వంచన.. దగా..
మోసం.. ద్రోహం..
నమ్మించి గొంతుకోయడం.. నిలువునా ముంచేయడం..
అడ్డంగా వెన్నుపోటు పొడవడం.. ఇలా తెలుగు భాషలోని ఎన్ని పదాలతో చెప్పినా ఈ నయవంచనను వివరించలేం. మోచేతికి బెల్లం పెట్టి నాకమన్నట్టు, అరచేతిలో స్వర్గాన్ని ఆశజూపించినట్టు బీసీలను భ్రమల్లో ముంచిన కాంగ్రెస్.. చివరికి మొండిచెయ్యి ఇచ్చింది. తొండిచెయ్యి చూపింది. కోటాకు చట్టబద్ధత కల్పించకుండా చట్టుబండలు చేసేందుకు సిద్ధమైంది. బీసీ డిక్లరేషన్‌కు పూటకోసారి తూట్లు పొడుస్తూ వచ్చిన కాంగ్రెస్.. ఆఖరి డ్రామాగా ఆర్డినెన్స్‌ను తెరపైకి తెచ్చింది.
బీసీలకు 42శాతం కోటా అమలు చేయడానికి రాజకీయ చిత్తశుద్ధి అవసరం. రిజర్వేషన్ల మొత్తం 50శాతం మించకుండా సుప్రీంకోర్టు విధించిన పరిమితి ఉన్నది. దాన్ని దాటితే తమిళనాడు తరహాలో 9వ షెడ్యూల్లో చేర్చి, రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది. కానీ ఇవేవీ చేయకుండా అసెంబ్లీ తీర్మానంతో కాంగ్రెస్ సర్కార్ చేతులు దులుపుకొన్నది. కేంద్రంపై ఒత్తిడి తేకుండా, ఆర్డినెన్స్ ఆటకు సిద్ధమైంది. ఆర్డినెన్సే పరిష్కారమని భావించినప్పుడు.. అసెంబ్లీ తీర్మానం ఎందుకు చేసినట్టు? రాష్ట్రపతికి ఎందుకు పంపినట్టు?
ఇది కాదా కోటాకు వెన్నుపోటు! ఇది కాదా బీసీలకు ఘరానా మోసం!!
హైదరాబాద్, జూలై 10 ( నమస్తే తెలంగాణ): స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు పంచాయతీరాజ్ చట్టం-2018కి సవరణ చేస్తూ ఆర్డినెన్స్ తీసుకురావాలని క్యాబినెట్ తీసుకున్న నిర్ణయం అందరినీ ఆశ్చర్యపరుస్తున్నది. నిజానికి సొంతంగా ఆర్డినెన్స్ ఇచ్చిన ఒక్క రాష్ట్రంలో కూడా రిజర్వేషన్లు అమలు కాలేదు. చట్టబద్ధత లేని ఆర్డినెన్స్‌లు కోర్టుల్లో నిలబడవని తెలిసినా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం మొం డిగా ముందుకు వెళ్తుండటంపై విమర్శలు వినిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఈ నిర్ణయం బీసీ నేతలను ఆందోళనకు గురిచేస్తున్నది. రిజర్వేషన్లపై తీవ్రస్థాయిలో ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల నుంచి తప్పించుకునేందుకే ఈ కొత్త నాటకానికి తెరలేపిందని బీసీ సంఘాల నేతలు భగ్గుమంటున్నారు.
చంద్రబాబు తరహా ఎత్తులతో బీసీలను మభ్యపెట్టేందుకు రేవంత్‌రెడ్డి కుట్రలు చేస్తున్నారని బీసీ నేత లు మండిపడుతున్నారు. బీసీ రిజర్వేషన్లపై ఎవరైనా కోర్టుకు వెళ్లి రిజర్వేషన్లు ఆపితే, అప్పుడు బీఆర్ఎస్ను బద్నాం చేయాలనే దురుద్దేశంతోనే రేవంత్ ఈ ఆర్డినెన్స్ నిర్ణయం తీసుకున్నారని చెప్తున్నారు. సెప్టెంబర్ 30లోపు స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తిచేయాలని గత నెల 25న రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. రిజర్వేషన్ల గడువు కోసం ప్రభుత్వానికి 30 రోజుల గడువు ఇచ్చింది. ఇందులో ఇప్పటికే 15 రోజులు గడిచిపోయాయి.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలు కోసం 2018 పంచాయతీ రాజ్ చట్ట సవరణకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. 2018 చట్టంలోని 23 శాతం రిజర్వేషన్ల స్థానంలో 42 శాతంగా ర్యాటిఫై చేస్తూ ఆర్డినెన్స్ ఇచ్చేందుకు క్యాబినెట్ ఆమోదించింది. సచివాలయంలో రేవంత్‌రెడ్డి అధ్యక్షతన గురువారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వే ఫలితాలు, డెడికేషన్ కమిషన్ సూచనలకు అనుగుణంగా బీసీ రిజర్వేషన్లు అమలు చేయడానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ ఇప్పటికే 42 శాతం బీసీ రిజర్వేషన్ల అమలుపై అసెంబ్లీ తీర్మానించి, గవర్నర్ ఆమోదం కోసం బిల్లు పంపింది.
గవర్నర్ కూడా ఆమోదించి, రాష్ట్రపతికి పంపి నేటికి సరిగ్గా మూడు నెలలు అవుతుంది. ఇప్పుడు ప్రభుత్వం అదే బిల్లు మీద అర్డినెన్స్ తీసుకు వస్తామని చెప్తున్నది. ఒకసారి అసెంబ్లీ పాస్ చేసిన బిల్లుకే తిరిగి అర్డినెన్స్ జారీ చేయడం రాజ్యాంగ విరుద్ధమని న్యాయ నిపుణులు చెస్తున్నారు. తనే బిల్లు పాస్ చేసి రాష్ట్రపతికి పంపిన నేపథ్యంలో ప్రభుత్వం చేసిన అర్డినెన్స్ను అనివార్యంగా గవర్నర్ తిరస్కరించడం మినహా మరో మార్గం లేదంటున్నారు.
ఈ ఏడాది ఫిబ్రవరి 27న డెడికేటెడ్ కమిషన్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో ఎంఎస్ నంబర్-1 ఉత్తర్వులు జారీచేసింది. మార్చి 6న రాష్ట్ర క్యాబినెట్ భేటీ అయింది. ఈ భేటీలోనే డెడికేటెడ్ కమిషన్ సమర్పించిన రిపోర్టును ఆమోదించినట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఫిబ్రవరి 27 నుంచి మార్చి 6 వరకు కేవలం వారం రోజులు మాత్రమే. కమిషన్ కేవలం వారం రోజుల్లో రిపోర్టు ఇవ్వడం సాధ్యమవుతుందా? కేవలం 7 రోజుల్లో కమిటీ ఏమి అధ్యయనం చేసింది? అధ్యయనానికి ప్రమాణాలు ఏమిటి? ఎక్కడి నుంచి సమాచారం తీసుకున్నారు? అనే అంశాలకు క్యాబినెట్ వద్ద సమాచారమే లేదు.
రాజ్యాంగబద్ధ ప్రామాణికత లేకుండా క్యాబినెట్ ఆమోదిస్తే న్యాయస్థానాలు ఊరుకుంటాయా? రాజ్యాంగ నిబంధనల ప్రకారం డెడికేటెడ్ కమిషన్ రిపోర్టును ముందుగా పబ్లిక్ డొమైన్లో పెట్టాలి. అనంతరం అది మంత్రివర్గ టెబుల్ మీదకు రావాలి. దీనిపై చర్చ జరిగిన అనంతరం ఆమోదించాలి. కానీ ఇప్పటి వరకు డెడికేటెడ్ కమిషన్ రిపోర్టు ప్రజల ముందు పెట్టనేలేదు. పైగా బీసీ కమిషన్‌కు, డెడికేటెడ్ కమిషన్‌కు ఒక్కరినే చైర్మన్ నియమించడం రాజ్యాంగ విరుద్ధం అని నిపుణులు చెప్తున్నారు.
బీసీలకు రిజర్వేషన్లు 34 శాతం పెంచుతూ కేసీఆర్ ప్రభుత్వం 2018లోనే నిర్ణయం తీసుకున్నది. 2018లో నూతన పంచాయతీరాజ్ చట్టాన్ని తీసుకువచ్చిన ప్రభుత్వం, బీసీలకు 34 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ జీవో నం.396తో ఉత్తర్వులు జారీచేసింది. స్థానిక సంస్థలన్నింటిలోనూ బీసీలకు 34 శాతం రిజర్వేషన్ అమలుచేయాలని సంకల్పించింది. అయితే మొత్తం రిజర్వేషన్లు 50 శాతాన్ని మించి పోతున్నాయని పేరొంటూ హైకోర్టు ఈ ఉత్తర్వులను కొట్టేసింది. దీనిపై కేసీఆర్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు అప్పీల్‌కు వెళ్లింది.
సుప్రీంకోర్టు ఆమోదించకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్పీల్ వెనకి తీసుకుని, ఆర్డినెన్స్ 2/2018 జారీచేసి బీసీలకు 22 శాతం రిజర్వేషన్ మాత్రమే కల్పించి పంచాయతీ ఎన్నికలు నిర్వహించింది. తెలంగాణ రాష్ట్రం ఒక్కటే కాదు సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధంగా రిజర్వేషన్లు పెంచుతూ బీహార్, రాజస్థాన్, కేరళ రాష్ట్రాలు చేసిన చట్టాలను కూడా కోర్టులు రద్దు చేశాయి. ప్రస్తుతం తమిళనాడు రాష్ట్రంలో మాత్రమే 50 శాతం మించి రిజర్వేషన్లు అమలు అవుతున్నాయని, అయితే అక్కడ మొదటిసారి 1990లో ఆర్డినెన్స్ తీసుకొచ్చి చట్టం చేసినప్పుడు రాష్ట్ర హైకోర్టు కొట్టివేసింది.
మూడుసార్లు ఆర్డినెన్స్ తీసుకొచ్చి, జీవోలు ఇచ్చిన ప్రతిసారి ఆ రాష్ట్ర హైకోర్టు కొట్టివేసింది. చివరిగా1994లో జయలలిత పనిగుట్టకొని ఢిల్లీకి వెళ్లి అప్పటి ప్రధాని పీవీ నరసింహారావుపై ఒత్తిడి తీసుకొని వచ్చి బిల్లును 9వ షెడ్యూల్ కింద పార్లమెంటు ఆమోదం తెలిపిన తర్వాతే అమల్లోకి వచ్చాయని న్యాయ నిపుణులు చెప్తున్నారు. నిజానికి రాష్ర్టాలు చేసే కులగణన కూడా చెల్లుబాటు కాదని కేంద్రం ఎప్పుడో చెప్పింది. అలాంటి చెల్లబాటు కాని కులగణన ఆధారంగా 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పడం.. రిజర్వేషన్లను పూర్తిగా ఎగ్గొట్టే కుట్ర తప్ప మరోటి కాదని బీసీ సంఘం నేతలు ఆరోపిస్తున్నారు.
అంతన్నారింతన్నారే..!
మేం కులగణన చేసి చూపిస్తామని పార్లమెంటులో చెప్పాం. కోటాపై కట్టిన 50శాతం కృత్రిమ గోడనూ కూలగొడతామన్నాం. తెలంగాణలో లక్షల మందితో సంప్రదించి ప్రశ్నలను ఖరారు చేశారు. కులగణనను పక్కాగా చేయడంతోపాటు 50% దాటొద్దన్న పరిమితిని కూడా బద్దలు కొట్టే ప్రయత్నం చేశారు.
రాష్ట్రంలో త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42శాతం కోటా కల్పిస్తాం. అందుకోసం రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ చట్టపరంగా కల్పించలేని పరిస్థితి ఏర్పడితే కాంగ్రెస్ పార్టీపరంగా 42శాతం సీట్లు ఇస్తుంది. బీఆర్ఎస్, బీజేపీలూ 42శాతం సీట్లు బీసీలకు ఇవ్వాలి.
(సమగ్ర ఇంటింటి సర్వేపై శాసనసభలో మాట్లాడుతూ రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు)
9వ షెడ్యూల్లో చేర్చితేనే ప్రయోజనం.. బీసీ ఇంటెలెక్చువల్స్ ఫోరమ్ చైర్మన్, మాజీ ఐఏఎస్ చిరంజీవులు
బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ ఎన్నికల సమయంలో ప్రభుత్వం తీసుకొచ్చే ఆర్డినెన్స్‌ను చూసి బీసీలు మరోసారి మోసపోవద్దని బీసీ ఇంటెలెక్చువల్స్ ఫోరమ్ చైర్మన్, మాజీ ఐఏఎస్ టీ చిరంజీవులు విజ్ఞప్తి చేశారు. బీసీ సంక్షేమం, రాజకీయ ప్రయోజనాలను పరిరక్షించాలంటే 9వ షెడ్యూల్ మాత్రమే శరణ్యమని పేర్కొన్నారు. 2018లో రాష్ట్ర ప్రభుత్వం నూతన పంచాయతీరాజ్ చట్టాన్ని తీసుకొచ్చిందని, ఇందులో సెక్షన్-9 ప్రకారం బీసీలకు 34% రిజర్వేషన్ కల్పించిందని చెప్పారు.
ఆ తర్వాత 2018 జూన్‌లో స్థానిక సంస్థలన్నింటిలోనూ బీసీలకు 34% రిజర్వేషన్ అమలుచేస్తూ జీవో-396ను జారీ చేసిందని పేర్కొన్నారు. అయితే, మొత్తం రిజర్వేషన్లు 50 శాతాన్ని మించి పోతున్నాయని పేర్కొంటూ హైకోర్టు ఈ జీవోను కొట్టేసిందని తెలిపారు. దీనిపై అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్ చేయగా, కోర్టు ఆమోదించలేదని పేర్కొన్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అప్పీల్‌ను వెనకి తీసుకుని, ఆర్డినెన్స్ 2/2018 జారీచేసి బీసీలకు 22% రిజర్వేషన్ మాత్రమే కల్పించి పంచాయతీ ఎన్నికలను నిర్వహించిందని తెలిపారు. ఎన్నికల సమయంలో బీసీలను ఆకర్షించేందుకు తాతాలికంగా తీసుకొచ్చే ఈ విధమైన ఆర్డినెన్స్‌లు కోర్టులో నిలబడవు అని అభిప్రాయపడ్డారు.
9వ షెడ్యూల్లో చేర్చడమే పరిష్కారం
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చట్టబద్ధతకు 9వ షెడ్యూల్లో చేర్చడమే పరిష్కారం. మిగతావన్నీ బీసీలను ఏమార్చడమే. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం దిగజారుడుతనానికి నిదర్శనం. ఆనాడు బీసీ రిజర్వేషన్ అంశం అసెంబ్లీలో చర్చకు వచ్చినప్పుడు ఢిల్లీ స్థాయిలో ఒత్తిడి తెస్తాం.. రిజర్వేషన్లు సాధిస్తాం.. అని గొప్పలు చెప్పారు. వాటిపై కాంగ్రెస్ ఒక్కదానికీ కట్టుబడి ఉండలేదు. తరచూ ఢిల్లీ పర్యటనలు చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. విజ్ఞాపనపత్రాలు ఇస్తున్నారు. కానీ, బీసీ రిజర్వేషన్ల చట్టబద్ధతకు ఎలాటి చొరవ తీసుకోలేదు. కేంద్రంపై ఎలాంటి ఒత్తిడీ తీసుకురాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీసీ రిజర్వేషన్ల అంశంపై చీల్చి చెండాడాలి. నేడు చైతన్యవంతమైన బీసీ సమాజం కాంగ్రెస్‌కు తప్పకుండా గుణపాఠం చెప్పాలి.
– సిరికొండ మధుసూదనాచారి, శాసనమండలిలో ప్రధాన ప్రతిపక్ష నేత
మళ్లీ బీసీలను మోసగించిన కాంగ్రెస్
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి బీసీలను మోసగించింది. సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నప్పటికీ అమలుకు సాధ్యం కాని విధంగా 42 శాతం రిజర్వేషన్లపై ఆర్డినెన్స్ తెస్తామంటున్నది. స్థానిక ఎన్నికలను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ సిద్ధంగా లేదు. అందుకే మొదటి నుంచి కులగణనలో కూడా శాస్త్రీయతను పాటించలేదు. ఎన్నికల నిర్వహణపై దాటవేత ధోరణిని అవలంబిస్తోంది. ప్రభుత్వానికి స్థానిక ఎన్నికలు నిర్వహించాలనే చిత్తశుద్ధి ఉండి ఉంటే అసెంబ్లీ, మండలిలో బిల్లు ఆమోదం పొందగానే గవర్నర్‌తో ఆమోదింపజేసుకొని గెజిట్ తీసుకొచ్చి ఎన్నికలు నిర్వహించేది. కానీ ఏడాదిపాటు ఎన్నికలు నిర్వహించకుండా స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసింది. ఆర్డినెన్స్ తెచ్చి.. కోర్టుల్లో వీగిపోయేలా చేసే కుట్రకు మరోసారి తెరలేపింది.
– వద్దిరాజు రవిచంద్ర, రాజ్యసభ సభ్యుడు
తమిళనాడు తరహా రిజర్వేషన్లు కావాలి
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి ఆర్డినెన్స్ ఇవ్వడం ఏ విధంగానూ చట్టబద్ధత కల్పించినట్టు కాదు. బీసీలను మోసం చేయడానికి ఇది మరో రూపం మాత్రమే. తెలంగాణ ప్రభుత్వం కూడా తమిళనాడు తరహాలో రిజర్వేషన్లు కల్పించాలి. ఇందుకు రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది. 1990లో రాజ్యాంగ సవరణ జరిగిన తర్వాతే అక్కడ రిజర్వేషన్లు ఖరారయ్యాయి. రిజర్వేషన్లు చట్టబద్ధం కాకుండా స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లలేం. వెళ్లినా న్యాయపరమైన చిక్కులు వస్తాయి. ఎవరైనా కోర్టుకు వెళ్తే న్యాయస్థానం ఎన్నికలపై స్టే ఇచ్చే అవకాశం ఉంటుంది. పార్లమెంటు ద్వారా రాజ్యాంగ సవరణ చేయించి బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 42 శాతం రిజర్వేషన్లను 9వ షెడ్యూల్లో చేర్చడమొకటే పరిషారం.
-గంగుల కమలాకర్, కరీంనగర్ ఎమ్మెల్యే
కాంగ్రెస్ సర్కార్‌కు చిత్తశుద్ధి లేదు
బీసీ రిజర్వేషన్‌పై ప్రభుత్వం ఆర్డినెన్స్ ఇవ్వడం మసిపూసి మారేడుకాయ చేయడమే. ఇది ఎన్టీఆర్ కాలం నుంచి జరుగుతున్న తంతు. అంబేద్కర్ అందరి గురించి ఆలోచించారు. రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఇన్ని డ్రామాలు చేయాల్సిన అవసరం లేదు. ఇది కుడి చేత్తో ఇచ్చి ఎడమచేత్తో లాక్కొనే ప్రయత్నం. బీసీలకు చట్టసభల్లో 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వకపోతే కాంగ్రెస్‌కు బీసీలు బుద్ధిచెప్తారు. బీసీల్లో చైతన్యం బాగా పెరిగింది. బీసీలు ఐఏఎస్, ఐపీఎస్, ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు. ఇప్పటి ప్రభుత్వాలు మాయ చేస్తే ఊరుకొనే పరిస్థితి బీసీ వర్గాల్లో అసలే లేదు.
-దుర్గం రవీందర్, తెలంగాణ బీసీ ఉద్యోగుల సంఘం సలహాదారు
రాజకీయ డ్రామా
రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొస్తే న్యాయ పరిశీలనలో నిలబడదు. న్యాయపరమైన సమస్యలు వస్తాయి. ఇది బీసీలను మోసం చేయడమే. ప్రామాణిక పద్ధతులు పాటించకుండా ఆర్డినెన్స్ తేవడం రాజకీయ డ్రామానే. ప్రభుత్వమే ఆర్డినెన్స్ తీసుకురావాలనుకున్నప్పుడు రూ.160 కోట్లు పెట్టి కుల సర్వే చేయడం ఎందుకు? డెడికేషన్ కమిషన్ ఎందుకు ఏర్పాటుచేసినట్టు? డెడికేషన్ కమిషన్ ఇచ్చిన నివేదికలు ఎక్కడ పెట్టారు? వాటిని చట్టసభల్లో టేబుల్ కూడా చేయలేదు. ఆర్డినెన్స్ తీసుకొచ్చేదానికైతే ఏడాదిన్నర కాలంపాటు ఎందుకు ఆలస్యం చేసినట్టు? ఇది బీసీలను మోసగించడం కాదా?
-వకుళాభరణం కృష్ణమోహన్‌రావు, బీసీ కమిషన్ మాజీ చైర్మన్
అసెంబ్లీని అవమానించడమే
బీసీ రిజర్వేషన్ల అమలుపై రాష్ట్ర మంత్రిమండలి వ్యవహరించిన తీరు అసెంబ్లీని అవమానించినట్టుగానే ఉన్నది. బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలనే చిత్తశుద్ధి ఉంటే ఆర్డినెన్స్ తేవడానికి రెండేండ్లు ఎందుకు పట్టింది. ఏడాదిగా స్థానిక సంస్థల ఎన్నికలను ఎందుకు వాయిదా వేశారు. మొదటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం బీసీలను మభ్యపెట్టే ప్రయత్నమే చేసింది. రాష్ట్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లు అమలు చేసే చిత్తశుద్ధి లేకపోవడంతో బీసీ కమిషన్‌తో మమ అనిపించే ప్రయత్నం చేశారు. బీఆర్ఎస్ డిమాండ్ తర్వాతే డెడికేటెడ్ కమిషన్ వేశారు. బీసీ జనగణనను శాస్త్రీయ పద్ధతిలో చేపట్టలేదు. కులాల లెక్కలు తారుమారు చేశారు. అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లకుండా చేశారు. కొత్త కథ చెప్తున్నరు. ఇంత కాలయాపన ఎందుకు పట్టింది. ఆ రోజే జీవో ఇస్తే సరిపోయేది. ఇదంతా న్యాయస్థానాల్లో వీగిపోయేలా చేయాలన్నది ప్రభుత్వ ఉద్దేశం.
– ఆంజనేయగౌడ్, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు
ఆర్డినెన్స్ పనికి రాదు
బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 42 శాతం రిజర్వేషన్లను 9వ షెడ్యూల్లో చేర్చకుండా తెలంగాణ ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకురావడం బీసీలను మోసగించడం తప్ప మరేం కాదు. అందుకు సీఎం రేవంత్‌రెడ్డి రాజకీయ డ్రామాలు పకనపెట్టి తమిళనాడు తరహాలో తక్షణమే అన్ని రాజకీయ పార్టీలతో కూడిన అఖిలపక్షాన్ని ఏర్పాటు చేసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి రాజకీయంగా ఒత్తిడి చేస్తేనే సాధ్యమవుతుంది. లేదంటే రేవంత్ సర్కారు తీసుకొచ్చే ఆర్డినెన్స్ నాలుక గీసుకోవడానికి కూడా పనికి రాదు.
-పల్లె రవికుమార్‌గౌడ్, కల్లుగీత కార్పొరేషన్ మాజీ చైర్మన్
ఆర్డినెన్స్ కంటే గెజిట్ నోటిఫికేషన్‌కే చట్టబద్ధత
బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం తీసుకొచ్చే ఆర్డినెన్స్ చెల్లదు. ఆర్డినెన్స్ కంటే అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి.. గవర్నర్ ఆమోదం ద్వారా గెజిట్ విడుదల చేస్తే చట్టబద్ధత ఉంటుంది. ఆర్డినెన్స్‌కు చట్టబద్ధత ఉండదు. ఇది కోర్టుల్లో నిలబడే అవకాశం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వానికి, సీఎం రేవంత్‌రెడ్డికి బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలనే చిత్తశుద్ధి లేదు. కేవలం బీసీలను మభ్యపెట్టడమే వారి ఆలోచన. ఈ విషయంలో రేవంత్‌కు చిత్తశుద్ధిలేదు. రాహుల్‌గాంధీ ఇచ్చిన మాట మేరకు ఆయన మెప్పు కోసం సీఎం పదవిని కాపాడుకునేందుకు రేవంత్‌రెడ్డి చేసే ప్రయత్నం. బీసీలపై కాంగ్రెస్ పార్టీకి, సీఎం రేవంత్‌రెడ్డికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీలో బిల్లుపెట్టినప్పుడే ఆర్డినెన్స్ తెస్తే ఇప్పటికే ఎన్నికలు పూర్తయ్యేవి. ప్రభుత్వ తీరు చూస్తుంటే బీసీలను నమ్మించి నట్టేట ముంచేలా ఉంది.
– ఓరుగంటి వెంకటేశంగౌడ్, తెలంగాణ బీసీ సంఘాల జేఏసీ చైర్మన్
స్థానిక ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధంగా లేదు
స్థానిక ఎన్నికలు ఎదుర్కొవడానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సిద్ధంగా లేరు. అందుకే బీసీ రిజర్వేషన్లపై డ్రామాలు ఆడుతున్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడానికి ప్రభుత్వానికి, సీఎంకు ఎంత మాత్రం ఇష్టంలేదు. మొదటినుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేశారు. కులగణన చేయడం సీఎంకు, రాష్ట్ర ప్రభుత్వానికి ఎంతమాత్రం ఇష్టంలేదు. అందుకే కోర్టు అక్షింతలు వేస్తేనే ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల విషయంలో డెడికేషన్ కమిషన్ వేసింది. ఢిల్లీ పేరుతో సీఎం పదేపదే డ్రామాలు చేసిండు. బీసీ రిజర్వేషను ్ల అమలు చేయాలంటే గతంలో 9 షెడ్యూల్ అన్నారు. మళ్లీ ఇప్పుడేమో ఆర్డినెన్స్ తేవడానికి ప్రయత్నిస్తున్నరు.
బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలనే చిత్తశుద్ధి ఉంటే.. అప్పుడే అసెంబ్లీలో ఆమోదించుకొని స్థానిక ఎన్నికలకు వెళ్తే సరిపోయేది. అసెంబ్లీ ఆమోదించిన బిల్లును రాష్ట్రపతికి పంపకుండా గవర్నర్‌తో ఆమోదించుకొని ఆర్డినెన్స్ తెచ్చి ఎన్నికలు నిర్వహిస్తే సరిపోయేది. స్థానిక ఎన్నికలను ఎదుర్కోవడానికి సిద్ధంగా లేదని సీఎం రేవంత్‌రెడ్డి.. ఏడాది కాలంగా ఎన్నికలను వాయిదా వేస్తూ వచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల వ్యతిరేకతను తప్పించుకునేందుకు సెప్టెంబర్‌లో ఎన్నికలు నిర్వహిస్తామని టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ ప్రయత్నిస్తున్నారు. ఎన్నికలను అడ్డుకునేందుకు వాళ్లే కోర్టుల్లో కేసులు వేయించే అవకాశం ఉన్నది.
– రాజారాంయాదవ్, బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు
కోర్టు కొట్టేస్తుందని తెలిసీ కాంగ్రెస్ మోసం
గతంలోనే బీసీలకు 42శాతం రిజర్వేషన్లపై అసెంబ్లీలో తీర్మానం చేశారు. కేంద్రంపై నెపం నెట్టాలని చూశారు. 2018లో బీఆర్ఎస్ కూడా బీసీలకు 34 శాతం కల్పిస్తూ చట్టం చేసింది. కానీ హైకోర్టు దానిని కొట్టేసింది. సుప్రీంకోర్టు విధించిన 50 శాతం సీలింగ్‌కు అనుగుణంగానే బీసీల రిజర్వేషన్‌ను 22శాతానికి తగ్గించింది. ఈ విషయాలన్నీ కాంగ్రెస్‌కు తెలుసు. కోర్టులో నిలబడదని తెలిసీ కామారెడ్డి డిక్లరేషన్ పేరిట కాంగ్రెస్ మోసం చేసింది. రిజర్వేషన్లు ఇచ్చినట్టే ఇచ్చి కోర్టే కామారెడ్డి డిక్లరేషన్‌ను కొట్టేసిందని చెప్పుకోవడానికే కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్డినెన్స్‌ను జారీ చేస్తామంటున్నది. ఆర్డినెన్స్ జారీ చేయడానికైతే ఇంతకాలం ఎందుకు జాప్యం చేశారు. ఇది బీసీలను మోసం చేయడమే.
– విఠల్, బీజేపీ అధికార ప్రతినిధి
మోసపూరిత చర్యే
కాంగ్రెస్ వ్యవహారమంతా మోసపూరిత చర్యగా భావిస్తున్నాం. 42 శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలనే చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వం జీవో తీసుకొచ్చి అమలు చేయాలి. రిజర్వేషన్లు 50శాతానికి మించి అమలు చేయడం కుదురదని సుప్రీంఇచ్చినతీర్పు విషయం.. సీఎంకు, మంత్రులకు, కాంగ్రెస్ నేతలందరికీ తెలుసు. అయినా బీసీలను మోసం చేసేందుకు ఆర్డినెన్స్ తెస్తామంటున్నారు. బీసీ బిల్లు కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్నదని తప్పించుకోవద్దు. కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పితే బీజేపీ ప్రభుత్వం ఎందుకు 42 శాతం రిజర్వేషన్లను అమలుచేస్తుంది. కేంద్రం అమలు చేయకున్నా..జీవో తీసుకొచ్చి అమలు చేస్తే కాంగ్రెస్‌ను నమ్ముతారు.
– కొండూరు సత్యనారాయణ, ఎంబీసీ సంఘాల సమితి జాతీయ కన్వీనర్