హైదరాబాద్, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ ప్రభుత్వంలో రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీస్తున్నదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఆరోపించారు. ఆ పార్టీ వ్యవహారం ‘ప్రచారం ఫుల్.. పనులు నిల్’ అన్న చందంగా తయారైందని విమర్శించారు. సోమవారం ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. మహిళలకు ఉచిత బస్సు హామీని కూడా సరిగా అమలుచేయలేదని పేర్కొన్నారు. జెన్కో, ట్రాన్స్‌కోలకు బకాయిలు చెల్లించకపోవడంతో విద్యుత్తు ఉత్పత్తి ఇబ్బందికరంగా మారిందని, యువతకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాల పేరుతో అనేక హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చాక వారిపై లాఠీలతో దాడి చేయిస్తున్నారని మండిపడ్డారు. 17 పంటలకు మద్దతు ధరతోపాటు బోనస్ ఇస్తామని చెప్పి కేవలం సన్న వడ్లకు మాత్రమే అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నదని విమర్శించారు. 38.63 లక్షల మందికి రుణమాఫీ చేయాల్సి ఉండగా, 22 లక్షల మందికే చేశారని, అయినా రాహుల్‌గాంధీ మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో అబద్ధాలు చెప్తున్నారని ఆరోపించారు. రేవంత్‌కు దమ్ముంటే రుణమాఫీపై హైకోర్టు సిట్టింగ్ జడ్జికి నివేదిక సమర్పించాలని డిమాండ్ చేశారు. రైతులకు రూ.15 వేలు, రైతు కూలీలకు రూ.12 వేలతో రైతు భరోసా కల్పిస్తామని చెప్పి అమలుచేయలేదని మండిపడ్డారు.
హైదరాబాద్, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ): సంచలనం సృష్టించిన ‘ఓటుకు నోటు’ కేసులో కీలక పరిణామం చోటుచేసుకున్నది. ప్రస్తుతం ఈ కేసును విచారిస్తున్న సుప్రీంకోర్టు ధర్మాసనం నుంచి వైదొలుగుతున్నట్టు జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ సోమవారం వెల్లడించారు. గతంలో ఆయన తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసినందున విచారణ నుంచి వైదొలుగుతున్నట్టు తెలిపారు. దీంతో ఈ కేసును మరో ధర్మాసనానికి బదిలీ చేస్తున్నట్టు సుప్రీంకోర్టు ప్రకటించింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న జెరూసలేం మత్తయ్య.. అమికస్ క్యూరీ స్థానంలో మరో న్యాయవాదిని నియమించుకున్నారు. ఆ విషయాన్ని సోమవారం మత్తయ్య తరఫు న్యాయవాది సుప్రీంకోర్టు ధర్మాసనానికి నివేదించారు.