హైదరాబాద్, డిసెంబర్14 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ను వీడడానికి హరీశ్‌రావు (Harish Rao) కారణంకాదని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి (Jagga Reddy) కుండబద్దలుకొట్టారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆహ్వానం మేరకే కాంగ్రెస్‌లో చేరానని స్పష్టంచేశారు. హరీశ్‌రావుపై కోపంతోనే తాను కాంగ్రెస్‌లో చేరానని ఎమ్మెల్సీ కవిత (Kavitha) చేసిన వ్యాఖ్యలు సత్యదూరమని కొట్టిపారేశారు. ఇందులో ఏమాత్రం వాస్తవంలేదని ప్రకటించారు.
ఆదివారం జగ్గారెడ్డి గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ ఉమ్మడి మెదక్ జిల్లాలో తనకు హరీశ్‌రావుతో రాజకీయ శతృత్వం ఎప్పటికీ ఉంటుందని తేల్చిచెప్పారు. కానీ ఆయనతో పడకనే బీఆర్ఎస్ను వీడానని కవిత చెప్పడం హాస్యాస్పదమని తేల్చిచెప్పారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడూ బీఆర్ఎస్ సిద్దిపేట, సంగారెడ్డిలోనే గెలిచిందన్నారు. అందుకే జగ్గారెడ్డి రాజకీయంగా తనకు నచ్చాడని రాజశేఖర్‌రెడ్డి ఒక మనిషితో చెప్పి పంపించారని చెప్పుకొచ్చారు. నియోజకవర్గ అభివృద్ధి, ఐఐటీ ఇస్తామని చెప్పగా పార్టీ మారానని పునరుద్ఘాటించారు. కవిత కనీస అవగాహన, ఆలోచన లేకుండా మాట్లాడడం ఆక్షేపణీయమని స్పష్టంచేశారు.