జనగామ : గతంలో కరెంటు కష్టాలకు కారణమే కాంగ్రెస్.. వారి అసమర్థ, దుష్ట, దుర్మార్గ పాలన వల్లే రైతులు తీవ్ర ఇబ్బందులకు గురి అయ్యారు. వ్యవసాయాన్ని దండుగ చేసిన పాపం ఆ పార్టీదే. ఉచిత విద్యుత్ పై రేవంత్ వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయి. కాకపోతే, కాంగ్రెస్ వస్తే మాత్రం మళ్లీ కష్టకాలం రాక తప్పదని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు రైతులను హెచ్చరించారు.
సీఎం కేసీఆర్ రైతును రాజును చేస్తే కాంగ్రెస్ మాత్రం వారిని కష్టాల్లోకి నెడుతుందన్నారు. రైతులకు ఉచిత కరెంట్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ వైఖరి ని నిరసిస్తూ, జనగామ జిల్లా కొడకండ్ల లో రైతులతో కలిసి నిర్వహించిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఆ అనుభవాలను భరించలేక, ఆ పార్టీకి ప్రజలు చరమగీతం పాడారు.
అయినా బుద్ధి రాలేదు. రేవంత్ రెడ్డి సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. వ్యవసాయానికి కేవలం 3 గంటల కరెంటు చాలట. ఒక గంట కరెంటుతో ఒక ఎకరం పారించవచ్చట. వ్యవసాయం గురించి తెలిసినోడు మాట్లాడే మాటలేనా? కాంగ్రెస్ నాయకుల వ్యాఖ్యలతో రైతులు నవ్వుకుంటున్నారు. నవ్వులపాలైన ఆ పార్టీని పాతాళంలో పాతి పెట్టాలని మంత్రి పిలుపునిచ్చారు.