చేసిండయ్య దానికి? పెద్దగా పెడుతున్నవ్
విలేకరి : ఏదైనా.. 35 లక్షలు పెట్టిండు కదా. మీరు ఒకసారి పరామర్శించండి. వాళ్లకు ప్రభుత్వం తరఫున ఏదైనా ఉపాధి చూపండి.
కేకే: నువ్వు కేటీఆర్‌కు చెప్పి ఓ నలభై యాభై ఇప్పియ్యు
విలేకరి : సర్ పైసలు కాదు. ఉపాధి మార్గం చూపియండి.
కేకే : ఏం ఉపాధి చూపుతమయా. కలెక్టరే సరిగ్గా పనిచేస్తలేడు. ఏం చేస్తడు? ఉదయం ఇటు మాట్లాడుతడు. సాయంత్రం అటు మాట్లడుతడు
విలేకరి : ఉంటరా సర్. వచ్చిన తర్వాత ఫోన్ చేస్త. ఇది పార్టీలకు సంబంధం లేదు. మన సిరిసిల్ల వాళ్లను మనం కాపాడుకోవాలె
కేకే : మీ కేటీఆర్‌ను దేవుడని చెప్పిస్తున్నవ్. ఆయన దేవుడైన తర్వాత మేం దయ్యాలమా?
విలేకరి : అలా కాదు సర్. రాజకీయాలు వేరు. హ్యూమన్ బీయింగ్ వేరు
కేకే : అట్లెటుంటది? అడ్డంగ నరుక్కుంట పోవాలె.
కేకే క్షమాపణ చెప్పాలి..
నేతన్నలపై దురుసుగా మాట్లాడిన కేకే మహేందర్‌రెడ్డి వెంటనే నేతన్నలకు క్షమాపణ చెప్పాలని పద్మశాలి సామాజికవర్గం డిమాండ్ చేసింది. ఈ మేరకు సిరిసిల్ల పద్మశాలి సంఘ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సంఘం జిల్లా అధ్యక్షుడు గాజుల బాలయ్య, పట్టణ ఉపాధ్యాక్షుడు డాక్టర్ గాజుల బాలయ్య, పట్టణ యువజన విభాగం అధ్యక్షుడు గుండ్లపల్లి పూర్ణచందర్, మున్సిపల్ మాజీ చైర్మన్ ఆడెపు రవీందర్, బొల్లి రాంమోహన్, కౌన్సిలర్లు గెంట్యాల శ్రీనివాస్, దార్ల సందీప్‌లు కేకే వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.
పద్మశాలీలను అవమానపరిచిన కేకే మహేందర్‌రెడ్డి సిరిసిల్ల నేతన్న విగ్రహం వద్దకు వచ్చి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపట్టి ఈ నెల 7న సిరిసిల్ల సీఎం రేవంత్‌రెడ్డి పర్యటనను అడ్డుకుంటామని హెచ్చరించారు. తెలంగాణ ఉద్యమంలో సిరిసిల్లకు వచ్చిన ఉద్యమ నేత కేసీఆర్ ఇక్కడి నేతన్నల దయనీయ పరిస్థితికి చలించి పార్టీ ఫండ్‌గా రూ.50 లక్షలు అందజేసిన విషయాన్ని గుర్తుచేశారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఏర్పడ్డ టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యే కేటీఆర్ సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి వస్త్ర పరిశ్రమకు జీవం పోశారని వివరించారు.