హైదరాబాద్, నవంబర్ 8 (నమస్తే తెలంగాణ): జూబ్లీహిల్స్ ఉపఎన్నిక సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల నిబంధనలను తుంగలో తొకుతూ ప్రణాళికాబద్ధంగా అక్రమాలకు పాల్పడుతున్నదని బీఆర్ఎస్ ఎమ్మె ల్సీ దాసోజు శ్రవణ్‌కుమార్ ఆరోపించారు. శనివారం బీఆర్కేభవన్‌లోని రాష్ట్ర ఎన్నికల ప్రధా న అధికారి (సీఈవో-తెలంగాణ)కి ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి ఫిర్యాదుచేశారు. ఈ సందర్భంగా మీడియాతో దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పోలీసులు, టాస్‌ఫోర్స్ అధికారులు కాంగ్రెస్ నేతలతో కుమ్మకై బీఆర్ఎస్ కార్యకర్తలపై అరాచకంగా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డి జన్మదినం పేరుతో ఎర్రగడ్డ డివిజన్లో భారీగా కేకులు కట్ చేయడం, విందులు ఏర్పాటుచేయడం, చీరలు పంచడం వంటివి పూర్తిగా ఎన్నికల నిబంధనలకు వ్యతిరేకమని పేర్కొన్నారు. ఎన్నికల కమిషన్ అధికారులు, పోలీసు ఉన్నతాధికారులు దీనిపై మౌనం వహించడం ప్రజాస్వామ్యానికి అవమానకరమని విమర్శించారు. కాంగ్రెస్ నేతలతో కుమ్మ కై ఎంఐఎం నాయకులు కూడా అక్రమంగా శిబిరాలు ఏర్పాటుచేశారని ఆరోపించారు.