తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు, బహుజన ఆత్మ గౌరవ ప్రతీక, మనం చాకలి ఐలమ్మగా పిలుచుకునే చిట్యాల ఐలమ్మ జయంతి సందర్భంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. వారి త్యాగాలను స్మరించుకుంటూ, ఘన నివాళులు అర్పించారు.
నాటి రాచరిక పాలనలో, తెలంగాణ రైతాంగ న్యాయమైన హక్కులకోసం, ధిక్కార స్వరం వినిపించిన ధీర వనిత, అణచివేతకు గురవుతున్న సబ్బండ కులాల ఆత్మగౌరవ ప్రతీక, ఐలమ్మ అని కేసీఆర్ కొనియాడారు. నాటి భూస్వాములను ఎదురించి ధిక్కార స్పూర్తినీ,. నాటి చట్టాల పరిధిలో న్యాయస్థానంలోనూ పోరాడి గెలిచి ప్రజాస్వామిక స్పూర్తినీ., ప్రదర్శించిన ఐలమ్మ పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శనీయమన్నారు.
ప్రజా ఆకాంక్షలకు వ్యతిరేకంగా సాగుతున్న, అస్తవ్యస్త పాలనా రాజకీయ పరిస్థితుల్లో చాకలి ఐలమ్మ ప్రజాస్వామిక పోరాట స్పూర్తి, ప్రదర్శించిన తెలంగాణ సోయి నేటి యువతకు అనుసరణీయమని కేసీఆర్ స్పష్టం చేశారు. శాంతియుత పంథాలో తాను ప్రారంభించిన మలిదశ తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో, ఐలమ్మ అందించిన స్పూర్తి ఇమిడి వున్నదని కేసీఆర్ పేర్కొన్నారు. చాకలి ఐలమ్మ గొప్పతనాన్ని భవిష్యత్తు తరాలకు చాటేందుకు నాటి బిఆర్ఎస్ ప్రభుత్వం, వారి జయంతిని అధికారింకగా నిర్వహించే సాంప్రదాయాన్ని నెలకొల్పిందని అన్నారు.
ఐలమ్మ ఆశయాలకు అనుగుణంగా,నాటి పదేండ్ల ప్రగతి ప్రస్థానంలో, మహిళలు శిశు సంక్షేమం, రైతాంగం సబ్బండ కులాల అభ్యున్నతి కోసం అనేక వినూత్నపథకాలను అమలు చేశామన్నారు. తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేస్తూ, కుల వృత్తులను పునరుజ్జీవింప చేసి, సబ్బండ కులాల ఆర్థిక, సామాజిక ఆత్మగౌరవాన్ని మహోన్నతంగా నిలబెట్టినామని కేసీఆర్ గుర్తు చేశారు. అవి సాధించిన ఫలితాలు నేడు దేశానికే ఆదర్శంగా నిలిచాయని వివరించారు. అదే దిశగా, నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం అమలుచేసిన పాలనా పద్ధతులను మొదటి పాలనా ప్రాధాన్యతలుగా, చిత్త శుద్ధితో అమలు చేయడం ద్వారా మాత్రమే, చాకలి ఐలమ్మ గారికి మనం నిజమైన నివాళులు అర్పించిన వారమవుతామని కేసీఆర్ స్పష్టం చేశారు.