హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 1 (నమస్తే తెలంగాణ): సీఎం రేవంత్‌రెడ్డి కలల ప్రాజెక్టుగా చెప్పుకునే కేబీఆర్ పార్క్ విస్తరణను వ్యతిరేకిస్తూ సొంత పార్టీకి చెందిన నేత కోర్టును ఆశ్రయించారు. తన ఇంటిని కూల్చొద్దని, పర్యావరణపరంగా అత్యంత సున్నితమైన కేబీఆర్ పార్క్ చుట్టూ నిర్మాణ కార్యకలాపాలను నిలువరించాలని కోరుతూ కాంగ్రెస్ నేత, సినీ నటుడు అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్‌రెడ్డి హైకోర్టులో వ్యక్తిగత పిటిషన్ దాఖలు చేశారు. ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ ఇప్పటికే నాలుగు పిటిషన్లు కోర్టులో పెండింగ్‌లో ఉన్నాయి. కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి, సినీ నటుడు, ఏపీ ఎమ్మెల్యే బాలకృష్ణతోపాటు పలువురు సినీ ప్రముఖుల ఇండ్లు కూడా కేబీఆర్ పార్క్ ప్రాజెక్టు పరిధిలో ఉన్నాయి. కాగా హైడ్రా పేరుతో పేదల ఇండ్లపైకి బుల్డోజర్లను నడిపించిన సీఎం రేవంత్‌రెడ్డి ఈ ప్రాజెక్టు భూసేకరణకు అడ్డుపడుతున్న సొంత పార్టీ నేతలు, ప్రముఖుల ఇండ్ల విషయంలో ఎలా స్పందిస్తారన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది.
ప్రభుత్వ నిర్ణయంపై పర్యావరణవేత్తల ధ్వజం
పర్యావరణ పరంగా అత్యంత సున్నితమైన కేబీఆర్ పార్క్ చుట్టూరా ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లను నిర్మించాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఈ విస్తరణ ప్రాజెక్టులో తన ఇంటిని సంరక్షించాలని కోరుతూ కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి ఇంతకుముందు ప్రజావాణిలో దరఖాస్తు చేశారు. ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో తాజాగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ ఇప్పటికే జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ)లో కూడా ఓ కేసు పెండింగ్‌లో ఉంది. సీఎం రేవంత్‌రెడ్డి తన సొంత నిర్ణయాలతో పర్యావరణపరంగా ఎంతో సున్నితమైన కేబీఆర్ పార్క్‌ను ధ్వంసం చేస్తారా అంటూ ఇప్పటికే పర్యావరణ, సామాజికవేత్తలు ప్రశ్నిస్తున్నారు.
నిబంధనలు బుట్టదాఖలు
ఏ ప్రాజెక్టు మొదలుపెట్టాలన్నా ముందు భూసేకరణ పూర్తి చేసి ఆ తర్వాతనే పనులు చేపడతారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం అవేవీ పట్టించుకోకుండానే దూకుడుగా ముందుకుసాగడంతో కేబీఆర్ పార్క్ ప్రాజెక్టు చుట్టూ వివాదాలు ముసురుకుంటున్నాయి. తొలుత హడావుడిగా టెండర్లను పిలిచి ప్రభుత్వం, జీహెచ్ఎంసీ అభాసుపాలు కాగా, తాజాగా కోర్టు కేసులు నమోదవుతున్నాయి. పాత రోడ్ డెవలప్మెంట్ ప్లాన్(ఆర్డీపీ)ని పరిగణనలోకి తీసుకుని కొత్త ఆర్డీపీ ప్లాన్ సిద్ధం చేశారు. గత ఆర్డీపీలో దాదాపుగా 109 నివాసాల నుంచి భూముల సేకరించాలని స్టాండింగ్ కమిటీలో జీహెచ్ఎంసీ నిర్ణయం తీసుకుంది. కానీ క్షేత్రస్థాయిలో 129కి పైగా ఆస్తులు ఉన్నాయని తెలిసింది. బంజారాహిల్స్ రోడ్ నం 12 నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వరకు భూసేకరణలో భాగంగా గతంలోనే పలు భవనాలను మార్కింగ్ వేశారు. ఈ నివాసాల నుంచి ఆస్తుల స్వాధీనం అధికారులకు తలనొప్పిగా మారుతుండగా.. వరుస కోర్టు వివాదాలతో భూసేకరణ ప్రక్రియ సమస్యగా మారుతున్నది.
అడ్డదిడ్డంగా ప్రణాళిక
ప్రాజెక్టు మొత్తం ఏకరీతిలో భూసేకరణ జరిపే ప్రణాళికలు లేకపోవడం కూడా వ్యతిరేకతకు కారణమైంది. కొన్ని ప్రాంతాల్లో 100 ఫీట్లు, మరికొన్ని ప్రాంతాల్లో 150 ఫీట్ల మేర వెడల్పు చేసేలా అడ్డదిడ్డంగా రోడ్డు విస్తరణ ప్రణాళికలు ఉన్నాయనే ఆరోపణలు ఉన్నాయి. కేబీఆర్ పార్క్ చుట్టూ ఉన్న కొందరు సంపన్నులు, రాజకీయ నేతలు, సెలబ్రిటీలు లక్ష్యంగానే సీఎం రేవంత్‌రెడ్డి ఈప్రాజెక్టును తెరమీదకు తీసుకువచ్చారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భూసేకరణ విషయంలో ప్రభుత్వం ముందుకు సాగుతుందా లేక సొంత పార్టీ నేతల ఒత్తిడికి తలొగ్గి ప్రాజెక్టు విషయంలో వెనుకడుగు వేస్తుందా అన్నది వేచి చూడాలి.