హైదరాబాద్, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ) : గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ప్రక్రియ ప్రహసనంలా మారిందని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌కుమార్ ఎద్దేవా చేశారు. ఓటర్ల జాబితాను ప్రక్షాళన చేస్తారని బీఆర్ఎస్ ఆశించిందని, కానీ ఈసీ, అధికారుల బాధ్యతారాహిత్యంతో నకిలీ ఓట్లను సృష్టించడం దుర్మార్గమని మండిపడ్డారు. బుధవారం తెలంగాణ భవన్లో విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. ‘సర్’లో లోపాలు, అక్రమాలపై బీఆర్ఎస్ పదే పదే ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపించారు. ఖైరతాబాద్ నియోజకవర్గం(ఏసీ నం-60) పోలింగ్ బూత్ నంబర్-237 పరిధిలోని బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని డోర్ నంబర్ 8-2-684/250 అనే ప్రైవేట్ కమర్షియల్ భవనంలో 19 అనుమానాస్పద ఓట్లను గుర్తించి ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. ఎన్నికల సంఘం ఆ ఓట్లను తొలగించకపోగా మరో 25 ఓట్లను చేర్చిందని ఆరోపించారు. 44 నకిలీ ఓట్లు ఉన్నాయని స్పష్టంచేశారు.
‘సర్’లో అక్రమాలను ప్రశ్నించిన బీఆర్ఎస్ బీఎల్ఏలపై తప్పుడు కేసులు బనాయించారని విమర్శించారు. ‘ఒక చిన్న ప్రైవేట్ కాల్ సెంటర్ ఆఫీసులో 44 మంది ఓటర్లు ఎలా నివసిస్తారు? అని ప్రశ్నించారు. బంజారాహిల్స్‌లోనే పరిస్థితి ఇలా ఉంటే, ఇక గ్రేటర్ హైదరాబాద్, తెలంగాణ వ్యాప్తంగా ఇంకెన్ని నకిలీ ఓట్లు సృష్టించి ఉంటారో ఊహించుకోవచ్చని అన్నారు. ఇప్పటికైనా ఎన్నికల అధికారులు కండ్లు తెరిచి తప్పులు చేసిన అధికారులు, బూత్‌స్థాయి సిబ్బందిపై చర్యలకు ఉపక్రమించాలని డిమాండ్ చేశారు. ఓటర్ల జాబితాను ఖరారు చేసే ముందు గ్రేటర్ హైదరాబాద్‌తోపాటు రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో వాణిజ్య భవనాలు, ఓకే డోర్ నంబర్‌పై అధిక సంఖ్యలో నమోదైన ఓట్లపై క్షేత్రస్థాయి పరిశీలన చేయాలని, బీఆర్ఎస్ బీఎల్ఏలపై పెట్టిన తప్పుడు కేసులను భేషరతుగా ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. పౌరసమాజం, మేధావులు, అన్ని పార్టీల ప్రతినిధులు అప్రమత్తంగా ఉండి బూత్‌స్థాయిలో ఓటర్ల జాబితాలను క్షుణ్ణంగా పరిశీలించాలని విజ్ఞప్తిచేశారు.