Revanth Reddy | కాజీపేట, అక్టోబర్ 28: స్వలాభం కోసం రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీని నాశనం చేస్తున్నారని వరంగల్ డీసీసీబీ మాజీ చైర్మన్, కాంగ్రెస్ సీనియర్ నేత జంగా రాఘవరెడ్డి ఆరోపించారు. అధిష్ఠానం తనకు వరంగల్ పశ్చిమ టికెట్ కేటాయించని పక్షంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఆరు నియోజకవర్గాల్లో పార్టీ దెబ్బతింటుందని హెచ్చరించారు.
వరంగల్ పశ్చిమ కాంగ్రెస్ టికెట్ ఆశించి, బంగపడిన ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల బరిలో ఉండటానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్‌లోకి కొత్తగా వచ్చిన రేవూరి ప్రకాశ్‌రెడ్డి, కేఆర్ నాగరాజు, యశశ్వినిరెడ్డికి టికెట్లు ఇచ్చి, పార్టీకి అన్ని విధాలా అండగా ఉన్న తనను విస్మరించడం ఏమిటని ప్రశ్నించారు. ఉమ్మడి వరంగల్‌లో పార్టీ బలోపేతానికి, పార్టీ సమావేశాలకు కోట్లాది రూపాయలను ఖర్చు చేశానని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌లో కొంతమంది పెద్దలు కావాలనే కుట్రలు చేసి అన్ని అర్హతలున్న తనకు వరంగల్ పశ్చిమ టికెట్ ఇవ్వకుండా చేశారని మండిపడ్డారు. రెండు రోజుల్లో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని స్పష్టంచేశారు.