Harish Rao | అన్నం పెట్టే రైతులను కాంగ్రెస్ అవమానిస్తోందని మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. సంగారెడ్డిలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాగునీరు సౌకర్యం లేని రైతులే పత్తి సాగు చేస్తారన్నారు. 50 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేస్తున్న దళిత గిరిజన బీసీ రైతుల నోట్లో మట్టి కొట్టడమేనన్నారు. చెరుకు పసుపు పండ్లతోటకు పెట్టుబడి ఎక్కువని.. అలాంటప్పుడు ఆ రైతులకు ఒకటేసారి రైతు భరోసా ఇస్తానంటే ఎట్లా? అంటూ ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో లక్ష ఎకరాల్లో చెరుకు పంట పండుతుందని.. లక్ష ఎకరాల్లో పసుపు పంట పండుతుందని తెలిపారు. 10 లక్షల ఎకరాల్లో మామిడి తోటలు, ఆయిల్ పామ్ తోటలు, ఇతర పండ్ల తోటలు ఉన్నాయని.. 10లక్షలు ఎకరాల్లో దాదాపు కంది సాగు జరుగుతుందన్నారు. ఇలాంటి రైతులకు ఒకటేసారి రైతు భరోసా ఇస్తానంటే ఎలా? అంటూ నిలదీశారు.
రాళ్లు రప్పలకు రైతు భరోసా ఇవ్వమంటున్నారని.. కొండల్లో, గుట్టల్లో ఉండేది గిరిజన రైతులు మాత్రమేనన్నారు. అంటే గిరిజన రైతులకు రైతు భరోసా ఎగ్గొట్టాలని ప్రభుత్వం చూస్తున్నదా? అని నిలదీశారు. అన్ని ఆలోచించిన కేసీఆర్ రైతుల ఆత్మగౌరవం కాపాడాలని ఉద్దేశంతో అందరికీ రైతుబంధు ఇచ్చి గౌరవించారన్నారు. అందరికీ అన్నం పెట్టే రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం అవమానిస్తుందన్నారు. రైతు గౌరవాన్ని కేసీఆర్ పెంచితే.. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను అడుక్కునేలా చేస్తుందన్నారు. దరఖాస్తులు పెట్టి పైరవీకారుల చుట్టూ తిరిగేలా చేస్తుందన్నారు. అందరికీ అన్నం పెట్టే రైతులు అడుక్కునే వారిలా మార్చకండి అంటూ హితవు పలికారు. అందరు రైతులకు రైతు భరోసా ఇవ్వాలని సూచించారు. అకాల వర్షాల వల్ల పత్తి రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని.. పత్తి దిగుబడి తగ్గిందన్నారు. వర్షం ఆధారంగా పత్తిని సాగు చేస్తారని.. ఎక్కువ మంది దళిత గిరిజన బీసీ రైతులే ఉంటారన్నారు. వాళ్ల కడుపు కొట్టకండని.. సంవత్సరానికి ఒకేసారి పండిన పంటైనా సరే దానికి పెట్టుబడి ఎక్కువ ఉంటుందన్నారు.
చెరుకు, పత్తి, పసుపు, ఇతర హార్టికల్చర్ పంటలు సంవత్సరానికి ఒకసారి పండినా వాటిక అయ్యే ఖర్చు ఎక్కువగానే ఉంటుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కోతలు.. తప్ప రైతులకు ఇచ్చిందేమీ లేదన్నారు. రుణమాఫీ సగం మందికే అయ్యిందని.. అన్ని పంటలకు బోనస్ అని చెప్పి.. కేవలం సన్నాలకు మాత్రమే బోనస్ ఇస్తామంటున్నారన్నారు. పంటల బోనస్ విషయంలో పది పంటలకు బోనస్ ఇస్తామని ఒక్క పంటకే బోనస్ అని అందులో సన్న రకాలకే బోనస్ ఇస్తామంటున్నారన్నారు. రైతుబంధు వానకాలం ఎగొట్టారని.. యాసంగి ఎగ్గొట్టే కుట్ర చేస్తున్నారన్నారు. పంటలకు బీమా అసెంబ్లీ స్పీచ్‌లో చెప్పారని.. వానాకాలంలో అడుగుతే ఏసంగిలో ఇస్తామన్నారన్నారు. యాసంగిలో అడుగుతే మల్ల వచ్చే సంవత్సరం చూస్తామని అంటున్నారన్నారు. రైతులకు వ్యవసాయ పనిముట్లు ఇస్తామని ఇవ్వలేదని.. పాడి రైతులకు ప్రోత్సాహమని చెప్పి.. అదీ ఇవ్వలేదన్నారు. 24 గంటల కరెంటు అన్నారని.. 16 గంటలకు నుంచి కరెంటు ఇవ్వడం లేదన్నారు.
కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చిన ఒక్క హామీ అయినా నిలబెట్టుకున్నారా? అంటూ ప్రశ్నించారు. 2 లక్షల పైనున్న రుణాన్ని అప్పులు తెచ్చి మరి కడితే ఇప్పటి వరకు రుణమాఫీ కాలేదని తెలిపారు. సీఎం మాట నమ్మి 2 లక్షల పైనున్న రుణాలను అప్పు తెచ్చి కట్టిన రైతులకు ఇంకా రుణమాఫీ కాలేదన్నారు. ఆ రైతుల పైన మిత్తి భారం పడుతుందని.. వారికి ఏం సమాధానం చెబుతారన్నారు. వ్యవసాయ కూలీలకు 28వ తారీఖు నాడే రూ.12వేలు ఇస్తామని చెప్పి మాట తప్పారన్నారు. వ్యవసాయ కూలీలకు కోత పెట్టేందుకు వారి సంఖ్యను తగ్గించేందుకు కుట్ర జరుగుతున్నదన్నారు. రాష్ట్రం లో 54 లక్షల ఉపాధి హామీ కార్డులు ఉన్నాయని.. ఒక కోటి నాలుగు లక్షల మంది కూలీలు ఉన్నారన్నారు. ఉపాధి హామీలో పనికి వెళ్లే వారందరూ బతుకుతెరువు కోసం వెళ్లే వారేనని.. అందులో ఏరివేత ఎందుకు? అంటూ ప్రశ్నించారు. ఉపాధి హామీ పనికి వెళ్లే వారికి భూమి ఎంత ఉందో చూసి కొలిచి, వారికి ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. పొద్దున 6 గంటలకు లేచి మట్టి పనికి వెళ్లే కూలీలకు పరీక్షలా?
అంటూ ప్రశ్నించారు.
ఎలాంటి షరతులు లేకుండా ఉపాధి హామీ కార్డు ద్వారా పనిలోకి పోతున్న కోటి నాలుగు లక్షల మందికి సంవత్సరానికి రూ.12వేలు ఇవ్వాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుందన్నారు. ఎకరంలోపు ఉన్న వారందరినీ వ్యవసాయ కూలీలుగా పరిగణించాలన్నారు. ఉపాధి హామీ కోసం మే నెలలో రూ.857 కోట్ల కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి వస్తే ఇప్పటివరకు రాష్ట్రంలో పనిచేసిన కూలీలకు అందించలేదన్నారు. ఆ డబ్బులను బడా కాంట్రాక్టర్లకు పర్సంటేజ్ తీసుకొని బిల్లులు చెల్లిస్తున్నారన్నారని.. ఉపాధి హామీ కూలీలకు మాత్రం డబ్బులు ఇవ్వడం లేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇచ్చిన మూడు నెలల్లో ఉపాధి హామీ కూలీలకు చెల్లించకపోతే మూడు నెలల తరువాత వడ్డీతో సహా చెల్లించాలని చట్టాలు చెబుతున్నాయన్నారు. ఏడు నెలలు గడిచినా.. ఇంకా ఉపాధి హామీ కూలీలకు డబ్బులు ఇవ్వలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఖాతాలో డబ్బులు వేస్తే మళ్లిస్తున్నారన్నారు. ఇప్పటి నుంచి రైతులకే నేరుగా ఉపాధి హామీ డబ్బులు వేయాలని కేంద్రం నిర్ణయించిందని వివరించారు.